Oct 24,2022 12:38
  • 'రేషన్‌' వాహనాల్లో జిసిసి సరుకుల విక్రయం
  • ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభం

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : గిరిజన సహకార సంస్థ (జిసిసి) తమ ఉత్పత్తుల అమ్మకాలకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గిరిజన రైతులు పండించిన పంటలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటి ఉత్పాదక సామర్థ్యం పెంచడంతోపాటు నాణ్యమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు ఇంటివద్దకే తీసుకెళ్లి వినియోగదారులకు అందించేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండియు) ఆపరేటర్ల ద్వారా నవంబరు ఒకటో తేదీ నుంచి జిసిసి ఉత్పత్తుల అమ్మకాలను ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. తొలుత విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ఎండియు వాహనాల్లో జిసిసి ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఆ రెండు జిల్లాల్లో ఇది సత్ఫలితాలను ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. రేషన్‌ సరుకులతోపాటు జిసిసి ఉత్పత్తులను వినియోగదారుల ఇంటి ముందుకు తీసుకెళ్లడం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని జిసిసి అధికారులు భావిస్తున్నారు. వీటి అమ్మకాలకు ముందుకొచ్చిన రేషన్‌ డిపో డీలర్‌కుగానీ, ఆపరేటర్‌కుగానీ కమీషన్‌ చెల్లించనుంది. జిసిసి ఉత్పత్తులైన కుంకుమ పొడి, పసుపు పొడి, బొబ్బర్లు, రాజ్‌మా, షీకాయ, కుంకుడుకాయ షాంపులు, పౌడర్లు, ఉసిరి పౌడర్‌, పిక్క తీసిన చింతపండు, పిక్క చింతపండు, టెర్మారిక్‌, నీమ్‌, జాస్మిస్‌, అలోవెరా, మారేడు షర్బత్‌, నన్నారీ షర్బత్‌, త్రిఫల చూర్ణం, త్రిఫల రసం, కాఫీ, తేనె, హనీ క్రీమ్‌, సోప్‌నట్‌ హెయిర్‌వాష్‌, పెయిన్‌ రిలీఫ్‌ ఆయిల్‌కు మంచి గిరాకీ ఉంది. వీటి అమ్మకాలు పెరిగితే, ఆ మేరకు గిరిజనుల నుంచి సేకరించే ఉత్పత్తుల పరిమాణం కూడా పెరగనుందని జిసిసి ఎమ్‌డి జి.సురేష్‌కుమార్‌ 'ప్రజాశక్తి'కి తెలిపారు. గిరిజనులకు జిసిసి అండగా ఉండాలన్న ఆలోచనతో తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు. అమ్మకాలు పెరిగితే గిరిజనులకు మేలు చేకూరుతుందని, వ్యాపారుల మోసాలకు గురికాకుండా ఉంటారని అధికారులు చెప్తున్నారు.