అరిటాకు లాంటి ఆకులు అందమైన ఆకారంలో గుబురుగా విచ్చుకొని పెరిగే అరుదైన మొక్క ట్రావెలర్స్ ఫామ్. పర్యాటక శోభనద్దే ఈ మొక్కలలో ఎన్నో విశిష్టతలున్నాయి. రావేనలా అని పిలిచే ఈ మొక్క శాస్త్రీయ నామం మోనోకోటిలెడొనస్. ఇది దక్షిణాఫ్రికాకు చెందిన స్టెల్జియేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈస్ట్‌వెస్ట్ ఫామ్ అని కూడా అంటారు. చాన్నాళ్లు ఎదిగిన తర్వాత మధ్యలోంచి అరటిపువ్వు లాంటి ఒక పువ్వు పూస్తుంది. అది కూడా నాలుగు నుంచి ఆరు నెలల వరకు అలరిస్తుంది. ట్రావెలర్స్ ఫామ్‌లోని పదుల రకాల్లో మొక్కలు ఉన్నాయి. ఆకులు పొడవుగా, బలంగా ఉండడం చేత అడవి ఆకుల మొక్క అని కూడా పిలుస్తారు. ఆకులు ఆకుపచ్చ నుండి బూడిద రంగులోకి మారుతూ ఉంటాయి. ఈ మొక్క తన ఆకుల్లో వర్షపు నీటిని దాచుకుంటుంది. వయసుతోపాటు మొక్క కాండం లావుగా ఊరుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ట్రావెల్స్ ఫామ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
- అభిస్సినియన్ బనానా..
ఆర్నమెంటల్ అడవి బనానా అని పిలిచే ఈ మొక్క శాస్త్రీయ నామం ఎన్షెట్ వెంట్రికోసం. ఈ మొక్క పది నుంచి 15 ఏళ్ల వరకు పెరుగుతూ అలరిస్తుంది. ఒక్కో ఆకు దాదాపు మూడు నెలల వరకు తాజాగా కనిపిస్తుంది. కింది ఆకులు వాడిపోతుంటే మొవ్వుల్లోంచి కొత్తగా చిగురు వస్తుంది. మధ్యలో పెద్ద గెల వస్తుంది. ఫామ్ హౌస్లు, ఇంటి ముంగిట, ల్యాండ్ స్కేపిం గుళ్లో, పార్కుల్లో, ఆఫీసుల్లో, పెద్ద పెద్ద జాగాల్లో పెంచుకుంటే ఈ మొక్కలు ఆ ప్రాంతాలకే కొత్త అందాలు అద్దుతాయి.
- రేవేనాల మడ్గాస్కరియన్సిస్ ఫోన్..
ట్రావెలర్ ఫామ్స్‌లో రాణిమొక్కగా పిలిచేది రేవేనాల మడ్గాస్కరియన్సిస్ ఫోన్. మొదలు కొబ్బరి చెట్టు మాదిరిగా ఉండి, అరచేయి చాచినట్లుగా ఆకులు విచ్చుకోవటం దీని ప్రత్యేకత. కొంతమేర కాండంతో కూడిన ఆకు ఉంటుంది. పాము పడగవిప్పినట్టు ఒక క్రమబద్ధమైన పొందికలో ఆకులు ఉంటాయి. పెద్ద పెద్ద విగ్రహాలకు వెనుక భాగంలో ఈ మొక్కలను పెంచుతూ ఉంటారు. విగ్రహాల వెనుక విచ్చుకున్న ఆకులు సర్పాకారంగా ఆ విగ్రహానికే కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. ఆకు మొదలు లేత గోధుమరంగులో, ఆకులు ఆకుపచ్చగాను ఉండి.. అందంగా ఉంటాయి.
- రేవేనాల మడ్గాస్కరియన్సిస్ ఫోన్ డ్వార్ఫ్..
ట్రావెల్స్ ఫామ్‌లోని డ్వార్ఫ్ జాతి మొక్క రేవేనాల మడ్గాస్కరియన్సిస్ ఫోన్ డ్వార్ఫ్. చిన్న ఆకులతో మొక్క పొట్టిగా ఉంటుంది. ఆకులపై పులిచారల్లాంటి డిజైన్ మరింత అందంగా ఉంటుంది. ఇండోర్, సెమిషేడ్ వాతావరణంలో, కుండీల్లో పెంచుకోవచ్చు. నత్రజని ఎరువు అవసరమౌతుంది.
