
ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్. తాజా రచన ''ద లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్''...పరాయి పాలన నుంచి భారతదేశ విముక్తి కోసం పోరాడిన సాధారణ ప్రజల అసాధారణ జ్ఞాపకాల గుచ్ఛమని చెప్పవచ్చు. వీరి త్యాగాలు చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా నమోదు కాలేదు. వారి వాస్తవ గాథలు చెప్పుకోడానికి చోటు కల్పించడం ద్వారా ఈ పుస్తకం ఆ లోటును భర్తీ చేస్తుంది. రానున్న ఐదేళ్లలో తమ అనుభవాలను చెప్పేందుకు ఒక్క స్వాతంత్య్ర సమరయోధుడు కూడా సజీవంగా ఉండడని ''పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా'' (పరి) వ్యవస్థాపక సంపాదకుడైన సాయినాథ్ చెప్పారు. భావజాలాలు, నాయకత్వాలలో ఉండే వైరుధ్యాలు, అణగారిన వర్గాల ప్రజలపై బ్రిటిష్ వారు సాగించిన దారుణ అకృత్యాలు, స్వాతంత్య్రోద్యమానికి ఆదివాసీలు, దళితులు అందించిన సేవలను సాయినాథ్ తన రచనలో నమోదు చేశారు. ''ఈ గాథలు వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, నేపథ్యాలకు చెందినవి. స్వాతంత్య్రం సాధించాలనే తపన, వాంఛ ఎంత ప్రగాఢంగా వుందనేది ఈ వాస్తవ గాథలు తెలియజేస్తాయ''ని భగత్ సింగ్ మేనల్లుడైన ప్రొఫెసర్ జగ్మోహన్ తన ముందుమాటలో పేర్కొన్నారు.
ఈ పుస్తక రచనకు సంబంధించి పి.సాయినాథ్ ''ఫ్రంట్‌లైన్''తో పంచుకున్న పలు స్ఫూర్తిదాయక అంశాలు...
భారతదేశ వ్యవసాయ రంగ సంక్షోభం గురించి పత్రికల్లో కథనాలు రాయడానికి ముందు నుంచి...అంటే విద్యార్థిగా, వృత్తిపరమైన బాధ్యతల్లో వున్నప్పటి నుండి కూడా భారత స్వాతంత్య్రోద్యమం పట్ల మీకు ఆసక్తి వుంది. అయితే పుస్తకంగా తీసుకురావాలని ఇప్పుడు ఎందుకు నిర్ణయించుకున్నారు ?
నేను ''ద టైమ్స్ ఆఫ్ ఇండియా''లో 1997లో ''ఫర్గాటెన్ ఫ్రీడమ్స్'' శీర్షికతో వరుస కథనాలు రాసేటప్పడు ఇది మొదలైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారీ తిరుగుబాట్లు జరిగిన ఐదు గ్రామాలను సందర్శించిన తరువాతే నేను ఆ వ్యాసాలు రాశాను. 2002లో ''ద హిందూ'' లో వరుస కథనాల ద్వారా వ్యక్తుల వాస్తవ గాథలను రాయడం మొదలు పెట్టాను. అప్పుడు, వాటిని గ్రంథస్థం చేయాలనే ఆలోచనకు వచ్చింది. అయితే, వ్యవసాయ సంక్షోభం స్వాతంత్య్ర సమరయోధులపై చేస్తున్న పనికి అంతరాయం కలిగించింది. కాబట్టి దానితోపాటే పరిశోధనైతే చేశాను. వ్యవసాయ సంక్షోభం మరింత దారుణంగా పెరిగిపోతుండడంతో ఆ కథనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది.
మా తాతయ్య (మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి) గురించి మా అమ్మతో పాటు అనేక మంది చెప్పిన కథల్ని, జైలు జీవితం గడిపిన ఇతర కుటుంబ సభ్యులు చెప్పిన కథలను వింటూ పెరిగాను. మా తాతయ్యను కలవడానికి వచ్చే విభిన్న సామాజిక వర్గాలు, నేపథ్యాలకు చెందిన వారిని నేను గమనించేవాడ్ని. ఇలాంటి ప్రజలే మనకు స్వాతంత్య్రం సాధించిపెట్టారని (వారు వెళ్ళిపోయిన తరువాత) ఆయన నాకు చెప్పేవారు.
