Nov 18,2023 08:44

బాల్యం ఎన్నో తీపిగుర్తులను మనముందుంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన పిల్లలకైతే అవి కోకొల్లలు. పక్షుల కిలకిలరావాలు, ఊరంతా పచ్చదనం, వాగులు, వంకలు, కొండ, కోనలు ఇలా ఒకటేమిటి ప్రకృతి ఒడిలో ఊయలలూగుతారు. పెరిగి, పెద్దయి ఉపాధి కోసం ఊరు విడిచినా పండగకో, పబ్బానికో సొంతూరుకు వెళ్తుంటే ఆనాటి తీపిగుర్తులను నెమరువేసుకోని వారుండరు. అయితే కాలంతో పాటు తన ఊరూ మారి, పచ్చదనం కనుమరుగైతే కాస్తంత దిగులు ఆవరిస్తుంది. ఆనాటి మధుర స్మృతులు చెదిరిపోతున్నాయని ఒకింత విచారం వ్యక్తం చేస్తాం. ఆ తరువాత అంతా షరా మామూలే! అయితే తమిళనాడు వెల్లూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ డైరెక్టరు జి.శ్రీకాంత్‌ (34) మాత్రం అలా ఊరుకోలేదు. అదృశ్యమైపోతున్న తన ఊరి పచ్చదనాన్ని తిరిగి సంపాదించేందుకు అధికారుల చుట్టూ తిరిగాడు. భూమాఫియాతో పోరాడాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు.. అయినా వెనుకడుగు వేయలేదు.

11

శ్రీకాంత్‌ పుట్టి పెరిగిదంతా వెల్లూరు గుడియత్తమ్‌ గ్రామం. రోజూ స్కూలుకు వెళ్లి రావాలంటే పలార్‌ నది ఒడ్డున ఆనుకుని ఉన్న అడవిని దాటాలి. వనంలోని పక్షుల కిలకిల రావాలు వింటూ, చెట్ల సొగసును చూస్తూ ఆ మార్గంలో వెళ్లడాన్ని శ్రీకాంత్‌ చాలా ఇష్టపడేవాడు. ఆ తరువాత కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన అతను, ఉపాధి కోసం చెన్నరు నగరం చేరుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసినా అతని అభిరుచి మేరకు అసిస్టెంట్‌ డైరెక్టరుగా స్థిరపడ్డాడు. ఎప్పుడు తీరిక దొరికినా ఈ కాంక్రీట్‌ జంగిల్‌ నుండి విశ్రాంతి పొందేందుకు గ్రామానికి వెళ్లిపోయేవాడు.
 

                                                           ఊరు మా(డి)రిపోయింది !

సంవత్సరాలు గడిచాయి. ఏడాదికి ఏడాదికి అడవి మారిపోతోంది. పచ్చని చెట్ల స్థానంలో ఎండిన మోడులు దర్శనమిస్తున్నాయి. నిదానంగా ఊరంతా నగరానికి దగ్గరవుతున్నట్లు అనిపించింది. అప్పుడు అందరిలా తను కూడా మిన్నకుండిపోయాడు. అయితే 2017లో అతని కుటుంబంలో జరిగిన ఓ విషాద ఘటన అతన్ని అందరిముందూ ఓ శక్తిమంత యువకునిగా నిలబెట్టింది.
        అన్నయ్య మరణంతో ... : 2017లో శ్రీకాంత్‌ అన్నయ్య ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కుటుంబాన్ని చూసుకునేందుకు నగరం విడిచి పల్లెకు వచ్చేశాడు. నాన్నతో పాటు పొలం పనులు చేశాడు. నేలను తాకిన ఆ పాదాలు అతనికి తన గమ్యమేంటో చూపాయి. తన ఊర్లో చిన్నతనంలో చూసిన పచ్చదనం తిరిగి రావాలంటే ఏం చేయాలో కార్యోన్ముఖుడిని చేశాయి.
 

