- బీహార్ రైలు ప్రమాదానికి కారణమిదే
- ప్రాథమిక విచారణ నివేదిక
పాట్నా : బుధవారం రాత్రి బీహార్‌లో జరిగిన రైలు ప్రమాదానికి ట్రాక్ నిర్వహణ లోపమే కారణమని ప్రాథమిక విచారణ నివేదిక పేర్కొంది. రైలు డ్రైవర్‌తో సహా ఆరుగురు రైల్వే అధికారులు ఈ నివేదికపై సంతకం చేశారు. అయితే దీనిని రైల్వే అధికారులు ఖండించారు. బక్సర్ జిల్లాలో నార్త్‌ఈస్ట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు కోచ్‌లు పట్టాలు తప్పిన ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు మృతి చెందగా, 50 మందికి గాయపడ్డారు. మృతుల్ని ఉషా భండారి (33), ఆమె కుమార్తె అకృతి భండారి (8), అబు జైద్ (68), నరేంద్ర (70)గా గుర్తించారు. ఢిల్లీలోని ఆనంద్ విహర్ టెర్మినల్ నుంచి బుధవారం రాత్రి 7:30 గంటలకు ఈ రైలు బయలుదేరింది. అస్సాంలోని తిన్సుకియాకు (గౌహతి) వెళ్తున్న రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రాత్రి 9:53 గంటల సమయంలో ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. రైలులో మొత్తం 22 బోగీలు, ఇంజన్ పట్టాలు తప్పగా.. వీటిలో రెండు పూర్తిగా బోల్తా పడ్డాయని, మరో రెండు సగం ఒరిగాయని నివేదిక తెలిపింది. అలాగే ప్రమాదంతో రూ. 52 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు నివేదిక అంచనా వేసింది. ప్రమాద సమయంలో రైలు గంటకు 128 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ప్రమాదానికి గురైన రైలులో ఉన్న 1,006 ప్రయాణీకులను గౌహతి తరలించడానికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. గాయపడిన వారిలో 12 మందిని పాట్నాలోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొరికి రూ 10 లక్షల పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. గాయపడిన వారికి రూ 50 వేల పరిహారం ప్రకటించింది.
ఈ ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల ఒక్కొరికీ రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50 వేల పరిహారం ప్రకటించారు. బాధితులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉం టుందని హామీ ఇచ్చారు.