ఇంత అత్యవసరంగా 2022 లోనే (2022 నవంబర్ 30న పుస్తకావిష్కరణ జరిగింది) ఈ పుస్తకం తీసుకు రావడానికి ఒక కారణముంది. సెప్టెంబర్ 2021 నుండి ఈ పుస్తకంలో పేర్కొన్నవారిలో ఏడుగురు మరణించారు. అందువల్ల... ఎట్టి పరిస్థితుల్లోనూ 2022లో ఈ పుస్తకం రావాలి. ఈ పుస్తకంలో కనిపించే అనేకమంది తమ వాస్తవ గాథల్ని చూసుకోవాలనుకున్నారు. వారి కోసం నేను ఆ పని చేయాలి అనే పట్టుదల నాలో ఏర్పడింది.
మీరు వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన కథనాలు రాసినప్పుడు... ఆ ప్రాంతాలలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యవసాయ రంగానికి చెందిన వారి గురించి తెలుసుకునేవారా ?
దేశంలో ప్రధానమైన తిరుగుబాట్లు జరిగిన ప్రాంతాల్లో, స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములైన వారి కోసం నేను గాలించాను. అంతేకాకుండా, అప్పటికే దశాబ్దానికి పైగా ఒక గ్రామీణ రిపోర్టర్‌గా పని చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులతో పాటు ఇతర పరిచయాలు కూడా ఉన్నాయి. '1857 తిరుగుబాటు' వ్యవసాయ సంక్షోభం కారణంగానే ఉత్పన్నమైంది. ఒక చరిత్ర విద్యార్థిగా నాకున్న నేపథ్యం ఈ విషయంలో మెరుగైన దృష్టికోణం కలిగివుండడానికి తోడ్పడింది. నాకు భూమి సంబంధాలు, భూస్వాములు-రైతుల మధ్య ఉండే సంబంధాల గురించి కొంతవరకు తెలుసు. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రతీ ఒక్క పాత్రా గ్రామాల నుంచి ఉద్భవించినవే.
ఈ పుస్తకం ఎందుకు రాశారు ? మీ లక్ష్యం ఏమిటి ?
అందులోని వ్యక్తుల కోసమే ఈ పుస్తకం రాశాను. 1947 తరువాత పుట్టిన మా లాంటి తరానికి, మా జీవితాల్ని సరైన రీతిలో రూపుదిద్దుకోవడానికి వారి గాథలు అవసరం. మేము ఎక్కడి నుండి వచ్చామో మాకు తెలియకపోతే, మేమెక్కడికి వెళ్తున్నామో కూడా మాకు తెలియదు.17-25 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువగా చదువుతారనే విషయం ఇంతకు ముందు నా పుస్తకం ద్వారా తెలిసింది. అందుకే ''ద లాస్ట్ హీరోస్''ను వారిని దృష్టిలో వుంచుకొనే రాశాను. సిద్ధాంతాల పట్ల యువతకు అంతగా ఆసక్తి లేకపోయినా స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర, వారి కథలు, ఘటనలు అన్నీ వారిని తప్పకుండా ఆకట్టుకుంటాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ప్రభుత్వ వెబ్‌సైట్ ఒకటి ఉంది. ఇందులో ఒక్క ఫోటో గానీ, వీడియో గానీ ఇప్పుడు మన మధ్య వున్న ఒక్క స్వాతంత్య్ర సమరయోధుని గురించిన సమాచారం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందులో నరేంద్ర మోడీ ఫోటోలు, వీడియోలు ఉంటాయి. మోడీని ఒక స్వాతంత్య్ర సమరయోధునిగా భావించుకుంటున్నందుకు ఒక టీనేజ్ పిల్లవాడ్ని క్షమిస్తాం. కానీ, దీనిని విశ్వసించే ప్రజానీకం కూడా ఉన్నారు. బ్రిటీష్ వలసవాదం గురించి, అది మనకు ఏం చేసిందనే విషయం గురించి ఒక్క పేరా కూడా ఆ వెబ్‌సైట్‌లో లేకపోవడం నన్నెంతో బాధించింది. అది తెలియకుండా స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్రం గురించి ఏం తెలుసుకుంటారు ?
