- ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య
ప్రజాశక్తి-గుంటూరు:రవాణా రంగ కార్మికుల సమస్యలపై నవంబర్‌లో పెద్ద ఎత్తున చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నామని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య తెలిపారు. ప్రభుత్వ విధానాలను రవాణా కార్మికులు భరించే పరిస్థితి కోల్పోయారని పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం యూనియన్ జిల్లా సమావేశానికి హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ కాలంలో పెట్రోలు ఉత్పత్తులపై రెండు దఫాలుగా ఎక్స్‌జ్ డ్యూటీ పెంచి, మూడు నెలల కాలంలో లీటరు డీజిల్‌పై రూ.16 భారం మోపారని, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెంచుతున్నారని అన్నారు. చిన్న చిన్న యజమానుల్ని ఈ రంగం నుంచి తొలగించి, కార్పొరేట్లకు అప్పగించడానికి 2019లో మోటారు వాహన చట్టానికి సవరణ చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. జిడిపిలో నాలుగు శాతం ఈ రంగం నుంచి వస్తోందన్నారు. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగమని తెలిపారు. వీరికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులూ లేవని, ఏ వాతావరణ పరిస్థితిలోనైనా వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. రవాణా కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం చేయాలని, దానికి విధి విధానాలను యూనియన్‌గా డ్రాఫ్ట్ తయారు చేస్తున్నామన్నారు. ఈ రంగాన్ని కాపాడడానికి మోటారు వాహన చట్టంలో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఊబర్, వోలా, ర్యాపిడోలు కార్మికులు, ప్రయాణికుల రక్తాన్ని తాగుతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా యాప్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మూడింటిపై తామే ప్రత్యేకంగా డాక్యుమెంట్లు తయారు చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు, సెప్టెబర్, అక్లోబర్‌లో దేశ వ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ నిర్వహించి, నవంబర్‌లో ఛలో పార్లమెంట్ చేపడతామన్నారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి లక్ష్మణరావు, నన్నపనేని శివాజీ, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌కె మస్తాన్‌వలి పాల్గొన్నారు.










