Nov 01,2022 10:20
  • నవ్యాంధ్ర ఏర్పడ్డాక నిరుడు కనిష్ట ఉత్పాదకత
  • ఈ ఏటా అదే దారి
  • భారీవర్షాలు, అనావృష్టే కారణం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ ఏడాది కూడా పత్తి దిగుబడి అంత ఆశాజనకంగా లేదు. సరిగ్గా పంట ఎదిగే సమయంలో భారీ వర్షాలు కురవడంతో పత్తికి నష్టం జరిగింది. చాలా చోట్ల మొదటి తీత పత్తి ఆగమైంది. అందుకు తోడు ఇటు భారీ వర్షాలు అటు వర్షాభావం వలన వేలాది ఎకరాల్లో గులాబీ వంటి తెగుళ్లు వ్యాపించి పంటను నాశనం చేశాయి. ఈ పరిస్థితుల రీత్యా గతేడాదికిమల్లే ఇప్పుడు సైతం పత్తి ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. బిటి రకాలొచ్చాక తమ విత్తనాలు వేస్తే ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి తీయొచ్చని సీడ్‌ కంపెనీలు ఊదరగొడుతున్నాయి. సగటున 10-12 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కంపెనీలు చెప్పినట్లు 20 క్వింటాళ్లు, శాస్త్రవేత్తల అభిప్రాయం మేరకు 12 క్వింటాళ్లు ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడలేదు. కాగా ఈ ఏట ఆరు క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని అర్థగణాంక శాఖ తన మొదటి ముందస్తు అంచనాలో పేర్కొంది. శాస్త్రవేత్తల సగటు గణాంకాల్లోనే సగానికి సగం తగ్గించింది.
 

                                                                         నిరుడు అతి తక్కువ

నిరుడు మొదటి ముందస్తు అంచనాలో ఎకరానికి 7.15 క్వింటాళ్లొస్తాయని తెలపగా, చివరికొచ్చింది 4.70 క్వింటాళ్లు మాత్రమే. ఇవి కూడా ప్రభుత్వ సగటు లెక్కలు. వాస్తవానికి చాలా చోట్ల రైతులకు రెండు మూడు క్వింటాళ్లు రావడం గగనమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంచనా వేసిన మేరకు 6 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా తగ్గేలా కనిపిస్తోంది. నిరుడు ఖరీఫ్‌లో వర్షాభావం, భారీ వర్షాల వలన పత్తి పంటకు అపార నష్టం వాటిల్లింది. రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు. నవ్యాంధ్ర ఏర్పడ్డాక అతి తక్కువ ఉత్పాదకత గతేడాది నమోదైంది. దిగుబడులు తగ్గడంతో చేతికొచ్చిన కొద్దిపాటి పంటకు గిరాకీ ఏర్పడి వెనకచిక్కి అమ్ముకున్న కొంత మంది రైతులకు, ముందుగానే కొని నిల్వ చేసుకున్న వ్యాపా రులకు ఆకర్షణీయమైన ధర వచ్చింది. దాంతో ఈ మారు ఖరీఫ్‌లో మెట్ట ప్రాంతాల్లోని రైతులు పత్తి తోవ పట్టారు.
 

                                                                          నార్మల్‌ను మించి సాగు

పత్తి పంట సాధారణ అంచనాలను మించి సాగైంది. గతంలో కొన్నేళ్లుగా సాగు చేస్తున్న ఏరియాల్లో నార్మల్‌ కంటే సాగు తగ్గగా, కడప, అనంతపురం వంటి ప్రాంతాలకు బాగా విస్తరించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నార్మల్‌ కంటే 9 శాతం ఎక్కువ సాగైంది. ఎపిలో వరి తర్వాత వేరుశనగ విస్తీర్ణం ఎక్కువ కాగా ఈ తడవ వేరుశనగకు సరిసమానంగా పత్తి సాగైంది. అనంతపురం వంటి చోట్ల వేరుశనగకు బదులు పత్తి వేశారు. ఈ సారి కర్నూలు, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశంలో నార్మల్‌ కంటే ఎక్కువ, గుంటూరు, పల్నాడు, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో కొంచెం తక్కువ సాగైంది.

11