హైదరాబాద్ : నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో బాధితులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(ఎం) ఎపి కమిటి కోరింది. దీనిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
'' హైదరాబాద్ నాంపల్లి బజారు ఘాట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందడం బాధాకరం. హృదయ విదారకరమైన ఈ దుర్ఘటనలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులు ఇంకా పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్ కమిటీ సంతాపాన్ని తెలియజేస్తున్నది. మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం, గాయపడ్డవారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. '' అని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి విదితమే. ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐదు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందారు. కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంటల్లో మరికొంతమంది చిక్కుకుని ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.