- హెల్కోనియా బిహై..
ట్రావెల్స్ మొక్క సంతతికి చెందిన జాతి హెల్కోనియా బెహై. అరటి ఆకుల్లాంటి చిన్నవి గుబురుగా వస్తాయి. ఆకులు కాస్త గట్టిగా ఉంటాయి. రెండేళ్ల తర్వాత వాటి మధ్య నుంచి పొడవుగా, గొలుసుకట్టుగా ఉండే పువ్వులు పూస్తాయి. ఇవి విభిన్న రంగుల్లో ఆకట్టుకుంటాయి. కొన్ని పసుపు రంగులోను, ఇంకొన్ని ఎరుపు రంగులోను ఉంటాయి. ఒక్కోపువ్వు ఏడాది వరకు విచ్చుకునే ఉంటుంది. కుండీల్లోనూ, నేల మీద సెమీషేడ్ వాతావరణంలో పెరుగుతాయి. ఈ పువ్వులను డెకరేషన్‌కు వాడతారు.
- స్ట్రెలిడ్జియానికోలైరిజల్..
ట్రావెలర్ ఫామ్స్‌లో మరో బుల్లి మొక్క స్ట్రెలిడ్జియానికోలైరిజల్. అందాలు ఆరబోసే ఈ మొక్కలు పూర్తిగా ఇండోర్ మొక్కలు. పింగాణి లేదా గాజు కుండీలలో పెంచుకుంటే ఈ మొక్కలు మరింత అందంగా ఉంటాయి. టీపాయి, టీవీల పక్కన, గది మూలల్లో, హాల్లో, బెడ్‌రూముల్లో పెంచుకోవడానికి ఇంపైన మొక్కలు ఇవి.
- మూసా పారడైసిక..
ఈ మొక్కలను మూస బనానా లేదా మూస పారడైసికా అంటారు. మొక్క మొదట్లోంచి క్రమబద్ధమైన నిర్మాణం కలిగిన ఆకులు రావడం దీని ప్రత్యేకత. మిగతా మొక్కలు కాండం ఉండి, దానిపైన ఆకులు వస్తాయి. ఇది భూమిలోంచే ఆకుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. వయసుతోపాటు అంటే పెరిగేకొద్దీ దీనికి కూడా కాండం వస్తుంది.
- కొరీఫా అబ్లా క్లారిఫెరా..
ఈ ట్రావెలర్ ఫామ్ ఆకులు చినిగినట్లు ఉండటం వీటి ప్రత్యేకత. ఆకులు మధ్యభాగం నుంచి పువ్వులుగా గెలలు వచ్చి, వెంటనే ఎండిపోతాయి. వాటిలో విత్తనాలు తయారవుతాయి. మొక్క నాటిన ఐదేళ్ళ తర్వాత కానీ పుష్పించదు. ఇది కూడా 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీన్ని పార్కుల్లోనూ ల్యాండ్ స్కేటింగ్‌లోను మాల్స్ దగ్గర అలంకరణ కోసం పెంచుతారు.
- స్ట్రెలిట్జియా రెజీనే..
ఈ పొట్టి రకం ట్రావెలర్ ఫామ్ ఆకులు కాస్త వెడల్పుగా ఉంటాయి. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మొక్క మొదలు నుంచి నాలుగైదు పిలకలు బయలుదేరతాయి. దీన్ని అన్నిరకాల వాతావరణంలోనూ పెంచవచ్చు. దీని పువ్వు భలే గమ్మత్తుగా ఉంటుంది. ఒక గెల, దానికి గుబురుగా పువ్వు మొలుస్తుంది. దీనిలో విభిన్న రంగులు ఉంటాయి. ఇది ఒక వింతపక్షిని పోలి ఉంటుంది. అందుకే ఈ పువ్వుని బర్డ్ ఆఫ్డా ప్యారడైజ్ అంటారు.
- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506