Jul 27,2023 21:35

ప్రజాశక్తి-గుంతకల్లు, రాయదుర్గం :అనంతపురం జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్‌కు గురై ముగ్గురు మరణించారు. గుంతకల్లులో తండ్రీకుమారుడు, రాయదుర్గంలో నిర్మాణ కార్మికుడు మృతిచెందారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లు పట్టణం పాత గుంతకల్లు ఆర్‌డిటి కార్యాలయం ఎదుట నివశిస్తున్న రైతు బోయ పుల్లన్న (50) తన ఇంటి వద్ద ఉన్న కొమ్మలు నరికేందుకు చెట్టు ఎక్కారు. ఈ క్రమంలో చెట్టుకొమ్మలు హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగలడంతో షాక్‌కు గురయ్యారు. తండ్రిని కాపాడే క్రమంలో కుమారుడు శివ (22) అతన్ని పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాయదుర్గం పట్టణంలోని కణేకల్‌ రోడ్‌లో ఉన్న శని మహాత్మా గుడిమిట్ట వద్ద నిర్మిస్తున్న నూతన ఇంటి పనులకు నిర్మాణ కార్మికుడు సునీల్‌(25) వెళ్లారు. పైన ఉన్న విద్యుత్‌ వైర్లను గమనించకుండా ఇనుప కడ్డీనిపైకి ఎత్తడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.