ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు వైసిపికు రాజీనామా చేశారు. కౌన్సిలర్లు గోపాలకృష్ణ (4వ వార్డు), కె.వెంకటరమణ (6వ వార్డు), వై. నాగబాబు (18వ వార్డు) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీలో తమకు ప్రాధాన్యం లేదని ఆరోపించారు.పట్టణం, తమ వార్డుల్లోని పలు సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుపునకు తాము శక్తివంచన లేకుండా పని చేశామని చెప్పారు. అలాంటి తమకు గత కొంతకాలంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. ఇప్పటికే 14వ వార్డు కౌన్సిలర్ ఎం.నారాయణ స్వామి వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరగా.. తాజాగా మరో ముగ్గురు కౌన్సిలర్లు వైసిపికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.