సామాన్య ప్రజల పోరాటాలు, త్యాగాల నుంచే స్వాతంత్య్రం సిద్ధించింది గానీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో చదువుకొని తిరిగి వచ్చిన వారి వల్ల కాదనే విషయాన్ని రుజువు చేయడమే నా లక్ష్యం. బ్రిటీష్ వారు ఉదార స్వభావంతో వ్యవహరించడం వల్ల స్వాతంత్య్రం రాలేదనే విషయాన్ని కూడా తెలియజేయాలనుకున్నాను. స్వాతంత్య్ర పోరాటం కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైంది కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల వారి భాగస్వామ్యంతో జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా నేటికీ పేదరికంలో ఉన్నాం. నాడు స్వాతంత్య్ర పోరాట సమయంలో ఇచ్చిన 'భూమి, భుక్తి, విముక్తి' పిలుపుకు నేటికీ ప్రాసంగికత వుంది. దీని గురించి మీరేమంటారు ?
బ్రిటిష్ వలసవాద కాలంలో వచ్చిన 31 కరువుకాటకాల వల్ల మరణాల రేటు ఎక్కువగా వుండేది. 16 కోట్ల నుంచి 16.8 కోట్ల మంది దాకా చనిపోయారన్న విషయం నేటి తరం వారికి తెలియదు. అదే ఏదైనా యూరోపియన్ దేశంలో ఆ మరణాల్లో ఒక్క శాతం సంభవించినా గగ్గోలు పెట్టేవారు. దానిని ''మారణహోమం'' అనేవారు. రెండు వందల సంవత్సరాల బ్రిటీష్ వలసవాదం భారతదేశంలో 44.6 ట్రిలియన్ డాలర్లు లూటీ చేసిందని ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ అంచనా వేశారు.
మన దేశాభివద్ధికి సంబంధించిన సమస్యలు ఎక్కడి నుండి వస్తున్నాయో దీనినిబట్టి మీకు అర్థమై ఉండాలి. బ్రిటిష్ పాలనా కాలం నాటి సమస్యలు నేటికీ వెన్నాడుతున్నాయి. ఫోర్బ్స్ జాబితా లోని బిలియనీర్లలో భారతీయులు ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. మనం ఎన్నడూ చూడని విధంగా, 1920 నుంచి ఆశ్చర్యకరమైన రీతిలో అసమానతలు పెరిగిపోతున్నాయి. గ్రామీణ పేదల సమస్యలు ఇంకా సమస్యలుగానే మిగిలి ఉన్నాయి. భయానకమైన వాతావరణ మార్పుల కారణంగా అవి మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.
మీ పుస్తకంలో పేర్కొన్న అనేక పాత్రధారుల జీవితాల్లో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ లకు ఎంతో ప్రాధాన్యత వుంది. వారు తమ నాయకులను కలిసినప్పటి సంగతులు చెప్తారా ?
ఈ పుస్తక రచన సాగినంత కాలం నేను గమనించింది ఏమంటే, పోరాట కాలంలో గాంధీ స్థానం చాలా ప్రత్యేకంగా ఉండేది. ఉదాహరణకు... థేలూ, లోఖీ మహతోలు గాంధీ, నేతాజీతో పాటు వారి స్థానిక ప్రాంతాలకు చెందిన చంబల్ బందిపోట్లకు వారు అంకితమయ్యారు. ఈ ముగ్గురిని ఆరాధించడంలో వారు ఎలాంటి వైరుధ్యాలను చూడలేదు.
