
టిటిడి కేంద్రంగా మతోన్మాద చిచ్చును పదే, పదే రగిలించడానికి బిజెపి తిరుమల వెంకన్నను ఆధారం చేసుకున్నది. టిటిడి నిధులను ప్రజోపయోగానికి వినియోగించకూడదంటూ అడ్డుతగులుతున్నది. టిటిడి నిర్వహిస్తున్న విద్య, వైద్యా సంస్థలు నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్లబుచ్చే పరిస్థితికి తెచ్చారు. టిటిడి విద్యాలయాలకు వేల సంఖ్యలో అడ్మిషన్లు వస్తున్నాయి. విద్యారంగాన్ని విస్తరింప చేయాల్సిన టిటిడి పట్టించుకోవడం లేదు. తిరుమల కొండపై చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఎస్.వి హైస్కూలును రేమాండ్స్ వారికి అప్పచెప్పారు. తాజాగా తిరుపతిలోని మరికొన్ని టిటిడి విద్యా సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
తిరుమల కొండపై బిజెపి ఉద్దేశపూర్వకంగా ఎంతో కాలంగా విషం చిమ్ముతున్నది. అవకాశం వచ్చినప్పుడల్లా అసత్యాలు జోడించి భక్తులను, సాధారణ ప్రజలను రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నది. తాజాగా టిటిడి బోర్డును కేంద్రంగా చేసుకుని బిజెపి నేతలు, మతోన్మాద శక్తులు విమర్శలు గుప్పిస్తున్నాయి. టిటిడి బోర్డుకు 52వ చైర్మన్‌గా నియమితులైన కరుణాకర్ రెడ్డిని క్రిస్టియన్‌గా, నాస్తికునిగా, అన్యమత ప్రచారకునిగా పలు ప్రకటనలు చేస్తున్నారు. గతంలో వై.వి.సుబ్బారెడ్డి పైనా ఇలాంటి విమర్శలే చేశారు. టిడిపి నియమించిన పుట్టా సుధాకర్, అనితలపైనా ఇలాంటి విమర్శలే చేశారు. పదిహేడేళ్ల కిందట నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి టిటిడి ఛైర్మన్‌గా కరుణాకర్ రెడ్డిని నియమించినప్పుడు బిజెపి వారు ఇదే రకమైన విమర్శలు చేశారు. ఆనాడు సోషల్ మీడియా ప్రభావం తక్కువ. విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఓ వెబ్‌సైట్‌ను సృష్టించి తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. తిరుమల నడక దారిలో శిలువకు పూజలు చేస్తున్నారని, తిరుమల కొండపై చర్చి నిర్మాణం జరుగుతున్నదని, ఏడు కొండలను రెండు కొండలుగా మార్చేశారని వంటి కథనాలు వండి వార్చారు. ఈ వెబ్‌సైట్ వివరాలను, వాటి కథనాలను నాటి టిటిడి ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్లు అందించినా కనీస చర్యలు చేపట్టడానికి సాహసించలేకపోయారు. ఇంతటితో ఆగకుండా విహెచ్‌పికి మద్దతుగా ఉన్న ఓ టీవీ ఛానల్ వారు తిరుమల బాలాజీనగర్‌లో ఓ ఇంటి గోడపై శిలువ గుర్తు వేస్తూ దొరికిపోయారు. సిబిసిఐడి వారు చేపట్టిన ఆ కేసు తదనంతర కాలంలో ఏమైందో ఏలికలకే ఎరుక. సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టుకుని తిరుమల కేంద్రంగా మతోన్మాద విషాన్ని చిమ్మేందుకు బిజెపి తమ సంస్థల ద్వారా ప్రయత్నిస్తూనే ఉంది.
టిటిడి బోర్డులో సభ్యులుగా కళంకితులకు స్థానం కల్పించారని వారిని తొలగించాలని బిజెపి యాగీ చేస్తున్నది. కేతన్ దేశాయికి రెండవసారి టిటిడి బోర్డులో అవకాశం కల్పించారు. గుజరాత్‌కు చెందిన ఈయనకు మహారాష్ట్ర నుంచి అవకాశం ఇచ్చారు. నరేంద్ర మోడీ, అమిత్ షా లకు సన్నిహితుడుగా చెప్పబడుతున్న ఈయన 'మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' చైర్మన్ హోదాలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇంకా 2 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈయనలో ఏ భక్తికి పరవశించి బిజెపి పాలకులు ఈయన సభ్యత్వానికి సిఫార్సు చేశారో చెప్పటం లేదు.
