Dec 23,2022 07:37

'నిబద్ధులైన' న్యాయమూర్తులతో అత్యున్నత న్యాయ వ్యవస్థను పూర్తిగా నింపివేయాలనే తన లక్ష్యాన్ని సాధించాలంటే...కొలీజియం వ్యవస్థ అనువైనది కాదని ప్రభుత్వం భావించింది. అందువల్ల, అత్యున్నత న్యాయ వ్యవస్థను పూర్తిగా స్వాధీనం చేసుకునే కుట్రలో భాగంగానే కొలీజియం వ్యవస్థపై ప్రస్తుత దాడిని చూడాల్సి వుంది. జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు మరో చట్టాన్ని చేయాల్సిన అవసరం వుందంటూ పాలక బిజెపి వర్గాలు మాట్లాడుతున్నాయి. దీని ద్వారా, ప్రభుత్వం తన ఆధిపత్యం వుండేలా నియామకాల వ్యవస్థను రూపొందించాలని భావిస్తోంది. అత్యున్నత న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఇదొక కచ్చితమైన మార్గం కాగలదు.

మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుపై తన దాడిని ఉధృతం చేసింది. గత కొద్ది వారాలుగా, కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు పార్లమెంట్‌ లోపల, వెలుపల పలు ప్రకటనలు చేస్తున్నారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు చేస్తున్నారు. న్యాయమూర్తులను నియమించడం ప్రభుత్వ హక్కు అన్నది రాజ్యాంగ స్ఫూర్తి అని స్పష్టం చేస్తున్నారు.
         రాజ్యసభ ఛైర్మన్‌గా మొదటి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కూడా సుప్రీం కోర్టుపై దాడి చేశారు. జాతీయ జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ చట్టం-2014 చెల్లుబాటు కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పార్లమెంటరీ సార్వభౌమాధికారంపై దాడి అని విమర్శించారు. అధికారిక పదవుల్లో వున్న ఈ ఇద్దరు వ్యక్తుల వ్యాఖ్యలు చూస్తుంటే, దాడికి సంకేతాలు చాలా ఉన్నత స్థాయి వర్గాల నుండే వస్తున్నాయని స్పష్టమవుతోంది.
        కొలీజియంపై చేసిన వ్యాఖ్యలతో సంతృప్తి చెందని రిజిజు, ఉన్నత న్యాయ వ్యవస్థపై పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ''న్యాయమూర్తుల నియామకపు పద్ధతి మారని పక్షంలో ఉన్నత స్థాయిలో జ్యుడీషియల్‌ ఖాళీల సమస్య తలెత్తుతూనే వుంటుంది.'' అంటూ పార్లమెంట్‌లో ఆయన ప్రకటించారు. దీనివల్ల తలెత్తే చిక్కు ఏంటనేది చాలా స్పష్టంగా వుంది - సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు కొలీజియం సూచించిన న్యాయమూర్తుల నియామకాలను ప్రభుత్వం నిలిపివేస్తూనే వుంది. న్యాయమూర్తులుగా ఎవరిని నియమించాలనే అంశంపై ప్రభుత్వ ఆకాంక్షలకు న్యాయవ్యవస్థ కట్టుబడి వుండేవరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది.
          బెయిల్‌ దరఖాస్తులను, పనికిమాలిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్‌) విచారించరాదని, తద్వారా తన సమయాన్ని వృధా చేసుకోరాదంటూ సుప్రీంకోర్టుకు న్యాయ శాఖా మంత్రి ఏకంగా ఉపన్యాసాన్నే ఇచ్చారు. పైగా మరింత లోపభూయిష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ''అర్హులకు న్యాయం అందేలా చూడాలని...కోర్టు పని చేస్తున్నపుడు లేదా తన విధులను నిర్వర్తిస్తున్నపుడు అనవసర భారాన్ని కలిగిస్తున్న వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వుండేలా వారి గురించి పట్టించుకోవాలని కూడా మేం న్యాయ వ్యవస్థను అడగాల్సి వస్తోంది.''
         ''అర్హులకు న్యాయం అందేలా చూడాలని, కోర్టు పని చేస్తున్నపుడు లేదా తన విధులను నిర్వరిస్తున్నపుడు దానిపై అనవసర భారాన్ని మోపుతున్న వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వుండేలా వారి గురించి పట్టించుకోవాలని కూడా మేం న్యాయ వ్యవస్థను అడగాల్సి వస్తోంది.'' అని పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ సందేశం చాలా స్పష్టంగా వుంది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులను లేదా ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసే పిటిషన్లను సుప్రీం కోర్టు చేపట్టరాదు.
          మంత్రిగారు ఇచ్చిన ఈ అనవసరమైన సలహాకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఏ కేసూ కూడా న్యాయస్థానానికి చిన్నది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాల్లో మేం చర్యలు తీసుకుని, వారికి ఉపశమనం కలిగించకపోతే, ఇక మేం ఇక్కడ వుండి చేసేదేంటి? అని ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ హయాం నుండి ఇప్పటివరకు, సుదీర్ఘకాలం జైళ్లలో మగ్గిపోయిన వారి బెయిల్‌ పిటిషన్లపై, కిందిస్థాయి కోర్టులు తిరస్కరించిన బెయిల్‌ దరఖాస్తులపై సుప్రీం కోర్టు మరింతగా దృష్టి పెట్టిందని చెప్పారు. యు.యు.లలిత్‌ ప్రధాన న్యాయమూర్తిగా వున్న ఆ స్వల్ప కాలంలోనే తీస్తా సెత్వలాద్‌కు తాత్కాలిక బెయిల్‌ లభించింది. యుఎపిఎ కింద రెండేళ్ళపాటు జైల్లో వున్న సిద్ధిక్‌ కప్పన్‌కు బెయిల్‌ మంజూరైంది. తదనంతరం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) వ్యక్తం చేసిన తీవ్ర అభ్యంతరాలకు వ్యతిరేకంగా, గౌతమ్‌ నవలఖాను గృహ నిర్బంధంలో వుంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ముంబయి హైకోర్టు ఆనంద్‌ టెల్తుంబ్డేకు ఇచ్చిన బెయిల్‌ను ఎన్‌ఐఎ సవాలు చేయడాన్ని కూడా తోసిపుచ్చింది.
            వ్యక్తిగత స్వేచ్ఛను, పౌర హక్కులను కాపాడడంలో సుప్రీం కోర్టు రికార్డు ఇది. ఇది నిరంకుశ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
ఇప్పటికే సుప్రీం కోర్టులో కొంతమంది 'దయగల' న్యాయమూర్తులను నియమించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఇటీవల కాలంలో, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా (ఇప్పుడు రిటైరయ్యారు), జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలు బహిరంగంగానే ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడం మనం చూశాం. అయితే, 'నిబద్ధులైన' న్యాయమూర్తులతో అత్యున్నత న్యాయ వ్యవస్థను పూర్తిగా నింపివేయాలనే తన లక్ష్యాన్ని సాధించాలంటే... కొలీజియం వ్యవస్థ అనువైనది కాదని ప్రభుత్వం భావించింది. అందువల్ల, అత్యున్నత న్యాయ వ్యవస్థను పూర్తిగా స్వాధీనం చేసుకునే కుట్రలో భాగంగానే కొలీజియం వ్యవస్థపై ప్రస్తుత దాడిని చూడాల్సి వుంది. జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు మరో చట్టాన్ని చేయాల్సిన అవసరం వుందంటూ పాలక బిజెపి వర్గాలు మాట్లాడుతున్నాయి. దీని ద్వారా, ప్రభుత్వం తన ఆధిపత్యం వుండేలా నియామకాల వ్యవస్థను రూపొందించాలని భావిస్తోంది. అత్యున్నత న్యాయ వ్యవస్థ ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఇదొక కచ్చితమైన మార్గం కాగలదు. ప్రభుత్వం ఎంపిక చేసిన కమిషనర్ల నియామకంతో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి అధికారాలు లేని సంస్థగా మారిపోవడాన్ని ఒక హెచ్చరికగా చూడాలి.
న్యాయమూర్తుల ఎంపిక, నియామకానికి సంబంధించి స్పష్టంగా నిర్వచించిన నిబంధనలతో పారదర్శకమైన రీతిలో పనిచేసే విస్తృత ఆధారిత జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా వామపక్షాలతో సహా ప్రజాస్వామ్య వాదులందరూ కోరుతున్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం రెండింటి ప్రాతినిధ్యంతో కూడిన అటువంటి కమిషన్‌లో ప్రతిభావంతులైన న్యాయ నిపుణులు, ఇతర స్వతంత్ర సంఘాల ప్రతినిధులు వుండాలి. ప్రభుత్వానికి ఇక్కడ ఆధిపత్యం వుండరాదు.
           మోడీ ప్రభుత్వ హయాంలో 2014లో పార్లమెంట్‌ ఆమోదించిన జాతీయ జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ చట్టం లోపభూయిష్టంగా వుంది. ప్రభుత్వ నియంత్రణను అడ్డుకునేందుకు తగిన ఏర్పాట్లు లేవు.
          ప్రస్తుతం, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం పని చేస్తుండడంతో సందర్భం మారింది. కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ను తీసుకువచ్చే, అందులో ప్రభుత్వ ఆధిపత్యం వుండేలా చేసే ఏ ప్రయత్నాన్నైనా వ్యతిరేకించాల్సిందే. ఈలోగా, న్యాయమూర్తులుగా అభ్యర్ధులను ఎంపిక చేయడంలో పారదర్శకమైన, జవాబుదారీ వ్యవస్థ వుండేలా కొలీజియం వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం వుంది.

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)