
పేకమేడల్లా కూలిపోతున్న భవనాలు, తెగిపడుతున్న శరీరభాగాలు, క్షిపణిదాడుల భీకర శబ్దాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలోదిక్కూ పారిపోతున్న పౌరులను ఇప్పుడు ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో చూస్తున్నాం. ఈ యుద్ధం మహిళలను, పిల్లలను ఎంతలా ప్రభావితం చేస్తుందో అనడానికి ఎన్నో ఉదాహరణలు చదువుతున్నాం. వైద్య సౌకర్యం అందుబాటులో లేక గర్భిణీలు పడుతున్న వెతలు తెలుసుకుని ఆందోళనచెందాం. ఇప్పుడు తాజాగా రుతుక్రమాన్ని తప్పించడం కోసం ప్రమాదమని తెలిసినా వాళ్లు అనుసరిస్తున్న మార్గాలు అక్కడి దయనీయ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.
యుద్ధ భయంతో 41 ఏళ్ల సల్మా రెండు వారాల క్రితం గాజా నగరంలోని బెల్ అల్ హవా పరిసరాల్లోని తన ఇంటి నుండి పారిపోయి సెంట్రల్ గాజాలోని డెయిర్ ఎల్‌బలాహ్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటోంది. తీవ్ర ఒత్తిడి, భయంతో ఆమె రుతుక్రమం గాడితప్పింది. 'ఈ యుద్ధంతో నేను అత్యంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. ఎప్పుడూ లేనిది ఈ నెలలో నాకు రెండు సార్లు రుతుక్రమం వచ్చింది. ఒత్తిడివల్ల అధిక రక్తస్రావమై ఎంతో బాధపడ్డాను. అయితే నన్ను అంతకంటే బాధించిన మరో విషయమేమంటే.. ఇక్కడ తాగడానికి నీరు లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రుతుక్రమంలో పాటించాల్సిన పరిశుభ్రతపై శ్రద్ద పెట్టలేకపోయాను. శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేవు. షాపులన్నీ మూసేసి ఉన్నాయి. వందలమంది వరకు తలదాచుకుంటున్న మేము, నీళ్లు రేషన్‌గా వాడుకుంటున్నాం. మరుగుదొడ్డి కూడా అంతే. వారంలో ఒకటి లేదా రెండుసార్లే స్నానం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక పీరియడ్ క్రమం తప్పించేందుకు పిల్స్ వేసుకోవాలని నిర్ణయించుకున్నాను' అంటూ ఎంతో బాధగా చెబుతోంది.
'ఇక్కడి ఫార్మాస్టిట్యువల్స్‌లో ఎక్కువమంది ఉపయోగించే శానిటరీ నాప్కిన్లు దొరక్కపోయినా రుతుక్రమం తప్పించే పిల్స్ మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. ఈ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ పిల్స్ వాడడం చాలా హానికరం. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించలేను' అంటూ సల్మా ఆందోళన చెందుతోంది.
'సాధారణంగానే పీరియడ్ సమయంలో మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురవుతారు. ప్రస్తుత పరిస్థితిలో వారు మరింత ఆందోళచెందుతున్నారు. ఈ ప్రభావం హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. నిద్రలేమి, భయం, విపరీతమైన ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రుతుక్రమం తప్పించే పిల్స్ వారి ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తాయి' అని గాజా సిటీలోని మానసిక వైద్య నిపుణురాలు, సామాజిక కార్యకర్త నివేని అద్నాన్ ఆందోళన చెందుతున్నారు.
సహజ హర్మోనుల మార్పుల వల్ల వచ్చే రుతుక్రమాన్ని తప్పించడమంటే అది తరువాతి నెలలో వచ్చే రుతుస్రావంపై ప్రభావం చూపుతుంది. వైద్యుల సలహా లేకుండా పిల్స్ ఉపయోగించకూడదు. వాటివల్ల అధిక రక్తస్రావం, విపరీతమైన నొప్పి, ఇంకా ఇతర బాధలు వేధిస్తాయి' అని అద్నాన్ అంటున్నారు.

నాకు మరో మార్గం లేదు..
