May 31,2023 07:51

  • మే 31 నుండి జూన్‌ 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రచార జాతాలు

           రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలలో దాదాపు 40 వేల మందికి పైగా కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ (ఆప్కాస్‌) సిబ్బంది, మరో 10 వేలకు పైగా సి.పి.ఎస్‌ ఉద్యోగులు, వెయ్యి మందికి పైగా క్లాప్‌ ఆటోడ్రైవర్లు పని చేస్తున్నారు. వీరందరూ రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్న పట్టణ ప్రజలకు పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, పార్కులు, పౌర సేవలు అందిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కోవిడ్‌ వారియర్లుగా, ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారు. వీరికి 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్‌, సంక్షేమ పథకాలు, సిపిఎస్‌ రద్దు తదితర డిమాండ్ల సాధనకై మే 31వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి, సత్యసాయి జిల్లా హిందూపురం నుండి రెండు ప్రచార జాతాలు ప్రారంభమై జూన్‌ 8వ తేదీన విజయవాడలో ముగింపు సభ జరగనుంది.
         దుమ్ము, ధూళి, దుర్గంధం, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా పట్టణ ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్‌ సిబ్బందిపై పాలకులకు ఎటువంటి దయ, కనికరం లేదు. ఆప్కాస్‌ సిబ్బందికి కనీస వేతనాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ లేవు. అన్‌స్కిల్డ్‌ వర్కర్ల కన్నా ఇంజనీరింగ్‌ విభాగంలోని వివిధ క్యాటగిరీలలో పనిచేస్తున్న స్కిల్డ్‌ వర్కర్లకి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. గత 30-35 సంవత్సరాలు పనిచేసి గ్రాట్యూటీ లేక, సర్వీస్‌ లేక, పెన్షన్‌ లేక ఖాళీ చేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. 2004 నుండి ఉద్యోగాలలో చేరిన సిపిఎస్‌ ఉద్యోగులదీ అదే దుస్థితి. క్లాప్‌ ఆటో డ్రైవర్లకు మిగిలిన డ్రైవర్లతో పాటు రూ.18,500 జీతం చెల్లించకుండా కేవలం రూ.10-12 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. మున్సిపాలిటీల లోని వార్డు సచివాలయాల ఉద్యోగులదీ అదే పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వీరి సమస్యలు పరిష్కారం కావడంలేదు.

                                            అధికారంలోకి రాక ముందు వాగ్దానాల వర్షం - వచ్చాక గుండు సున్నా

2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోను, పాదయాత్ర సందర్భంగా వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులకు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వాగ్దానాల వర్షం కురిపించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలలో ''కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌కి పెద్ద తేడా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వారిని నమ్మించి మోసం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం వారిని పర్మినెంట్‌ చేయకపోతే 6 నెలల్లో మా ప్రభుత్వం రాగానే అందరిని పర్మినెంట్‌ చేస్తామ''ని బల్లగుద్ది మరీ చెప్పారు. సిపిఎస్‌ ఉద్యోగులకైతే వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని వాగ్దానం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాటలు నమ్మి ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు ఓట్లు వేసి వైసిపిని గెలిపించారు. కాని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. పర్మినెంట్‌ ఉద్యోగులకు రివర్స్‌ పిఆర్‌సి ఇవ్వడమేకాక, సిపిఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు అవగాహనా లోపంతో చెప్పామని నేడు బొంకుతున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి 11వ పిఆర్‌సి ప్రకారం నెలకి రూ.20,000 జీతం, కరువు భత్యం (డిఎ) చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.15,000 నుంచి 18,500 చెల్లించి నెలకు 3 నుండి రూ.5 వేలు కోత పెట్టి కార్మికుల శ్రమ శక్తిని దోపిడి చేస్తున్నారు. నైపుణ్యంతో కూడిన విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌ సిబ్బందికి పారిశుధ్య విభాగం వారి కన్నా తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు.
 

                                                      మాట తప్పని, మడమ తిప్పని వంశం అంటే ఇదేనా !

మున్సిపల్‌ ఉద్యోగుల్లో నూటికి 90 శాతం దళితులు, మిగిలిన వారు బలహీన వర్గాల వారు, మహిళలు. కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌ విషయాన్ని అటకెక్కించారు. శాశ్వత స్వభావం కలిగి, పర్యావరణాన్ని ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్‌ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్‌ చెయ్యకుండా ఆప్కాస్‌ అనే బానిస వ్యవస్థలోకి నెట్టివేశారు. లక్ష రూపాయలు ఇచ్చినా మున్సిపల్‌ కార్మికులు చేసే పనిని ఇతరులెవ్వరూ చేయలేరని చెప్పిన ముఖ్యమంత్రి రూ.12 వేల జీతాన్ని కేవలం రూ.15 వేలకు పెంచారు. పారిశుధ్య కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ కింద నెలకు రూ.6 వేలు ఇచ్చారు తప్ప సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చెయ్యలేదు. ఇంజనీరింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలను ఎత్తివేశారు. ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్నప్పటకి హెల్త్‌, రిస్క్‌ అలవెన్సులు చెల్లించడంలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నారు. జీవో ఆర్‌టి నెం.30లో అన్యాయం జరిగిన వాటర్‌ సెక్షన్‌, టౌన్‌ ప్లానింగ్‌, పార్కుల్లో పని చేసే కార్మికులు, డ్రెవర్లు, సూపర్‌ వైజర్లకు న్యాయం చేసేందుకు 2022 జులై 11 నుండి 15 వరకు జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించింది. అయినా నేటికీ ఈ సమస్యను పరిష్కరించలేదు.
 

                                             హామీలను నెరవేరుస్తారా ? ఉద్యోగ, కార్మిక ద్రోహులుగా మిగిలిపోతారా ?

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఇచ్చిన పర్మినెంట్‌ హామీని ఇప్పటికైనా అమలు చేయాల్సిందిగా, ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చి అమలు జరిపి ఉద్యోగ, కార్మిక మిత్రులుగా మిగులుతారో లేక హామీలను తుంగలో తొక్కి కార్మిక ద్రోహులుగా తేలతారో ఈ ప్రభుత్వమే తేల్చుకోవాలి. తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడతాయో లేదో కార్మిక వర్గానికి తేల్చి చెప్పాలి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్ల (మున్సిపల్‌, గ్రామ పంచాయితీ కార్మికులతోసహా) కుటుంబాలకు రూ.50 లక్షలు నష్ట పరిహారం కింద చెల్లిస్తామని ఇచ్చిన హామీని మన రాష్ట్రంలో ఒక్కరికి కూడా అమలు చెయ్యలేదు. పైగా స్వచ్ఛ భారత్‌కు చెల్లు చీటీ చెప్పి మున్సిపల్‌, గ్రామ పంచాయితీ కార్మికులకు తీరని ద్రోహం చేసింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రం లోని వైసిపి ప్రభుత్వం జత కట్టి పట్టణ ప్రజలపైన చెత్తపన్ను తదితర యూజర్‌ చార్జీల పేర్లతో కోట్లాది రూపాయల భారాలు మోపుతున్నారు.
           2024లో జరగనున్న ఎన్నికలకు ముందైనా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హామీలను అమలు చేయాలి. హామీల అమలుకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. అందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ జాతాలలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులతోపాటు పట్టణాల్లోని అన్ని వర్గాల ప్రజలు మద్దతునిచ్చి జయప్రదం చెయ్యాల్సిందిగా విజ్ఞప్తి.

/ వ్యాసకర్త ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /
కె. ఉమామహేశ్వరరావు

కె. ఉమామహేశ్వరరావు