మనుషుల్లో మంచిని మాత్రమే చూడాలని ప్రజలను కోరే మానవతా మూర్తి గాంధీజీ అని భావించే థేలూ, లోఖీలు దానినే అనుసరించారు. అదే సమయంలో వారు పోలీస్ స్టేషన్లపై దాడికి పథకాలను కూడా రచించారు. ''నేను గాంధీ, అంబేద్కర్ లలో ఒకర్ని ఎంపిక చేసుకోవాలా? గాంధీ, అంబేద్కర్ లలో నాకు ఏది ఇష్టమైతే దాన్నే అనుసరిస్తానని'' శోభారామ్ తన కథలో చెప్పారు.
''పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా'', ''అఖిల భారత కిసాన్ సభ'' లు మహారాష్ట్ర లోని సంగ్లీలో తుఫాన్ సేన, ప్రతిసర్కార్ నేతలకు సన్మాన కార్యక్రమ నిర్వహణ నన్ను ఎంతగానో కదిలించివేసిన ఘటనల్లో ఒకటి. అప్పుడు ఈ గ్రూపులు గాంధీని వదలి వెళ్ళిపోయాయి. వారిని సన్మానించడానికి నేను, గాంధీజీ మనవడైన గోపాలకృష్ణ గాంధీని తీసుకొని వెళ్ళాను. తుఫాన్ సేన నాయకుడైన కెప్టెన్ భావ్... గోపాలకృష్ణ గాంధీని గట్టిగా కౌగలించుకుని ఏడ్చాడు. గాంధీని విభేదించడం అంటే అయన్ను ద్వేషించడం అనే అర్థం కాదని వారు మాతో చెప్పారు. నా పుస్తకంలోని పాత్రధారులలో చాలామంది (అందరూ కాదు) రాజకీయంగా వామపక్షవాదులు. ఆదర్శంలో, నైతికతలో గాంధేయవాదులు.
స్వాతంత్య్ర పోరాటంలో సహాయక పాత్ర పోషించిన సాలిహాన్, పురూలియాకు చెందిన భాబాని మహతో లాంటి మహిళల్ని మీ పుస్తకంలో పేర్కొనడం ద్వారా 'స్వాతంత్య్ర సమరయోధుడు' నిర్వచనాన్ని ప్రశ్నించారు గదా మీరు ?
స్వాతంత్య్ర సమరయోధుని గుర్తించడమెలా అనే భావనను ''ద లాస్ట్ హీరోస్'' రచన సవాల్ చేస్తుంది. దానిలో వంట చేసేవారు, ఇంటిపనివారు, కొరియర్లు, రైతులు, కార్మికులు అందరూ ఉంటారు. ఈ సాధారణ ప్రజలకు మనం గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోరాటాన్ని ముందుకు నడిపించిన వారిలో మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని మనం తెలియజేయాలి. పోరాటంలో భాగస్వామ్యానికి పనికిమాలిన నిర్వచనాలిచ్చి, మహిళల్ని దాని నుండి మినహాయించారు.
నిర్బంధంలో ఉన్న విప్లవకారులకు వార్తలను చేరవేయడానికి చెక్కపెట్టెను ఉపయోగించి అర్థరాత్రి నది దాటిన హౌసా బాయి గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ''ద స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్ స్కీమ్'' ''వితంతువు'' గురించి మాట్లాడుతుంది. స్వాతంత్య్ర సమరయోధుడు అంటే ఎప్పటికీ పురుషుడే అని వారు భావిస్తున్నారు. కానీ ఆ యోధుల్లో మహిళలను చేర్చడం అత్యంత సముచితమని నేను భావించాను.
స్వాతంత్య్రోద్యమం గురించి వ్యాఖ్యానించేటప్పుడు ఏదైౖనా మార్పు గమనించారా ?
నేడు మీరు చూస్తున్న జాతీయవాదం వాస్తవానికి హిందూ జాతీయవాదం. గాంధీ, మండేలాలు ఇలాగే ఉన్నారా? ఇది మతోన్మాద దేశభక్తి. దురభిమానపూరిత దేశభక్తి. హిందూత్వ జాతీయవాదం. నేడు జాతీయవాదాన్ని నిర్వచిస్తూ, ప్రసంగాల్లో దర్పాన్ని ప్రదర్శిస్తున్న వారెవరూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్రను పోషించలేదు. వారు దేశాన్ని తిరోగమన దిశకు తీసుకుపోతున్నారు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)