రోజు రోజుకూ పెరుగుతున్న అధునాతన సాంకేతికతతో మొక్కల ప్రపంచంలో ఎన్నో కొత్త రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. వేలాదిగా విస్తరించి ఉన్న కడియం నర్సరీల్లో ఏదో మారుమూల, ఏదో సరికొత్త మొక్క కొలువు దీరి మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తూనే వుంటుంది. ఎన్నో విశిష్ట లక్షణాలతో కనువిందు చేసే ఆ అత్యాధునిక మొక్కలను చూసి, మనం పులకించి పోవలసిందే. ఆ ఒంపు సొంపుల వినూత్న మొక్కల వయ్యారాలను చూసేద్దాం !
అశ్వత్థం అదరహో !
అశ్వత్థం వక్షం అంటే రావి చెట్టు. మానులు తిరిగి, పెద్ద పెద్ద కొమ్మలతో, ఈసులు లాంటి ఊడలతో హదయాకారపు పత్రాల రెపరెపల రావి చెట్లు మనందరికీ తెలుసు. కానీ ఈ సరికొత్త ఈ వెరిగేటా ఆ రావిచెట్టు మాత్రం అంతా అద్భుతమే. ఈ చెట్టు కేవలం ఐదు నుంచి పది అడుగులు ఎత్తు మాత్రమే పెరుగుతుంది. సాధారణ రావి చెట్టు ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. కానీ ఈ చెట్టు ఆకులు భలే గమ్మత్తుగా ఉంటాయి. పత్రాలు చుట్టూతా తెలుపు రంగులోనూ మధ్యలో ఆకుపచ్చని బొట్లు మాదిరిగా ఉంటాయి. ఆకులు కూడా కాస్త చిన్న పరిమాణంలో ఉంటాయి. ప్లాస్టిక్ తలమళుకులతో అకులు మిలమిల మెరుస్తూ ఉంటాయి. అన్ని రకాల నేలల్లో పెరిగే ఈ మొక్క కుండీల్లోనూ, భూమ్మీదా పెంచుకోవచ్చు. ఆకుల మీద నీటిని పిచికారీ చేస్తే ఆకులు మెరుస్తూ మరింత అందాన్ని అద్దుకుంటాయి. అన్ని వాతావరణాల్లో పెరిగే ఈ మొక్కది వందల ఏళ్ల ఆయుష్షు. వీటిని కావలసిన షేపుల్లో కత్తిరించుకోవచ్చు. చాలా రోజులు నీటివనరు అందకపోయినా మొక్క తట్టుకుంటుంది. థాయిలాండ్ దేశం నుంచి ఈ మాత మొక్కలను తీసుకొచ్చి, వాటి నుంచి ఇక్కడ సరికొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంటి ముంగిట, కార్యాలయాల్లోనూ మాల్స్ ఎదుట డివైడర్స్‌లోనూ, ఫంక్షన్ హాల్స్ వద్ద ఈ మొక్కలు పెంచితే, చక్కగా విచ్చుకొని అందంగా ఆకర్షిస్తాయి.
డ్వార్ప్ బత్తాయి..
బత్తాయిలో చాలా రకాలు మనకు తెలుసు. వాటిలో ఆకుపచ్చ రంగులో ఉండేవి, పసుపుచ్ఛాయలో ఉండేవి.. కాషాయం వర్ణంలో ఉండేవి. పసుపు, ఆకుపచ్చ రంగుల కలబోతతో చారలు మాదిరిగా డిజైన్లతో ఈ సరికొత్త డ్వార్ప్ బత్తాయిలు.. చూడగానే ఆహా అనిపిస్తుంది. ఆకులు కూడా రెండు రంగుల్లో ఉండి, తరువాత మాత్రం ఆకుపచ్చ రంగులోకి మారడం ఈ మొక్క విశిష్టత. ఇది చైనీస్ వెరైటీ. బత్తాయి పండ్లు రుచి కూడా చాలా మధురం. కాకపోతే కాపు కాస్తా మందముగా ఉంటుంది. మొక్కకి సీజన్‌తో ప్రమేయం లేకుండా సంవత్సరం పొడవునా కాస్త చిన్నవో, పెద్దవో కాయలు కాస్తూనే ఉంటాయి. మూడు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. మొక్క కాయలు కూడా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. కుండీల్లోనూ, నేల మీద కూడా పెంచుకోవచ్చు. రోజూ కొద్ది కొద్దిగా నీటిని అందించాలి. ఈ పండ్ల మొక్క ఆర్నమెంటల్ మొక్కలాగా చాలా అందంగానూ ఉంటుంది. నాటిన ఏడాదికే కాపు అందుకుంటుంది. సాధారణంగా బత్తాయి చెట్టుకు ముళ్లుంటాయి. కానీ ఈ బత్తాయికి ముళ్లుండవు. 'సి' విటమిన్ అధికంగా ఉండే వీటిని విదేశాల్లో జ్యూస్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఫాక్స్‌టైల్ మునగ..
ఎన్నో పోషకాలు ఉన్న మునగ మెండుగా కాయలు కాస్తుంది. కానీ ఈ పాక్స్‌టైల్ మునగ అంతగా కాయలు కాయదు. కొమ్మల్లేకుండా బొప్పాయి చెట్టులాగ నిటారుగా పెరిగి, పామ్ చెట్టులా ఆకులు విచ్చుకుంటుంది. సంవత్సరానికి పదో! పరకో! మాత్రమే మునగకాయలు కాస్తాయి. లావుపాటి కాండంతో మొక్క భలే అందంగా ఉంటుంది. ఇది సింగపూర్ జాతి మొక్క. డివైడర్లలో, ఇంటి ముంగిట అలంకారంగానూ ఈ మొక్కను ఎక్కువగా పెంచుతుంటారు. వీటిని కాస్త పెద్ద కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అప్పుడప్పుడూ కాస్త నీటి తడి పెడితే సరిపోతుంది. అన్ని నేలల్లో పెరిగినప్పటికీ, ఎర్రమట్టి నేలలో బాగా పెరుగుతాయి. ఈ మొక్క 15 అడుగుల ఎత్తు వరకూ పెరగగలదు. దీన్నే ఆర్నమెంటల్ మునగ అని కూడా అంటారు. ఒక్కో మొక్క దాదాపు 500 రూపాయల వరకు ధర ఉంటుంది.
హుజేనియా ప్యూర్ రెడ్..
గోరింటాకు ఆకుల్లా చిన్న చిన్న పత్రాలు మొక్క నిండుగా ఉండి, నవనవలాడుతూ పెరిగే మొక్క హుజేనియా. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. కానీ అందులో అత్యంత అరుదైనది హుజేనియా ప్యూర్ రెడ్. థాయిలాండ్‌కు చెందిన ఈ రకం ఇటీవలే కడియంకి వచ్చింది. పునరుత్పత్తి చేసి, కొత్త మొక్కలు సిద్ధం చేశారు నర్సరీ రైతులు. మొక్క చిగురు పత్రాలన్నీ అరుణ వర్ణాలు పూసుకొని, మెరుస్తూ కిసలయ విన్యాసం చేస్తూ అబ్బుర పరుస్తాయి. ఎంతో రమణీయంగా ఉండే దీన్ని రెడ్‌క్వీన్ అనీ పిలుస్తారు. ఈ మొక్కను కుండీల్లోనూ నేల మీదా పెంచుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు పోస్తే సరిపోతుంది. కావలసిన ఆకారాల్లో కత్తిరించుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది ఈ మొక్క. అన్ని నేలల్లోనే పెరుగుతుంది. డివైడర్లు, పార్కింగ్ ప్లేస్లు, ఇంటి ముంగిట, బోర్డర్ ప్లాంట్లగా వీటిని పెంచుకోవచ్చు. నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఒక్కో మొక్క 200 రూపాయలు మద్దతు ధర పలుకుతుంది.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506