Jun 02,2023 07:54

            పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులు చేసే గ్రామీణ పేదలు, కౌలుదార్లు, రైతులతోబాటు ఉపాధ్యాయ, ఉద్యోగులు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేట్టు చేస్తున్న మునిసిపల్‌ కార్మికులు... ఇలా వివిధ వర్గాలు, తరగతులకు చెందినవారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర బిజెపి ప్రభుత్వం 'ఉపాధి హామీ' నిధులకు కత్తెర వేయడం, ఫేషియల్‌ అటెండెన్స్‌, యాప్‌లతోనే మస్టర్లు, వేసవిలో సైతం రెండు పూటల పని తదితర విషమ షరతులు విధించడంతో గ్రామీణ పేదలు అల్లాడుతున్నారు. వారికి కనీస వేతనం కూడా రావడంలేదు సరికదా నీడ, నీళ్లు వంటివి కూడా లభించడంలేదు. తమ ఇబ్బందులను సర్కారు దృష్టికి తెచ్చి సమస్యలను పరిష్కరించుకోవడానికి గత రెండు వారాలుగా రాష్ట్రమంతటా ఉపాధి కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తొలుత ప్రకటించిన విధంగా జూన్‌ ఒకటో తేదీన రైతు భరోసా సొమ్ము తొలి విడత జమ చేస్తూ బటన్‌ నొక్కడం మంచిదే. ఇది ఖరీఫ్‌ వ్యవసాయ పెట్టుబడులకు కొంతమేర తోడ్పడుతుంది. అయితే గత ఖరీఫ్‌, రబీ ధాన్యం డబ్బు రానందున ఎంతోమంది రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతుల కష్టాలు చెప్పనలవి కాదు. వారికి రైతు భరోసా రాదు, ఇ- క్రాప్‌ బుకింగ్‌ లేదంటూ పంటను ఆర్‌బికెల్లో కొనరు, బ్యాంకులు రుణాలివ్వవు... ఇలా ఎన్నో ఈతిబాధలు. రాష్ట్రంలో కౌలు చట్టసవరణ, వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 7 నుంచి జీపు యాత్ర, పాదయాత్రలకు ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం పిలుపునిచ్చింది. భూ యజమాని సంతకం వుంటేనే కౌలు అర్హత కార్డులు ఇస్తామని ప్రభుత్వం చట్టాన్ని మార్చడంతో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, విత్తన, ఎరువుల సబ్సిడీ, పంటనష్ట పరిహారం కౌలు రైతులకే ఇచ్చేలా చట్టసవరణ చేయాలని, కేరళ తరహా రుణవిముక్తి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకురావాలన్న వారి ప్రధాన డిమాండ్లు ఎంతో న్యాయమైనవి.
పట్టణాలను పరిశుభ్రంగాను, సుందరంగానూ తీర్చిదిద్దడంలో అర్ధరాత్రి అపరాత్రి అనక కష్టం చేసే మున్సిపల్‌ పారిశుధ్య ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఒక జాతా, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి మరో జాతా బుధవారం ప్రారంభమయ్యాయి. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, మున్సిపల్‌ ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నవి వారి ప్రధాన డిమాండ్లు. ఇవేవీ గొంతెమ్మ కోర్కెలు కాదు. పిఆర్‌సిలో ప్రారంభ వేతనం రూ.22 వేలుంటే, మున్సిపల్‌ కార్మికులకు రూ.15 వేలే చెల్లిస్తోంది. ఆప్కాస్‌లో కార్మికులందరినీ ఉద్యోగులుగా నమోదు చేశారు తప్ప, సౌకర్యాలు అమలు చేయడం లేదు. ఇంజనీరింగ్‌ కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ వారికిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎసరు పెట్టింది. కరోనా కాలంలో మున్సిపల్‌ వర్కర్లను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుగా పేర్కొన్న ప్రభుత్వం విధి నిర్వహణలో మృతి చెందిన వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించకపోవడం దారుణం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు, ప్రభుత్వ విధానాలను, సేవలనూ ప్రజలకు చేరవేసే ఉద్యోగులూ తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యాన జూన్‌ 5 నుంచి సెప్టెంబరు 1 వరకు పలు రూపాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించనున్నారు. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వం వేలాది ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడంతోపాటు పాఠశాలల విలీనం, బోధనేతర పనులతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తోంది. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయించాలి. ఆయా వర్గాలు, తరగతుల ప్రజానీకానికి సంబంధించిన న్యాయమైన కోర్కెలపై ఆందోళనలు చేస్తున్న వివిధ ప్రజా సంఘాలతో చర్చించి వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. సర్కారు విజ్ఞతతో వ్యవహరించాలి.