
కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 26న 10 యూట్యూబ్ ఛానెళ్లకు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అగ్నిపథ్ పథకం, జమ్ము-కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి, భారత సైనిక బలగాలకు సంబంధించిన కథనాలతో ఉన్న ఈ వీడియోలు తప్పుడు కథనాలతో, నకిలీ వార్తలతో, మార్ఫ్‌డ్ దృశ్యాలతో కూడివున్నాయని, సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అలాగే అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని నిఘా సంస్థల నివేదిక ప్రకారమే వీటిని బ్లాక్ చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రకటించింది. కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు 45 మాత్రమే ఉన్నాయా! బహిరంగ వేదికలపైనే కాషాయ పరివారం బరితెగించి మైనార్టీలపైనా, ప్రగతిశీల శక్తులపైనా విద్వేష విషం చిమ్ముతున్నా మోడీ సర్కార్ నిఘా సంస్థలకు పట్టడం లేదు ఎందుకని? కేవలం పాలకులకు నచ్చని అంశాలు ప్రసారం చేయడమే 'విద్వేషమా?', వారి అనుయాయులు చిమ్మే విద్వేష విషాన్ని మాత్రం అలాగే కొనసాగనిస్తారు.
బహిరంగ వేదికలు, వార్తా ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో విద్వేష జాడ్యం జడలు విప్పి నర్తిస్తుంటే ఇంత మౌనమేంటి? అంటూ మోడీ సర్కార్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల నిగ్గదీసి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం యూట్యూబ్ ఛానెళ్ల వీడియోలను బ్లాక్ చేసిందన్న సంగతి గమనార్హం. కానీ సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా ప్రస్తావించిన టి.వి ఛానెళ్ల సంగతిని మోడీ సర్కార్ కావాలనే వదిలిపెట్టేస్తోంది. రిపబ్లిక్ టి.వి వంటి సంస్థలు మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని నిత్యం విద్వేష ప్రసారాలతో రెచ్చిపోతున్నా...మోడీ సర్కార్ మిన్నకుండిపోతోంది. ఇక నేరుగా బిజెపి ఐ.టి సెల్ నేతృత్వంలో సామాజిక మాధ్యమాల్లో నిర్వహిస్తున్న ఛానెళ్లకు, పేజీలకు హద్దే లేదు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ వీటివైపు కన్నెత్తి కూడా చూడదు.
విద్వేష, విభజన జాడ్యాలు భారత్‌కు కొత్త కాదు కానీ, వాటికి పాల్పడేవారికి ప్రభుత్వమే అండగా నిలవడం, వెన్నుతట్టడం బిజెపి హయాంలోనే మితిమీరిపోతోంది. అఖండ హిందూ దేశ స్థాపనే లక్ష్యంగా మైనార్టీ ప్రజలను సంపూర్ణంగా నిర్మూలించాలంటూ సంఫ్‌ు పరివార్, దాని అనుబంధ సంస్థలు పదేపదే బహిరంగంగా పిలుపులిస్తున్నా...ఉదాసీనంగా వ్యవహరించడం మోడీ సర్కార్ అసలు నైజానికి నిదర్శనం. ఊచకోతలకు, మారణహోమానికి పిలుపునిచ్చిన ఉన్మాదుల ప్రసంగాల వీడియోలు విశ్వవ్యాప్తమై దేశాన్ని అప్రదిష్టపాల్జేసిన సంగతి తెలియంది కాదు. బిజెపి అధికార ప్రతినిధిగా ఉంటూ నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను ఎంత దిగజార్చాయో విదితమే. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలకు మతోన్మాద ప్రమాదం పొంచి ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇవన్నీ సామాన్యులకు ఆవేదన కలిగిస్తున్నాయి కానీ, పాలకులకు మాత్రం చీమ కుట్టినట్టైనా లేదు. హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ నోరు తెరవక ముందే, అతని మనసులో ఏమున్నదో కనిపెట్టి కేసులు పెట్టగల దిట్టలకు, వారి పరివారపు ప్రసంగాల్లో, చర్యల్లో ఏ విషమూ కనిపించకపోవడం విస్మయకరం !
భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. హింసను ప్రేరేపించనటువంటి, ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయనటువంటి ఏ భావాలనైనా కలిగివుండే హక్కును, ప్రచారం చేసుకునే హక్కును రాజ్యాంగమే కల్పించింది. కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విద్వేష జాడ్యం ఎవరు ప్రదర్శించినా చర్యలు చేపట్టాల్సిందే. మొబైల్ ఇంటర్నెట్ ఫలితంగా సాంప్రదాయ ప్రచార మాధ్యమాల కంటే వాట్స్‌యాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని సమాచారం ప్రజల చెంతకు వేగంగా చేరుతోంది. అయితే ఈ సామాజిక మాధ్యమాలు ఆదాయ ఆర్జన కోసం పాలకులకు లొంగిపోయి రాజకీయ లక్ష్యాల కోసం పని చేస్తున్నాయన్నది యదార్థం. విద్వేష జాడ్యాన్ని అరికట్టి, పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా సామాజిక మాధ్యమాలపై పారదర్శక నియంత్రణా చర్యలు అత్యవసరం.