222

                                                                       తొలి అడుగులు

మొదట గ్రామం నుండే తన ప్రయాణం మొదలుపెట్టాడు. గ్రామం చుట్టూ అనేక మొక్కలు నాటాడు. పండ్లు, పూల మొక్కలతో గ్రామంలో పచ్చదనం తెచ్చాడు. '2018లో మా గ్రామానికి ఆనుకుని ఉన్న ఉల్లి గ్రామంలో వెయ్యి చెట్లను నాటాలని అనుకున్నాను. వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నాను. ఆరు నెలల్లో అవి బాగా పెరిగాయి. చాలా సంతోషమేసింది. ఈసారి పాలర్‌ నది ఒడ్డున చిన్నప్పుడు నేను చూసిన అడవిని తిరిగి నెలకొల్పాలనుకున్నాను. అప్పుడది భూమాఫియా చేతుల్లో ఉంది. చెట్లన్నింటినీ నరికేశారు. ఇసుక రవాణాకు వీలుగా నేలంతా చదును చేసేశారు. అటువంటి చోట అడవిని పునరుద్ధరించాలని నిశ్చయించుకున్నాను. అనుమతి కోసం జిల్లా కలెక్టరు చుట్టూ తిరిగాను. అయినా ఫలితం రాలేదు. అడవి నుండి బయటికి వచ్చిన ఎన్నో పక్షులు, జంతువులు రోడ్డుపై గాయాలతో పడి ఉండడం గమనించాను. ఈ పరిస్థితులను కూడా అధికారులకు వివరించాను. అయినా వారు పట్టించుకోలేదు. ఈలోపు ఉల్లి గ్రామంలో నేను నాటిన చెట్లు బాగా పెరిగాయి. అక్కడి వాతావరణంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈసారి వారు నాకు సహకరించారు. నది ఒడ్డున సామాజిక అడవి నెలకొల్పేందుకు నాకు అనుమతి ఇచ్చారు. రెండెకరాల భూమి మంజూరు చేశారు. నేలను చదును చేసేందుకు ఉపాధిహామీ కూలీలను పంపారు. మొదట నా సొంత ఖర్చులతో 500 మొక్కలను నాటాను' అంటూ తన తొలి అడుగులను వివరించారు శ్రీకాంత్‌.

                                                                         దుమ్మెత్తి పోశారు

ఇదంతా చేస్తున్న శ్రీకాంత్‌పై భూమాఫియా కక్ష గట్టింది. శారీరకంగా, మానసికంగా అతన్ని వేధించింది. కేసులు పెట్టి భయపెట్టింది. రాత్రికి రాత్రే మొత్తం మొక్కలను పీకేయించింది. డబ్బులు ఆశ చూపించింది. ఆ ప్రాంతం విడిచిపెట్టాలని శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చింది. ఎంతకీ మాట వినడం లేదని అక్కసు పెరిగి, అందరూ చూస్తుండగానే అతనిపై ఇసుక ఎత్తి పోసింది. కానీ, శ్రీకాంత్‌ వెనకడుగు వేయలేదు. తన పని తాను చేసుకుపోయాడు. మొత్తం పరిస్థితులను గమనించిన జిల్లా కలెక్టరు శ్రీకాంత్‌ అకుంఠిత దీక్షకు ముగ్ధుడైపోయారు. ఈసారి ఏకంగా 25 ఎకరాల భూమిని చదును చేసి, మొక్కలు నాటే పనిని అప్పజెప్పారు.

333


          ఇప్పుడక్కడ నేలంతా పచ్చదనం ఆవరించింది. విద్యావంతుడైన శ్రీకాంత్‌ గ్రామస్తుల భాగస్వామ్యంతో అడవిలోనే అంతర పంటల సాగు ప్రారంభించాడు. గూడు వదిలి పోయిన పక్షులన్నీ ఇప్పుడా అడవికి చేరాయి. పంటల సాగుతో గ్రామస్తులు స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. శ్రీకాంత్‌ ప్రకృతి సేవ ఇంతటితో ఆగలేదు. వెల్లూరు చుట్టుపక్కల నిస్తారంగా పడిఉన్న భూములన్నింటినీ పునరుద్ధరిస్తున్నాడు. అడవులను నిర్మిస్తున్నాడు. పండ్ల తోటల సాగు చేయిస్తున్నాడు. నాలుగేళ్లలో శ్రీకాంత్‌ కృషి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. అతని సేవను గుర్తించిన అక్కడి పాలకులు 2022లో రాష్ట్ర యువ అవార్డుతో అతన్ని సత్కరించారు.
            2018లో 1000 చెట్లను నాటడంతో మొదలైన అతని యజ్ఞం ప్రస్తుతం 15 వేల చెట్లను నాటి, సంరక్షించే స్థాయికి ఎదిగింది. మూడు అడవులను సృష్టించాడు. అతని సంకల్పం గట్టిది. అందుకే ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా, లక్ష్యం వైపు అడుగులు వేసి ఎంతోమందికి దిశానిర్దేశం అయ్యాడు.
            'మన తరం వారు పిల్లలకి ఆస్తులు సంపాదించాలని కలలు గంటారు. ఆ దిశగా కృషిచేస్తారు. అయితే ప్రకృతిని కాపడడమే పిల్లలకి మనమిచ్చే నిజమైన ఆస్తులు. సహజవనరులన్నీ కలుషితమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోతోంది. ప్రకృతిని కాపాడడమే మనముందున్న ఏకైక లక్ష్యం' అని సందేశం ఇస్తున్నాడు.