Nov 16,2023 15:52

ప్రజాశక్తి-కాకినాడ : విద్యార్థులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్‌ సీఐ ఎన్‌.రమేష్‌ అన్నారు. ఎం ఎస్‌ ఎన్‌ జూనియర్‌ కళాశాలలో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాపిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు చర్యలు తప్పవన్నారు. లైసెన్స్‌ పొందిన తరువాత మాత్రమే వాహనాలు నడపాలన్నారు. వాహనాలపై వెళ్లే విద్యార్థులు విధిగా తమ వెంట వాహనాలకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల విద్యార్థులకే కాకుండా ఎదుటి వారికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బైకులు నడపాలని విద్యార్థులకు సూచించారు. మితి మీరిన డ్రైవింగ్‌ ప్రమాదకరమని వివరించారు. అతివేగం అత్యంత ప్రమాదకరమని వేగంగా వెళ్లి ప్రాణాలను పోగొట్టుకుని తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని విద్యార్థులకు సూచించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు బైకులు ఇవ్వవద్దని కోరారు. చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తరచూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే మండల లీగల్‌ సర్వీసెస్‌ వారిని సంప్రదించాలని కోరారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.