Oct 20,2023 10:26
  • 'ఎ సెంచరీ ఆఫ్‌ స్ట్రగుల్‌' పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సిఎం

తిరువనంతపురం : సిపిఐ (ఎం) ప్రముఖ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌ శుక్రవారం 101వ వసంతంలోకి ప్రవేశించనున్నారు. సిపిఐ(ఎం) వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన విఎస్‌ ఎనిమిది దశాబ్దాలకు పైగా రాజకీయ కార్యకలాపాలు సాగించడం ద్వారా పేద ప్రజల పోరాట చరిత్రలో భాగమయ్యారు. పున్నప్ర వాయలార్‌ పోరాట యోధుడుగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా, రాష్ట్ర కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, శాసనసభ్యుడిగా, పరిపాలనా సంస్కరణల కమిషన్‌ ఛైర్మన్‌గా, దేశాభిమాని వార్తాపత్రిక సంపాదకుడిగా వివిధ బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేసి, అందరి అభిమానాన్ని చూరగొన్నారు. జాతీయ కౌన్సిల్‌కు రాజీనామా చేసి 1964లో సిపిఐ (ఎం) స్థాపించిన 32 మంది సభ్యులలో జీవించి ఉన్న ఇద్దరు సభ్యులలో ఒకరు. మరొకరు తమిళనాడుకు చెందిన శంకరయ్య.
           ఆరోగ్య సమస్యల కారణంగా తిరువనంతపురంలోని బార్టన్‌హిల్‌లోని తన కుమారుడు విఎ అరుణ్‌కుమార్‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నందున పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కేక్‌ కటింగ్‌ ఉంటుంది. విఎస్‌ అచ్యుతానందన్‌ ప్రజాసేవ, జీవితాన్ని గుర్తు చేస్తూ ప్రముఖ పాత్రికేయుడు కెవి సుధాకరన్‌ రచించిన ''ఎ సెంచరీ ఆఫ్‌ స్ట్రగుల్‌'' పుస్తకాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విడుదల చేయనున్నారు.
         అక్టోబరు 20, 1923న అలప్పుజలోని పున్నప్ర వేంటలతరవీట్‌లో శంకరన్‌, అక్కమ్మ దంపతులకు అచ్యుతానందన్‌ జన్మించారు. 1939లో స్టేట్‌ కాంగ్రెస్‌లో చేరిన విఎస్‌ 1940లో పదిహేడేళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. బ్రిటిష్‌ పాలనలో, ఆయన కొబ్బరి - వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసి ఉజ్వల పోరాటాలకు నాయకత్వం వహించాడు. తీవ్రమైన నిర్బంధం, లాఠీ దెబ్బలు, జైలు శిక్ష అనుభవించారు. 2019 అక్టోబర్‌ 24 నుంచి ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ, విశ్రాంతి తీసుకుంటున్నారు.