Aug 03,2023 17:35

అమరావతి : విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు కూలీలకు కరెంట్‌ షాక్‌ తగలడంతో వారిని కాపాడేందుకు వెళ్లిన అంగన్‌వాడీ ఆయా సైతం కరెంట్‌ షాక్‌కు గురై మొత్తం ముగ్గురు మృతి చెందారు. సంతకవిటి మండలం సోమన్నపేటలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామినాయుడు అనే ఇంటి యజమాని ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు పి.కేసరి (22), జి.చంద్రశేఖర్‌(18) అనే కూలీలు వెళ్లారు. వీరు ఇనుపచువ్వ పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగలి కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. వీరిని కాపాడేందుకు సమీపంలో ఉన్న అంగన్‌వాడీ ఆయా రియమ్మ(57) పరుగున వెళ్లి పట్టుకోవడంతో ఆమె కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. మొత్తం ముగ్గురు అక్కడికికక్కడే చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.