Sep 25,2022 08:41

చుట్టూ పచ్చని చెట్లు ఎన్ని ఉన్నా
ఎండిన ఆ చెట్టుపైనే
వాలుతుంది గొంతు..

ఆకుల్లేని కొమ్మల మధ్య
ఒంటరితనంతో
పూతే లేని ఏకాంతంలో
కన్ను, కాలు ఆ వైపుగా ఎగిరి
ఆలోచనల గూడులో
కలల కాపురమక్కడే.

గాలికి కొమ్మలు కొరకొరలాడినా
వేడికి చెట్టు చిటచిటలాడినా
ఎండిన మేనుపై
కూతను పూతగా రాస్తూ
కూని రాగంతో సేవ చేస్తూ

చిగురు తీపి స్పర్శ అందేదాకా..
ఆకాశాన్ని పూజిస్తూ
మేఘానికి దణ్ణం పెడుతుంది
ఒక్క జల్లుతో
వేరుకు ప్రాణం పోసి
పచ్చగా జీవించమని
 

చందలూరి నారాయణరావు
97044 37247