ఇంట్లో అడుగుపెడుతూనే సుచరిత కోసం వెతికాడు సుందరం. అక్కత్తయ్య కనిపెట్టింది. 'ఒరే సుందూ.. నీ పెళ్ళాం ఎదురుగుండా ఉన్న రౌండ్ పార్క్‌కి వెళ్ళిందిరా.. పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళడం, దానికి తోచి చావడం లేదట..!' ఇంకా ఏదో అనబోతూ ఉంటే, సుందరం గబగబా ఎదురుగా ఉన్న పార్కు దారి పట్టేడు.
మూలగా ఉన్న బెంచీ మీద కూచొని ఉంది సుచరిత.
'ఏమిటోరు, సుచీ ఇక్కడ కూచున్నావ్?'
ఉలిక్కిపడి తలెత్తి మొగుణ్ణి చూసింది సుచరిత. ఏదో కోపం తలెత్తింది ఆమెకి.
'రామరామ కాసేపు పార్కులో కూర్చోడం కూడా నేరమా? ఏదో నేను సంసారం వదిలేసి, పారిపోతున్నట్టు ఏమిటా గాభరా?'
'సంసారం వదిలేస్తే గాభరా ఆడవాళ్ళకిగానీ మొగుళ్ళకి ఉండదే పిచ్చిదానా?'
'సరి! ఎంత దివ్యమయిన కాపురమో.. పోతుందో ఏమో అని బెంగపడ్డానికి'
'అంత వెటకారంగా చేతులు తిప్పుతున్నావ్, ఇంతకీ నీ కాపురానికి ఏం తక్కువో? కంటికి రెప్పలా చూసుకొనే అత్తగారు, ఇంకా ...'
'అవునవును, అత్తగారు, అక్కత్తయ్యా, అమ్మత్తా! దేవుడా, ఏం వరసలో? ఏం పిలుపులో? అసలు మా నాన్నని అనాలి. ఇంటినిండా ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు. మన పిల్ల ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి రావచ్చు' అంటూ నన్ను ఈ ఉచ్చులో పడేశారు.'
'మై గాడ్, ఉచ్చులోనా? ఇక్కడ ఉచ్చు ఉందా?'
'ఉచ్చు కాకపోతే ఊబి. అంత ఓవర్ యాక్షన్ చేస్తేనే మండుతుంది!'
'మా నాన్నకి చెల్లెలు వరసవుతుంది అమ్మత్తయ్య. వాళ్ళ అమ్మాయి అక్కత్తా. పాపం ఎవరూ లేరని మా నాన్న వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. ఇద్దరూ ఒంటరిమహిళలు. కాస్త ఉన్నవాళ్ళు. అమ్మత్తయ్య నాలుగు పేటల చంద్రహారాలు మా అమ్మ మెళ్ళోనే వేసింది తెలుసా? పిలుపులు మా ఇంట్లో ఇలాగే ఉంటాయి.'
'గొప్పగా చెప్పేరు. ఇవన్నీ మా మామ్మ, అమ్మా చెప్తుంటే విన్నవే'
'నేను ఇంకా తేరుకోలేదు. నీకొచ్చిన కష్టం ఏమిటి?'
'అత్తగారి కాలు బెణకడం కాదు గానీ నాకు బుర్ర బెణికింది. ఒళ్ళు వణుకుతోంది.'
'ఏమిటీ? నిజంగానా?'
'ఏమిటేమిటి? ఈ పెద్దలని తృప్తిపరచడం మాటలా? అమ్మో..! మీ అమ్మత్తయ్య గారు అఖండులు. ఇంత వయసు అయినా ఆవిడ జిహ్వ చాపల్యం ఉందే.. అది సామాన్యం కాదు.'
'మొన్నటికి మొన్న చపాతీలు, కూరా చేశానా? తీరా అత్తగారు పిలిచీ అంటుందీ.. 'అమ్మారు చపాతీలు నువ్వు అందరికీ చేయలేదా?' అదేమిటి..! చేసేనే అని నేను తెల్లబోయి చూద్దును కదా, అమ్మత్తయ్య గారొచ్చి 'అబ్బే అవి మాకే చాల్లేదే!' అంటున్నారు. 'పదిహేను చపాతీలు ముగ్గురూ ఊదేశారు. ఓయమ్మో ఇంత గట్టి పొట్టలని ఎవరూహిస్తారు?'
'పాపం ఆకలయిందేమో లేవే!' జడుస్తూ అన్నాడు సుందరం.
'ఆకలేమిటండీ, మా మామ్మ లేదూ మా ఇంట్లో? సాయంకాలం ఓ జాంపండు తింటే అదే డిన్నర్! ఇంకేమీ అక్కరలేదు. అబ్బో మీ అక్కత్తయ్య ఉందే, ఆవిడ అందర్నీ మించిపోతుంది.'
