Jul 28,2023 07:06

కుకీ మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష సంఘటన 2023 మే 4న జరిగితే, జులై 20న 78 రోజుల తర్వాత ఒకరిని అరెస్టు చేశారు. దేశ పరిపాలనా వ్యవస్థ పని తీరును ఇది ప్రతిఫలిస్తుంది. నిజానికి సీన్‌లో కనిపించేవారు దోషులే అయినా, వారిని ఉసిగొల్పిన పెద్దదోషులు వేరే ఉన్నారు. నోర్లు విప్పకుండా, నిర్లిప్తంగా ఘోరాలు జరగడానికి సహకరించిన రాష్ట్ర - కేంద్ర నాయకులే అసలు దోషులు! స్వతంత్ర భారతదేశంలో తొలిసారి జరిగిన ఈ సంఘటన, కేంద్ర, రాష్ట్ర నాయకత్వాన్ని అంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ని ప్రశ్నించింది.

బిజెపి పూర్తి మెజార్టీతో అధికారం చేపట్టినప్పటి నుండి దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య సంస్కృతిని ధ్వంసం చేస్తూ, హిందుత్వ సంస్కృతిని ప్రాచుర్యంలోకి తేవడంతో - దేశంలో మైనార్టీలకు భద్రత లేకుండా పోయింది. అంతే కాదు, అధికారంలో ఉన్నవారే అల్లర్లకు ఆజ్యం పోస్తున్నప్పుడు, మెజార్టీగా ఉన్న హిందువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. అల్లర్లు మొదలయ్యాయంటే, అవి ఎటునుండి ఏ మలుపు తీసుకుంటాయో తెలియదు. అల్లర్లలో చిక్కుకున్న వారు ఏ మతస్తులైనా కావొచ్చు కదా? కొన్ని నెలలుగా మణిపూర్‌ మండిపోతుంటే ఈ దేశ ప్రధాని ఒక చిన్న మాట మాట్లాడలేదు. ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌ ఏమన్నారో చూడండి... ''టర్కీ భూకంపానికి మన ప్రధాని స్పందించి ట్వీట్‌ చేస్తారు. గుజరాత్‌ తుపాన్‌ గురించి 'మన్‌కి బాత్‌'లో ప్రస్తావిస్తారు. కాని, మణిపూర్‌లో కొన్ని నెలలుగా జరుగుతున్న మారణకాండ గురించి ఎక్కడా ఏమీ స్పందించరు. అంటే ఈ దేశం ఏమి అర్థం చేసుకోవాలి? 1. ఆయనకు ఈ విషయం తెలియకపోవచ్చు. 2. విషయమంతా తెలిసినా, దాన్ని గుర్తించడానికి, వాటిపై స్పందించడానికి బాహుశా ఆయనకు ఆసక్తి లేకపోవచ్చు'' అని! మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న హింసకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపిస్తూ మిజోరమ్‌ బిజెపి ఉపాధ్యక్షుడు ఆర్‌. వన్‌రామ్‌ ఛూ ఆంగా తన పదవితో పాటు బిజెపి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇంఫాల్‌ను సందర్శించారు కానీ, రాష్ట్రంలో చర్చి భవనాలను తగులబెట్టడాన్ని ఆయన తప్పు పట్టలేదు. చర్చిలను తగలబెడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఖండించకపోవడం - భరించలేని బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు. పార్టీ ముఖ్యం కాదు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం ముఖ్యం! అనుకుని ఉంటారు, వన్‌రామ్‌ ఛూ ఆంగా.
         ఉత్తర భారతదేశం వరదల్లో కొట్టుకుపోతూ ఉంటే, ఢిల్లీ ఎర్రకోట చుట్టూ నీళ్ళు నిలిస్తే, గాంధీ సమాధి సైతం నీట మునిగితే - దగ్గరుండి కాపలాదారు చూస్కోవాలి కదా? దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి తరువాత ఇవ్వొచ్చు అనేది చూస్కోవాలి కదా? ఏదో అర్జంటు పని ఉన్నట్టు భారత ప్రధాని ఫ్రాన్స్‌కు వెళ్ళిపోతాడా? ఎక్కడికి వెళ్ళినా కొనుగోళ్ళకే కదా? అవి తరువాతైనా చేసుకోవచ్చు కదా? సరే ఇది అలా ఉండనిద్దాం! ఈ హిందుత్వ వాదులు ఏం కోరుకుంటున్నారూ? అంటే...భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలవారు సమానమే కానీ, అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులకు సమాజంలో అగ్రస్థానం దక్కాలి. వారే మొదటి స్థాయి పౌరులు. ఇక మిగతా వారంతా నోరెత్తకుండా రెండో స్థాయి పౌరులుగా పడి ఉండాలి. అంతే! ఆ కుట్రలో భాగంగానే, మిగతావారిని హిందువుల నుండి విడగొట్టి - చూపడానికే వారసత్వ చట్టాలు తెచ్చారు. దేశవ్యాప్తంగా వందల షహీన్‌బాగ్‌లు వెలిసి కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా నిరసించాయి. రైతు వ్యతిరేక చట్టాల్ని రైతులు తిప్పికొట్టిన విషయం కూడా మనం మరవకూడదు. ఎన్ని పరాభవాలు, పరాజయాలు ఎదురైనా మూర్ఖులు తమ పట్టుదలను వదలరు. అందుకు తాజా ఉదాహరణ యూనిఫాం సివిల్‌కోడ్‌. మతము - సంస్కృతి- దేశభక్తి అన్నింటినీ కలిపి దేశాన్ని 'హిందూ రాష్ట్ర'గా మార్చేయాలని ప్రభుత్వానికి వెనక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ పథకాలు రచిస్తోంది.
        అరవై ఏళ్ళుగా గత ప్రభుత్వం చేసిందీ? అని మోడీ తరచూ తన ప్రసంగాల్లో ప్రశ్నిస్తుంటారు. గత ప్రభుత్వాలు అరవైయేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ వస్తున్నాయని చెప్పడానికి మోడీజీయే ఒక పెద్ద ఉదాహరణ! ఒక రుజువు!! చదువుకోకపోయినా, రైల్వే స్టేషన్‌లో చారు అమ్ముకుని బతికినా, భిన్నమైన ఆలోచనా ధోరణి గలవాడైనా... ఈ దేశ ప్రజలు అతన్ని ప్రధానిని చేశారు కదా? ప్రజాస్వామ్యంటే అదే... గత పాలకులు నిరంకుశులైతే మోడీ ప్రధాని అయ్యేవాడే కాదు. ముందు ఆ విషయం గ్రహించుకుంటే బావుండేది. అయినా ఆ స్థానానికి ఉన్న విలువను కాపాడలేక, ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలు కావడం ఆయన తప్పిదం!! అధికారంలో ఉన్నవారు ఎప్పుడైనా తామేం చేస్తున్నామని ఆత్మావలోకనం చేసుకోవడం మంచిది. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలేదూ? అన్నది ప్రజలు బేరీజు వేసుకుంటారు. అది వారి పని-నాయకులు తమ బాధ్యతల్ని తాము నిర్వహించుకుంటూ ఉంటే, ఇతరులను ప్రశ్నించొచ్చు. ఢిల్లీ పార్లమెంట్‌ సమావేశాలు (జులై 2023) ఎగ్గొట్టి కేంద్ర సహాయమంత్రి వచ్చి హైదరాబాదులో రోడ్డుమీద భైఠాయిస్తాడు. తను వెంటనే బాటసింగారం డబుల్‌ బెడ్‌రూంలు చూడాలంటాడు. పార్లమెంట్‌ సమావేశాలు ఎగ్గొట్టి రావడం గొప్ప బాధ్యతగల పనా? ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో కనీస పరిజ్ఞానం కేంద్ర మంత్రులకే లేకపోతే ఎలా ?
      ఇది రాస్తున్న సమయానికి 2023 జులై 20న అన్ని టెలివిజన్‌ చానళ్ళలో ముగ్గురు మణిపూర్‌ కుకీ జాతి స్త్రీలను నగంగా వీధుల్లో నడిపించిన వీడియో కనిపించింది. కలవరపడ్డ దేశ ప్రజలు తల దించుకున్నారు. మతోన్మాదం నీడన జరిగిన రాజకీయాన్ని ఈసడించుకున్నారు. జాతీయ పతాకం అవనతమైనట్లయ్యింది. దేశం ప్రాభవం కోల్పోయింది. అంతకు ముందు రెండున్నర నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండకు ఈ పరేడ్‌ ఒక కొనసాగింపు. నగంగా నడిపించిన ఆ ముగ్గురు స్త్రీలలో ఒకరి భర్త సైనికుడు. దేశాన్ని రక్షించిన తను, తన భార్యను, తన గ్రామస్తుల్ని రక్షించుకోలేక పోయానని వాపోయాడు. భోరున విలపించాడు. ఆ ఏడుపు అతనొక్కడిదే కాదు, ఈ దేశంలో మనసున్న మనుషులందరిదీ... ఆ విషయాన్ని సుప్రీంకోర్టు వెంటనే సుమోటాగా స్వీకరించింది. మతాలవారీగా కులాలవారీగా ప్రజల్ని విభజించి, స్త్రీ శరీరాలను పావులుగా వాడుకునే దుష్ట రాజకీయాల్ని కేంద్ర ప్రభుత్వం అదుపులో పెట్టుకోలేకపో యింది. దేశ ప్రజల ముందు నిస్సిగ్గుగా బయటపడింది. 'ఇండియా'గా ఐక్యమైన విపక్షాలన్నీ మణిపూర్‌ వైఫల్యానికి దేశ ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. పార్లమెంటు సమావేశాల తొలి రోజునే మణిపూర్‌ మారణహోమం గురించి చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి.
           కుకీ మహిళల్ని నగంగా ఊరేగించిన అమానుష సంఘటన 2023 మే 4న జరిగితే, జులై 20న 78 రోజుల తర్వాత ఒకరిని అరెస్టు చేశారు. దేశ పరిపాలనా వ్యవస్థ పని తీరును ఇది ప్రతిఫలిస్తుంది. నిజానికి సీన్‌లో కనిపించేవారు దోషులే అయినా, వారిని ఉసిగొల్పిన పెద్దదోషులు వేరే ఉన్నారు. నోర్లు విప్పకుండా, నిర్లిప్తంగా ఘోరాలు జరగడానికి సహకరించిన రాష్ట్ర - కేంద్ర నాయకులే అసలు దోషులు! స్వతంత్ర భారతదేశంలో తొలిసారి జరిగిన ఈ సంఘటన, కేంద్ర, రాష్ట్ర నాయకత్వాన్ని అంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ని ప్రశ్నించింది. వారి మెదళ్ళ లోని అనాగరికతకు అద్దం పట్టింది. మణిపూర్‌ జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న మైతీ కులస్థులకు కుకీ, నాగ గిరిజన తెగలకూ మధ్య బిజెపి తన రాజకీయ లబ్ధి కోసం చిచ్చుపెట్టింది. గిరిజన చట్టాలను అతిక్రమించి మైతీలను గిరిజనులుగా మార్చడానికి బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. కుకీ, నాగ తెగలు ప్రతిఘటించాయి. ఈ గిరిజన తెగల వారు క్రిస్టియన్లు. అందువల్ల మతోన్మాదులు ప్రభుత్వాల అండతో వారి ఇళ్లు, చర్చిలు ధ్వంసం చేశారు. వందల మందిని చంపేశారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు. రెండున్నర నెలలుగా అక్కడ మారణహోమం జరుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అందరికందరూ మౌనం వహించారు. అదుపు చేయడానికి ప్రయత్నించలేదు. అంతా అయిపోయాక దేశ ప్రధాని విభ్రాంతిని వ్యక్తం చేశారు. తన ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చి, ఒక రాజకీయ ప్రకటన చేశారు. దాన్ని మించిన అవివేకపు ప్రకటన మరొకటి ఉండదని దేశ ప్రజలు ఉడికిపోయారు. నిజాయితీగల మనుషులైతే నాయకులంతా రాజీనామాలివ్వాలి. మోడీజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌ గాయమైంది. ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్‌ మండిపోయింది. ఎన్ని తప్పులు క్షమించినా, దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వం చేసిన ఈ రెండు తప్పుల్ని ఎప్పటికీ క్షమించరు. మణిపూర్‌లో మహిళల శరీరాలు రాజకీయ రణాలకు యుద్ధభూములయ్యాయి. అయినా అధికార పార్టీలో ఉన్న మహిళలు ఎవరూ గొంతెత్తలేదు. అన్యాయాన్ని నిరసించలేదు. మానవీయ విలువల్ని తొక్కిపెట్టే రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా? చివరిగా : తమలో నుంచి మానవత్వం, నిజాయితీగల నాయకుల్ని ఈ దేశ ప్రజల ఎప్పుడు తయారు చేసుకుంటారూ? ఈ చీకటి పాలనను ఎప్పుడు అంతం చేసుకుంటారూ ?

/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు