Jul 16,2023 11:20

ఉత్తర్‌ప్రదేశ్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కాంవడ్‌ యాత్ర చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మేరఠ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. కాంవడ్‌ యాత్రలో భాగంగా హరిద్వార్‌లో పవిత్ర గంగా జలాలను తీసుకుని పలువురు యాత్రికులు తిరుగు ప్రయాణమయ్యారు. వీరి వాహనం మేరఠ్‌ జిల్లాలోని భావన్‌పుర్‌లోని రాలీ చౌహాన్‌ గ్రామ సమీపానికి చేరగానే.. తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై వాహనంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలిచారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం గ్రామస్థులు భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.