'చిలకపచ్చటి పట్టుచీర, ఎర్రటి హంసల బోర్డర్తో ఓ చీర ఉందావిడ దగ్గర. ఇహ కట్టను అని అన్నదని 'పోనీ మన వాహినికి డ్యాన్స్ డ్రెస్ కుట్టించిద్దామా?' అని అడిగితే, ఇంకోరయితే ఎగిరి గంతేసి ఇద్దురు నేను చేస్తున్న చాకిరీకి. ఈవిడ మాత్రం ఏమందో తెలుసా?'
'ఏమందేమిటి..?' భయం భయంగా అడిగేడు సుందరం.
'హవ్వా.. చెప్పుకుంటే సిగ్గుచేటు. సిగ్గుతో, మెలికలు తిరుగుతూ, 'వద్దే, ఈ చీర ఆయన కొనిచ్చినది. నా చీరలు మరెవరు కట్టుకున్నా వారు ఒప్పుకొనేవారు కాదు సుమీ..!' అంది'
'పాపమే, ఏదో ఆవిడ సెంటిమెంట్ ఆవిడది లెద్దూ..!'
'కాదన్నది ఎవర్లెండి? మీ అమ్మత్తయ్య మాటలు వినాలి మీరు.'
సుందరానికి నాలిక పిడచకట్టేస్తోంది అప్పటికే.
'నన్ను పిలిచి, 'ఒసే, ఉక్కిరి చెయ్యవే' అంది మొన్న. అంటే ఏమిటో తెలీలేదు. 'ఉక్కిరిచెయ్యే, ఉక్కిరి చెయ్యే' అంటూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అదెలా చేయాలో అత్తగారిని అడిగి, పుల్ల మజ్జిగలో వరిపిండి తడిపి ఇంత నూనె, పోపు వేసి చేస్తూ ఉంటే అంటుందీ.. 'అయ్యో, ఉక్కిరికి ఇత్తడి మూకుడు వాడాలే!' అంటూ దీర్ఘాలు. ఇదెక్కడ తిండిపిచ్చో?'
'ఎక్కడయినా వయసులో ఉన్నవారికి కాస్త తిండి పిచ్చి ఉంటుంది అంటారు. ఇదెక్కడి ప్రారబ్ధమో ఇక్కడ అంతకుమించిన మొనగాళ్ళలా ఉన్నారు.'
'పోనీవే. ఇంకెన్నాళ్ళో బతుకుతారా చెప్పు? ఏదో కాస్త నాలికకి రుచిగా తినాలని యావ!'
'సరీ.. మీ ఇంట్లో ఆయుష్షులే చెప్పాలా? సెంచరీలే కదా అందరూ!'
'ఒసే, అయితే ఏమిటంటావ్! అందరినీ కలిసికట్టుగా టపా కట్టీయమంటావా?'
'నేనేం ఆ దేవుడి పోస్ట్‌మేన్‌నా ఏమిటి? టపాలు కట్టించడానికి?'
'మరి నీకు కాస్త అందరూ భారంగా ఉన్నట్టున్నారు.'
'ఎవరెన్నాళ్ళుంటే నాకేం? ఆ మాటలే! మావిడి పళ్ళు, సపోటాలు, బొప్పాసి ఏవయినా శుభ్రంగా కడిగి తొక్కతీసి, 'చిన్న చిన్న' ముక్కలు తరిగి ఫ్రిజ్‌లో ఉంచేను. అక్కత్తయ్యగారు, ఓ నిద్ర తీసి లేచి తింటూంటే, పక్కింటి సరసమ్మగారొచ్చి 'వదిన మంచం పట్టినా, మీకు జరుగుబాటుకి ఏ లోటూ లేదు అక్కగారూ' అంటే మీ అక్కత్తయ్య అంటుందీ.. 'ఆ..ఉ.. దీనికేనా? పొయ్యి మీద పెట్టాలా? పోపు వేసి వేపాలా? పళ్ళు ఇవ్వడం అంత సులువు అదే' అంటుంది. అబ్బా, ఆ వజ్రాల బుర్ర, బంగారం నాలికా చూస్తే ముచ్చటపడి తీరాలి సుమీ!'
'ఎప్పుడు చూసినా, తిండి గోలే.. అన్ని వంటకాలు తలచుకోడం, తిని ఎన్నాళ్ళయిందో అని వగచడం! మా మేనత్త వాళ్ళత్తగారిని తిట్టేది 'తింటారు, లేదంటారు! మీకొడుక్కి మీ పోలికే వచ్చింది' అని. ఇక్కడ చూడాలి ఆవిడ'
'సుచీ, ఇంటికి వెళదామా! ఆకలి వేస్తోంది!'
'ఇంకా అనలేదు ఏమిటా? అని చూస్తున్నా! పదండి.. వాళ్ళు ముగ్గురూ కలిపినంత మీరొక్కరు!'
మంగు కృష్ణకుమారి
95535 86346