ఇంటర్నెట్‌డెస్క్ : ప్రస్తుతం డెంగ్యూ జ్వరాలు వణికిస్తున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు డెంగ్యూ బారిన పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ జ్వరం ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల పరిస్థితి మరింత తీవ్రతరమై ప్రమాదకరమవుతుంది. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. మరి ఏ ఆహారాలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారో తెలుసుకుందామా..!
ఐరన్ రిచ్ ఫుడ్స్
డెంగ్యూ జ్వర పీడితులు ముందుగా ఐరన్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. మాంసం, చేపలు, బీన్స్, ఆకుకూరలు, పప్పులు, ఖర్జూరం మొదలైన వాటిలో ఈ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రకమైన ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
విటమిన్ సి
విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్, కివీ, బెర్రీలు, బ్రకోలీ, టమాటాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే డెంగ్యూ నుండి త్వరగా బయటపడటానికి సహాయపడతాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లను వేగంగా ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది. ఇవే కాకుండా ప్రోటీన్ ఆహారాలు, తృణధాన్యాలు తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.