ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సుధారాణి డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి నాయకురాలు మాట్లాడుతూ ... నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయని, గ్యాస్ ధర కూడా పెరిగిందని అన్నారు. ధరలు నిరంతరం పెరగటంతో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు కూడా ఎప్పటివి అప్పుడు ఇవ్వకపోవడంతో పధకం నిర్వాహణ భారం అవుతున్నదన్నారు. వీటికితోడు 2019లో నిర్ణయించిన వేతనాలనే నేటికీ అమలు చేయడం వలన కార్మికుల కుటుంబం కూడా గడవటం కూడా కష్టంగా ఉందని వాపోయారు. గౌరవ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్లకు కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని, ధరలు పెరుగుదలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బకాయి ఉన్న బిల్లులు, జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. బిల్లులు వేతనాలు ప్రతినెలా 5 వ తేదిలోపుగా చెల్లించాలని, ఒక నెల మెనూఛార్జీలను అడ్వాన్స్ ఇవ్వాలని, నాణ్యమైన బియ్యం, సరుకులు సివిల్స్‌ల ద్వారా పాఠశాలకు అందించాలన్నారు. పధకం అమలుకు కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. 9, 10 తరగతి పిల్లలకు వండిపెడుతున్న వారికి జీతాలు ఇచ్చి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి ఆరునెలలకు రెండు కాటన్ చీరలు యూనిఫాంగా ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా లో జిల్లా అధ్యక్షులు వి.రామలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు.










