
ఢిల్లీ: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తుమ్మల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు ఢిల్లీ చేరుకుని రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత యువనేతతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఆయన పార్టీలో చేరిన రోజు రాహుల్ గాంధీ సమయం ఇవ్వలేకపోయారు. దీంతో అధిష్ఠానం తుమ్మలను పిలిపించుకుంది. దాదాపు అరగంటసేపు రాహుల్ గాంధీ, తుమ్మల నాగేశ్వరరావులు సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.