Aug 05,2023 07:20

              ఆర్థిక పరపతిని నిర్ధారించే కొలమానాల్లో రుణ యోగ్యత ముఖ్య ప్రామాణికం. దేశాలకైనా, వ్యక్తులకైనా 'నీ రుణ యోగ్యత ఇంతే'నంటూ తేల్చిపారేసే రోజులివి. 'సిబిల్‌' స్కోరు ఎంత ఉంటే రుణాలు పొందే యోగ్యత అంతవున్నట్టు! ఈ స్కోరు ఎంత దిగజారితే ఆర్థికంగా అంత దిగజారినట్టు. అంత కష్టాల్లో ఉన్నట్లు లెక్క. అమెరికాలోనూ, డాలర్‌ ప్రాపకానికి గురై దాంతో ముడిపడిన దేశాల్లోనూ ఇప్పుడు ఈ రుణ యోగ్యత రేటింగ్‌లే కలకలం రేపుతున్నాయి. ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ ఫిచ్‌ ఇటీవల అమెరికా రుణ యోగ్యతకు కోత విధించడం ఆ దేశ ఆర్థిక దుస్థితికి అద్దం పట్టింది. ఇదివరకు 'ఎఎఎ'గా ఉన్న రేటింగ్‌ను 'ఎఎ ఫ్లస్‌'కు తగ్గించింది. పరపతికి కోత పెట్టడంతో పాటుగా రానున్న మూడేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించొచ్చని హెచ్చరించింది కూడా. యుఎస్‌పై పెరుగుతున్న రుణ భారమే ఇందుకు ప్రధాన కారణంగా ఆ సంస్థ విశ్లేషింది. ఆధిపత్య బరితెగింపుతో దేశాల మధ్య విద్వేషాగ్ని రాజేయడం, సైనిక జోక్యం, మింగుడు పడని దేశాలపై ఆంక్షలు విధించడం ఆది నుంచి అమెరికా చేస్తూ వచ్చిన కుతంత్రాలు అన్నీఇన్నీ కావు. అన్ని దేశాలనూ వ్యతిరేకంగా చేసుకుంటూ రావడం వల్లే ఆంక్షలు విధించాల్సిన దేశాల జాబితా పెరిగిపోయి లావాదేవీలు కుంగిపోయి ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టుగా ఆర్థిక మాంద్యంలోకి దిగజారుతోంది.
          సైనిక వ్యయాన్ని పెంచుకుపోతుండటం, కార్పొరేట్‌ కంపెనీలకు ప్రజాధనాన్ని తరలించడం, బ్యాంకులను దివాళా దీయించడం వంటి చర్యలతో ఆర్థిక క్రమశిక్షణను, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేయడం వల్లే ఈ దుస్థితి. ఉక్రెయిన్‌ను సాకుగా చూపి రష్యాపైనా, తైవాన్‌ను ఎగదోస్తూ చైనాపైనా 'పెట్టుబడి' అగ్రరాజ్యం విధించిన ఆంక్షలకు హద్దుపద్దు లేకుండా పోయింది. వస్తు, మేధో ఉత్పాదక శక్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన చైనా ఇందుకు భిన్నంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నిటినీ వస్తు ఎగుమతుల ద్వారా ప్రభావితం చేస్తోంది. అమెరికా సబ్‌ప్రైమ్‌ రుణాల ఊబిలో చిక్కుకుపోవడం మూలాన 2008లో ఇప్పటికే మహామాంద్యమాన్ని చవిచూసిన ప్రపంచం ఇప్పుడు మళ్లీ అదే కలవరపాటుకు గురి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
          అమెరికా రుణ పరపతి తగ్గిపోవడంతో ఆ ప్రభావం అమెరికాతో అంటకాగుతున్న భారత్‌పై కూడా తీవ్రంగానే పడనుందని సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల వరుస పతనాలు సంకేతాలిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.3.5 లక్షల కోట్లు ఆవిరయ్యింది. యూరప్‌, ఆసియా మార్కెట్ల పరిస్థితి కూడా ఇంతే. పదేపదే సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్న అమెరికా డాలరు ప్రాపకం కూడా క్రమంగా దిగజారుతూ వస్తోంది. ప్రత్యామ్నాయ మారకాలకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంపన్న పశ్చిమ దేశాలకు ముడిపదార్థాలను సరఫరా చేసే మూడో ప్రపంచ దేశాలను డాలరు ఆధిపత్యంతో కీలుబొమ్మలుగా చేసుకోవచ్చునే ఎత్తుగడతో అమెరికా జిత్తులు వేస్తూవస్తోన్న సంగతి తెలిసిందే. ముడిసరుకుల ధరలను పెరగకుండా అదుపులో ఉంచడానికి, మూడో ప్రపంచ దేశాల ఆదాయాలలో పెరుగుదల లేకుండా చేయడానికి డాలర్‌ ఆధిపత్యం తోడ్పడుతుంది. అందువల్లే రష్యా, చైనా, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలు ప్రత్నామ్నాయ మారకాల వైపు చూస్తున్నాయి. భారత్‌ కూడా ఈ సంక్షోభాల నుంచి పాఠాలు నేర్వాలి. గతంలో సోవియట్‌ యూనియన్‌ ఏవిధంగా రూబుల్‌కు, ఆయా దేశాల కరెన్సీలకు మధ్య నిర్ధారిత మారకపు రేటుతో ఒప్పందానికి వచ్చి వ్యాపార లావాదేవీలను జరిపేవారో, అదే మాదిరిగా ఇప్పుడు వివిధ దేశాలు ప్రత్యామ్నాయ మారకాలతో ముందుకొస్తున్నాయి. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా దేశాల కూటమిగా ఉన్న 'బ్రిక్స్‌' కూడా డాలరుతో ఢ అంటోంది. 2022 నుండి 2026 మధ్య సభ్యదేశాలకు మంజూరయ్యే రుణాల్లో 30 శాతం ఆయా దేశాల కరెన్సీల రూపంలోనే ఇవ్వన్నుట్లు బ్రిక్స్‌ ప్రకటించింది కూడా. ప్రత్యామ్నాయ మారకాలు ఎన్ని వస్తే డాలరు పెత్తనం అంతగా తగ్గుతుంది. అమెరికా ఏకచత్రాధిపత్యానికి తెరపడి సంక్షోభాలు తగ్గుముఖం పడతాయి. వివిధ దేశాలు ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తాయని ఆశిద్దాం.