Aug 26,2023 15:21

ప్రజాశక్తి-కాకినాడ : సిపిఎం నాయకులు మద్దింశెట్టి రాజగోపాల్‌ 3వ వర్దంతి సందర్భంగా శనివారం స్థానిక సుందరయ్య భవన్‌లో రాజగోపాల్‌ చిత్ర పటానికి సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సిపిఎం కాకినాడ రూరల్‌ కన్వీనర్‌ తిరుమలశెట్టి నాగేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు కె.వీరబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. రాజగోపాల్‌ చివరి వరకు పార్టీకి అంకిత భావంతో పని చేశారని తెలిపారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజా ఉద్యమాలకు సహకరించేవారన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యునిగా, పార్టీ కాకినాడ సిటీ కమిటీ సభ్యునిగా, పార్టీ శాఖ కార్యదర్శిగా పని చేశారని రాజశేఖర్‌ తెలిపారు. రాజగోపాల్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్‌.అజరు కుమార్‌, పి.వీరబాబు, మలకా రమణ, ఎం.జి.సూరిబాబు, జి.దినేష్‌, తదితరులు పాల్గొన్నారు.