ఇదేంటి బాల్యంలో స్కూల్‌కి వెళ్లి, యవ్వనంలో ఇంటికి రావడమేమిటి అనుకుంటున్నారు. అవును మరి వాళ్లు రావాలంటే రెండు విమానాలు ఎక్కి, ఐదురోజులు ట్రెక్కింగ్ చేస్తేగానీ చేరుకోలేరు. అక్కడ పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్లాలంటే చాలా రిస్క్ జర్నీ చేయాలి.
అందుకే వాళ్లు చదువుకోవాలంటే పట్టణానికి వెళ్లి పన్నెండేళ్ల పాటు ఇంటివైపు రాకుండా అక్కడే ఉండిపోవాలి. అన్నేళ్ల పాటు బిడ్డల్ని చూడకుండా ఉండాలంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ..? కానీ, నేపాల్‌లోని మారుమూల గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అలాంటి వేదననే అనుభవిస్తున్నారు.
ఇలా నాలుగేళ్ల వయసులో ఇంటిని, తల్లిదండ్రుల్ని వదిలి, సుదూరంగా ఉన్న పట్టణంలో చదువుకోవడానికి వెళ్లారు కొందరు చిన్నోళ్లు. అలా మొత్తం 12 ఏళ్లక్కడే ఉండి, ఈ మధ్యే తన సొంత ఊరికి తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్లందరూ 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న టీనేజీ విద్యార్థులు. వీరి జర్నీ ఇప్పుడొక అద్భుతమైన డాక్యుమెంటరీగా మారింది.
హిమాలయాల్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన చిన్నోడు.. అతని పేరు జీవన్ మహాతర. నేపాల్ రాజధాని కఠ్మాండూలో చదువుకుంటున్నాడు. 12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల్ని చూసేందుకు ఊరికి తిరిగొచ్చాడు.
'మా అమ్మానాన్నల్ని చూసి పన్నెండేళ్లు అవుతోంది. వాళ్ల ముఖాల్లో నవ్వు మాత్రమే నాకు గుర్తుంది. ఆ నవ్వు వెనుక ఎంతో బాధను చూశాను' అన్నాడు జీవన్.
నేపాల్‌లోని హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న కొన్ని మారుమూల గ్రామాలకు ఏమాత్రం రవాణా సదుపాయాలు లేవు. అక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే సాహసయాత్ర చేయడమే.
ఆ గ్రామాల్లోని కొందరు తల్లిదండ్రులు చదువు కోసం తమ పిల్లల్ని పట్టణాలకు పంపుతున్నారు. కానీ, ఆ పిల్లలు కొన్నిసార్లు పదేళ్లు గడిచినా తిరిగి సొంతూరికి వెళ్లలేకపోతున్నారు.
కఠ్మాండూలో స్నోలాండ్ అనే స్కూలును ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. పేద, గ్రామీణ పిల్లలకు ఈ పాఠశాలలో ఉచిత విద్య అందిస్తోంది. అత్యంత పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ పాఠశాలలోనే జీవన్ కూడా చదవుకుంటున్నాడు.
జీవన్ తన సొంతూరికి వెళ్లాలంటే రెండు విమానాలు మారి, దాదాపు ఐదు రోజులపాటు ట్రెక్కింగ్ చేయాలి.
'స్నోలాండ్ స్కూల్‌లో చేరినప్పుడు నా వయసు నాలుగేళ్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మా కుటుంబంతో ఎప్పుడూ మాట్లాడలేదు కూడా. ఎందుకంటే, మా ఊరికి ఎలాంటి కమ్యూనికేషన్ సదుపాయం లేదు. నేను తిరిగొచ్చేటప్పటికి మా ఊరు కూడా కఠ్మాండూలా మారిపోయి ఉంటుందనుకున్నాను. కానీ, చూశాక అర్థమైంది. మా ఊరు ఏమీ మారలేదు. పారిశుద్ధ్యం గురించి అక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు' అని జీవన్ ఆవేదనతో చెప్పాడు.
పన్నెండేళ్ల తర్వాత ఇంటికెళ్లిన జీవన్ తన తల్లిని చూడగానే గుర్తుపట్టలేకపోయాడు.
'ఆమె మా అమ్మేనా? కాదా? అనిపించింది. మా అమ్మ వయసు మీదపడిపోయింది. నన్ను చూడగానే అమ్మ ఎంతో సంతోషపడింది. నన్ను ఒక విద్యావంతుడిలా చూసింది. అందుకు నాకెంతో ఆనందం వేసింది' అని జీవన్ చెప్పాడు.
ఇప్పుడు ఈ జీవన్ కథే ఒక అద్భుత డాక్యుమెంటరీగా మారింది.
'మా అమ్మానాన్నలకు మెరుగైన జీవితం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, నా చదువు కోసం వాళ్లు 12 ఏళ్లకు పైగా త్యాగం చేశారు. కాబట్టి, మా ఊరిని ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తాను' అంటున్నాడు జీవన్.