గాజా వెస్ట్ ఆఫ్ ఖాన్ యౌన్నిస్ నుండి ఐక్యరాజ్యసమితి నిర్వహించే శిబిరంలో ఆశ్రయం పొందుతున్న సమీరా అల్ సాదీ తన 15 ఏళ్ల కూతురు గురించి తీవ్రంగా ఆందోళన చెందుతోంది. కొన్ని నెలల క్రితమే ఆ పాపకు మొదటి పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఇంత జనసందోహంలో, మృగ్యమైన సౌకర్యాల మధ్య రెండో పీరియడ్ వస్తే ఎలా అన్నది ఆ తల్లి ఆవేదన. 'శానిటరీ ప్యాడ్లు, శుభ్రం చేసుకునేందుకు నీళ్లు ఇక్కడ అందుబాటులో లేవు. అందుకే నేను నా కూతురుకు రుతుక్రమం తప్పించే పిల్స్ వేయాలనుకుంటున్నాను. అయితే అవి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయోమోనని భయపడుతున్నాను. నేను ఇలా ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకోలేని వయసు ఆమెది. కానీ నా చేతుల్లో ఇంతకంటే మరో మార్గం లేదు' అని ఆ తల్లి కన్నీటిపర్యంతమౌతోంది.
రుబా సైఫీ. తన కుటుంబంతో కలసి ఈ శిబిరంలోనే తలదాచుకుంటోంది. 'ఇక్కడ గోప్యత లేదు. మరుగుదొడ్లలో నీరు లేదు. మాకు ఏం కావాలో తెచ్చుకునేందుకు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. విపరీతమైన చలి, నిద్రలేమి, ఒళ్లంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో రుతుక్రమం వస్తే భరించలేను. అందుకే పిల్స్ వేసుకుందామనుకుంటున్నాను. ఎంతో కష్టపడి వాటిని సంపాదించాను. నా చుట్టూ ఉన్న వాళ్లల్లో చాలామంది వీటిని అడుగుతున్నారు. తన జీవితంలో అత్యంత బాధాకర రుతుక్రమాన్ని ఎదుర్కొన్నానని ఒకామె నాతో చెప్పింది. మన చుట్టూ పడుతున్న క్షిపణులు, మరణభయం, విధ్వంసం కంటే ఈ పిల్స్ ప్రమాదకరం కాదులే అని ఆమె సర్దిచెప్పుకుంటోంది' అని రుబా చెబుతున్నప్పుడు అక్కడి మహిళలు ఎంత తీవ్ర నిరాశనిస్పృహల్లో ఉన్నారో అర్థమౌతుంది.

యుద్ధం మొదలైన అక్టోబరు 7 నుండి గాజాలో 14 లక్షల మంది ఒక చోట నుండి మరోచోటకి స్థ్రానభ్రంశం చెందారు. అపరిశుభ్ర వాతావరణంలో ఇరుకైన ప్రదేశాల్లో గోప్యతకు స్థానం లేని చోట వారంతా తలదాచుకుంటున్నారు.
'ఈ యుద్ధం మా జీవితాలను అల్లకల్లోలం చేసింది. మా ప్రాణాలు, ఆరోగ్యంతో పాటు పిల్లల భద్రత, రక్షణ ప్రతి ఒక్కటీ మమ్మల్ని వేధిస్తోంది. ఈ యుద్ధం మా చేతుల్లో ఏమీ లేకుండా చేసింది' అని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న మహిళలంతా ముక్తకంఠంతో తమ బాధను, భయాలను పంచుకున్నారు. తగినంత ఆహారం, నీరు, దుస్తులు, నిత్యావసరాలు ఇలా రోజువారీ అవసరాల్లో సరిపడినన్ని నిరాశ్రయులకు అందడం లేదు. ఇక రుతుక్రమం, దాని పర్యవసనాలు, పిల్స్ వాడకం, వాటి దుష్ప్రభావాలు పట్టించుకునేవారు ఎవరు? ఈ విపరీత పరిస్థితుల నుండి వారు బయటపడాలంటే యుద్ధం ముగియడం ఒక్కటే మార్గం. ఆ దిశగా ప్రపంచదేశాలు ఏకమవ్వాలి. సంఘీభావాలు తెలపడం కంటే ముందు శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలి.