Sep 12,2023 08:49

న్యూఢిల్లీ : ముప్పు దిశలోనే మానవాళి ప్రయాణం చేస్తోందని వాతావరణ మార్పులపై ఐక్యరరాజ్యసమితి గ్లోబల్‌ స్టాక్‌ టేక్‌ నివేదిక హెచ్చరించింది. 2015 ప్యారిస్‌ ఒప్పందంలో భాగంగా ఏర్పాటైన గ్లోబల్‌ స్టాక్‌ టేక్‌ తన మొదటి నివేదికను సోమవారం విడుదల చేసింది. వివిధ దేశాలు తీసుకున్న చర్యలను సమీక్షించి 2023వ సంవత్సరం నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ప్యారిస్‌ ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ మేరకు యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సచివాలయం తాజా నివేదికను విడుదల చేసింది.
          ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందు ఉన్న స్థాయిలకంటే రెండు డిగ్రీలకు తగ్గించాలని, వీలైతే 1.5డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పరిమితం చేయడానికి ప్రయత్నించాలంటూ ప్యారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికోసం ఒప్పందంలో భాగస్వామ్యమైన వివిధ దేశాలు లక్ష్యాలను కూడా తీసుకున్నాయి. తీసుకున్న లక్ష్యాలను, ఆచరణలో ఆమలైన తీరును గ్లోబల్‌ స్టాక్‌ టేక్‌ నివేదిక తాజాగా విశ్లేషించింది. 'కొంత పురోగతి ఉన్నప్పటికీ అవసరమైన దాని కంటే చాలా వెనుకబడి ఉన్నాం, మానవాళి సురక్షిత మనుగడకు ఇది ఏ మాత్రం చాలదు' అని పెదవి విరిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సంఘటితంగా, మరింత పట్టుదలతో భూగోళాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సిఉందని పేర్కొంది. నివేదికను రూపొందించే ప్రక్రియ 2021లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ఈ నివేదికను రూపొందించింది. తాము జరిపిన చర్చల్లో ప్యారిస్‌ ఒప్పందం తరువాత ప్రపంచ దేశాల్లో పర్యావరణ స్పృహ పెరిగిందని, భూతాపాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు దేశాలు చేపట్టాయని తెలిపింది.
 

                                                                  నిరాశాజనకంగా 'ఆ' దేశాల తీరు

పర్యావరణ ముప్పును ఎదుర్కొనేందుకు పేద దేశాలకు అవసరమైన ఆర్థిక సాయం చేయడంలో అభివృద్ధి చెందిన దేశాల తీరు నిరాశాజనకంగా ఉంది నివేదికలో ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 100 బిలియన్‌ డాలర్ల వాతావరణ నిధిని ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఇంకా నెరవేరకపోవడాన్ని ప్రస్తావించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బడ్జెట్‌లు అధికభాగం రుణాలతోనే నిండిపోతున్నాయని, అందువల్ల వాతావరణ చర్యలకు ఆ దేశాలు నిధులు సమకూర్చలేకపోతున్నాయని పేర్కొంది. దీంతో వాతవారణ మార్పుల ప్రభావం ఆ దేశాలపై ఎక్కువగా పడుతోందని వివరించింది. ఇదే పరిస్థితి కొనసాగితే భూగోళంపై ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండలేరన్న విషయాన్ని గమనించాలని పేర్కొంది.