ఇంటర్నెట్‌డెస్క్ : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని తాగాలి అని సందేహిస్తున్నారా? పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా...!
నల్ల మిరియాలు : దగ్గు, గొంతునొప్పితో బాధపడుతుంటే నిద్రపోయేముందు వేడివేడి పాలల్లో చిటికెడు నల్లమిరియాల పొడిని వేసుకునే తాగితే ఆరోగ్యానికి మంచిది. నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
పసుపు : అనేక వ్యాధుల నుంచి పసుపు కాపాడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌లు వ్యాధుల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. ప్రతిరోజూ పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయి.
లవంగం : లవంగాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ పరగడుపునే రెండు మూడు లవంగాలను నమిలి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌లో లవంగాలను తీసుకుంటే గొంతునొప్పి వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
దాల్చిన చెక్క : ప్రతిరోజూ పాలల్లో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాల్చినచెక్క శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం, వికారం వంటి సమస్యలకు దాల్చినచెక్కను వాడితే మంచిది. కడుపు పూతల నివారణకు , ఆకలిని మెరుగుపరచడానికి దాల్చినచెక్క ఉపయోగపడుతుంది.