Dec 12,2022 13:00

ఏలూరు : గిరిజన విద్యారంగానికి సంబంధించిన విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపి మూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆశ్రమ పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఐటిడిఏ వద్ద నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా ... ఏలూరు జిల్లా కేఆర్‌ పురం ఐటీడీఏ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమాన్ని బి.గోపి మూర్తి ప్రారంభిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ చూపించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన విద్యారంగ సమస్యలపై 18సార్లు అధికారులకి మెమొరాండం ఇచ్చినా , అక్టోబర్‌ 15 నుంచి 22 వరకు అన్ని ఐటిడిఎ ఆశ్రమ పాఠశాలలకు జీపు జాత నిర్వహించి, నవంబర్‌ 20వ తేదీన రాష్ట్రస్థాయి సదస్సును పాడేరులో నిర్వహించి, సదస్సు అనంతరం అధికారులకు సమస్యలపై వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, ప్రభుత్వం అధికారులు గిరిజన విద్యారంగ సమస్యల పట్ల తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. కనీసం చర్చలకు పిలిచి కొన్ని సమస్యల పరిష్కరించడానికి టైం బౌండ్‌ అగ్రిమెంట్‌ కూడా లేదని, అలాగే సదస్సుకు అధికారికంగా అధికారుల్ని ప్రజాప్రతినిధులను పిలిచిన ఎవరు హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సమస్య ఆర్థిక శాఖపై నెట్టి ఒక్క సమస్య పరిష్కారం చేయడం లేదని, గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఉన్న సమస్యలతోపాటు కొత్త సమస్యలు పరిష్కారం కాక ఉపాధ్యాయుల తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘ నాయకులు తెల్లం రామకఅష్ణ మాట్లాడుతూ ... గిరిజన విద్యారంగంలో జీవో నెంబర్‌ 3 సుప్రీం కోర్టులో కొట్టివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో కి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకపోవడం వల్ల గిరిజన ఉపాధ్యాయ నియామకం, ప్రమోషన్లు రకరకాల సమస్యలు అన్ని పెండింగ్‌లో ఉండిపోతున్నాయని దీని మీద ఒక స్పష్టమైన వైఖరి కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదని అన్నారు. ఆప్‌ గ్రెడేషన్‌ , డీఈఓ డివైఈఓ పోస్టులు, జూనియర్‌ కాలేజీల స్థాపన, అధ్యాపకుల నియామకం ప్రక్రియ సందిగ్ధంగా పడిందని, సిఆర్టిల రెగ్యురైజేషన్‌ ఊసేలేదని, భాషా వాలంటీర్లకు బడ్జెట్‌ కేటాయించినా, నియామకాలు లేవని, ఇలా ఉపాధ్యాయుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం గిరిజన విద్యారంగానికి సంబంధించి వస్తున్న సమస్యలను పరిష్కరించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థి సంక్షేమ శ్రేయోభిలాషులు ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్‌ అధ్యక్షులు పిఎస్‌ విజయరామరాజు, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్‌ సుధారాణి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వీ.కనదుర్గ జీలుగుమిల్లి ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకటేశ్వరరావు, కుక్కునూరు మండల ప్రధాన కార్యదర్శి ఎం.డి.ముషబ్బర్‌ కొయ్యలగూడెం మండల ప్రధాన కార్యదర్శి కె.ఈశ్వర్‌ , యు.టి.యఫ్‌.సీనియర్‌ నాయకులు షేక్‌ బాజీ, ఏజెన్సీ మండలాల ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.