Oct 18,2023 12:30

కేరళ : మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కుందర జానీ (71) మంగళవారం కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం సమయంలో ఆయనకి హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కేరళ కొల్లాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో జానీ తుదిశ్వాస విడిచారు. ఆయన మఅతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ ఆయనకు నివాళులర్పించారు. ఇటు తమిళ, తెలుగు పరిశ్రమ నుంచి కూడా సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.

కెఎన్‌ బాలగోపాల్‌ సోషల్‌ మీడియాలో రాస్తూ.. '' కుందర జానీ నా చిరకాల మిత్రుడు. అతను మలయాళ చిత్రసీమలో 45 ఏళ్లకు పైగా చురుకుగా ఉన్నారు. దాదాపు 500 చిత్రాలకు పైగా నటించారు. కొల్లంలోని సాంస్కఅతిక, సామాజిక వేదికల్లో నిరంతరం చురుకుగా ఉండే కుందర జానీ మృతికి నా సంతాపం తెలియజేస్తున్నా.'' అని పోస్ట్‌ చేశారు.

100కి పైగా చిత్రాల్లో నటించిన జానీ 1979లో 'నిత్యవసంతం'తో ఇండిస్టీలోకి తెరంగేట్రం చేశారు. 'అగ్నిపర్వతం', 'రాజావింటే మకన్‌', 'ఆవనాజి', 'నాడోడిక్కట్టు' చిత్రాల్లో పోషించిన పాత్రలు జానీకి మంచి గుర్తింపు తెచ్చాయి. 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు', 'కిరీడం', 'చెంకోల్‌', 'స్పదికం' తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. జానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2010 సంవత్సరంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటించిన 'రౌడీయిజం నశించాలి' అనే సినిమాలో నటించారు. ఇక ఉన్ని ముకుందన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన మెప్పడియాన్‌ (2022) చిత్రంలో ఆయన చివరిసారిగా తెరపై కనిపించారు. మలయాళంతో పాటు కొన్ని తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. కధయిలే రాజకుమారి, నిలవుం నక్షత్రాలుమ్‌, సీబీఐ డైరీ అనే మలయాళ సీరియల్స్‌లో కూడా కనిపించారు.