అరబిందో ఫార్మా గ్రూపు డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిజెపి ఒత్తిడికి లొంగిపోయి అప్రూవర్‌గా మారారని, వైసిపి వంత పాడిందని మీడియాలో కథనాలు వచ్చాయి. కళంకిత బోర్డుగా మాట్లాడుతున్న బిజెపి ఓ విషయాన్ని మరుగు పరుస్తున్నది. ప్రకటించబడిన టిటిడి బోర్డులో బిజెపి సిఫార్సులతో సభ్యత్వం పొందిన వారు 10 మందికి దాకా ఉన్నారు. వైసిపికి ఈ విషయమై నోరు ఎందుకు పెగలటం లేదో అర్థం కాదు. పెద్దనోట్ల రద్దు సందర్భంగా నోట్ల కట్టలతో పట్టుబడ్డ శేఖర్ రెడ్డి టిడిపి హయాంలో బోర్డు సభ్యుడిగా ఉండటాన్ని నిరసిస్తూ వైసిపి విమర్శలు చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చాక అదే శేఖర్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిచి మరీ బోర్డు సభ్యత్వం ఇచ్చారు. ప్రస్తుతం ఈయన టిటిడి చెన్నై సలహా మండలి చైర్మన్‌గా ఉన్నారు.
ఒకవైపు బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌లు టిటిడిపై దాడి చేస్తుంటాయి. మరో వైపు టిటిడికి మద్దతుగా శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరగలేదంటూ విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలు టిటిడి వేదికల నుంచే మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. వాస్తవంగా శ్రీవాణి ట్రస్టు నుంచి చేస్తున్న ఖర్చులో సింహ భాగం బిజెపి అనుయాయ సంస్థల ద్వారా నిర్వహించ బడుతున్నది. టిటిడి లోని దాదాపు అన్ని ట్రస్టులను నిర్వీర్యం చేసి శ్రీవాణి ట్రస్టుకు మాత్రమే విరాళాలు తీసుకునేంత వరకు ఇది దారి తీసింది.
ఇక టిడిపి విషయానికి వస్తే 2014 తరువాత బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి బోర్డు సభ్యునిగా పని చేశారు. బిజెపి-టిడిపిల మధ్య ప్రత్యేక హోదా విషయమై టగ్ ఆఫ్ వార్ నడుస్తున్న కాలంలో మహారాష్ట్రకు చెందిన బిజెపి మంత్రి భార్యకు టిటిడి బోర్డు సభ్యత్వాన్ని కట్టబెట్టింది.
గత బోర్డులలో అధికారంలో ఉన్నది ఎవరైనా బిజెపి అనుయాయులకు టిటిడి బోర్డు సభ్యత్వం వుంది. ప్రస్తుత బోర్డులో కర్ణాటక లోని ఎలహంక బిజెపి ఎంఎల్‌ఎ ఎస్‌ఆర్ విశ్వనాథ్‌కు రెండవసారి సభ్యత్వం ఇచ్చారు. ఈయన నియోజక వర్గ పరిధిలోనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంది.
టిటిడి కేంద్రంగా మతోన్మాద చిచ్చును పదే, పదే రగిలించడానికి బిజెపి తిరుమల వెంకన్నను ఆధారం చేసుకున్నది. టిటిడి నిధులను ప్రజోపయోగానికి వినియోగించకూడదంటూ అడ్డు తగులుతున్నది.
తిరుపతి భూగర్భ డ్రైనేజి పనుల ఖర్చును టిటిడి భరించరాదని విహెచ్‌పి గతంలో కోర్టుకెళ్లింది. రూ.25 కోట్ల ఖర్చుతో పూర్తి కావలసిన పనులు, కేసు పూర్తయి టిటిడికి అనుకూలంగా తీర్పు రావడంతో ఖర్చు భారం రూ.100 కోట్లకు చేరింది.
తిరుపతి రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రులకు నిధులు కేటాయించడాన్ని, ఆఖరుకు స్విమ్స్ ఆసుపత్రికి ఇతర మతస్థులైన డాక్టర్లు రావడానికి వీల్లేదని బిజెపి దాని అనుయాయ సంస్థలు అడ్డుపడ్డాయి.
తిరుపతి నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గరుడ వారధి పేరుతో ఫ్లైఓవర్ (బ్రిడ్జి) నిర్మాణం చేపడితే ఈ నిర్మాణానికి టిటిడి నిధులు కేటాయించరాదని బిజెపి నేతలు కోర్టుకు వెళ్లారు. తిరుపతి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఉపసంహ రించుకున్నారు.
టిటిడి నిర్వహిస్తున్న విద్య, వైద్యా సంస్థలు నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్లబుచ్చే పరిస్థితికి తెచ్చారు. టిటిడి విద్యాలయాలకు వేల సంఖ్యలో అడ్మిషన్లు వస్తున్నాయి. విద్యారంగాన్ని విస్తరింప చేయాల్సిన టిటిడి పట్టించుకోవడం లేదు.
తిరుమల కొండపై చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఎస్.వి హైస్కూలును రేమాండ్స్ వారికి అప్పచెప్పారు. తాజాగా తిరుపతిలోని మరికొన్ని టిటిడి విద్యా సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
టిటిడి అనేక ఏళ్లుగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్య, వైద్య రంగాలకు ఊతం ఇస్తున్న విధానాలకు తిలోదకాలిస్తున్నది. టిటిడి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాలతో మతోన్మాద శక్తులకు బలం చేకూర్చే చర్యలకు పాల్పడుతున్నారు. తాము భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నామన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు.
( వ్యాసకర్త సెల్: 94900 98840 )
కందారపు మురళి