
ఇతనో ఆకురాలిన చప్పుడు.. అవును నిజంగానే ఇతను కవి చెట్టు ఆకు. సత్కవి సోమేపల్లి వెంకటసుబ్బయ్య కుమారుడని డాక్టర్ పాపినేని శివశంకర్ ముందుమాటలో పేర్కొన్నది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కవి కొడుకు కవి కావాలని లేదు, గేమ్స్ మాస్టర్ కొడుకు స్పోర్ట్స్‌మెన్ కావాలని లేదు. కానీ కొన్నిసార్లు కవికి కవే పుట్టడం మంచి పరిణామమే. అందులోనూ సమాజ ఉనికిని పట్టుకునే కవి శ్రీ వశిష్ఠ సోమేపల్లి. అదే మనందరికీ మహద్భాగ్యం. 'ఎక్కడో ఆకురాలిన చప్పుడు వినిపిస్తుంది / ఇంకెక్కడో రెక్కలు ముడిచిన పావురం మాటలు వినిపిస్తాయి / మహానగరపు ఖాళీలేనితనం / గోల చేస్తూనే వుంటుంది.. గొంతు పెగలని ఆక్రందనలూ / పెదాలు దాటని ప్రశ్నలూ, సమాధానాలూ / పలుగై పొడుస్తుంటాయి' అనే టైటిల్ కవిత సాంద్రతే కవి లోపలి గుండె తడిని తెలియజేస్తోంది.
అతన్ని మీరు ఆహ్వానించాలేగానీ.. కవితగా.. స్థబ్ధతగా ఉన్న వారి తలపుల్లోకి తలుపులు తెరిచి మరీ వస్తాడు. తప్పక మీ గుండె తడిని తడిమి తీరతాడు. 'బతుకులు అందరివీ అయినప్పుడు / ప్రాణాలు మాత్రం కొందరివేనా?' అని ప్రశ్నించడం అంటే ఎంత లోతైన ఆలోచన ఉంటే సాధ్యం. 'బస్తాలు మోసిన చేతులు / ఎర్ర పూవులవ్వాల్సిన పని లేదు / పూవులైతే చాలు' అని 'పూవులైతే చాలు' కవితలో అనడం వెనుక కనీసం స్పందించే గుణమైనా కలిగి ఉండండి, నిస్తేజంగా ఉండిపోకుండా అని చెప్పడమే. 'దేశం కాలికి పుండు పడింది / నడిచీ నడిచీ పుండు పడింది / దేశం గదుల్లోనో, వూళ్ళలోనే ఇరుక్కుపోయిందంటున్నారు / అది పచ్చి అబద్ధం / దేశం ఇంకా గూటికోసం నడుస్తోంది / నెత్తిన తరాల బీదరికాన్నీ / చంకన మరో తరం ఆకలినీ మోసుకెళ్తోంది' అంటూ కరోనా వేళ వలస కార్మికులను దేశానికి ప్రతీకగా చూపించడం గొప్ప ఆలోచన కలిగి ఉండడమే. 'ఉన్న కన్నీళ్లకు తోడు / ఇప్పుడొక కొత్త దు:ఖం / మనుషుల్ని ప్రాంతాలుగా / ప్రాంతాల్ని కులాలుగా / రంగులు పూసిన చేతులు చేసిన దు:ఖం' అంటూ 'మరొక దు:ఖం' కవిత్వలో చెప్పడం కవి ఉన్న సమస్యలు తీర్చకపోగా, కొత్త సమస్యల్ని సృష్టిస్తున్న ఏలికల్ని ఎండగట్టడమే.
'కంచె తెగింది / వికసిస్తున్న సామ్యవాద సంకేతం కాదది / కొండల్లో అడవంచున.. / దూరంగా వున్న పోడు మనుషులను / కబళిస్తున్న పెట్టుబడి సామ్రాజ్యం' అంటూ 'కంచెలు దాటుకుంటూ..' కవితలో కవి ఎవరి పక్షమో చెప్పకనే చెప్తారు. అక్కడ కబళిస్తున్నది మనుషులననీ, అది పెట్టుబడి సామ్రాజ్యం చేస్తోందని సూటిగానే చెప్తాడు కవి. 'గోడ దూకడం నేరమంటారు / తలుపుల్లేని గోడలున్నప్పుడు, తలుపులన్నీ మూసి బలిసిన తాళాలైనప్పుడు / బరి దూకడం పేరు స్వేచ్ఛ' అంటూ 'తెగింపు' కవితలో నిర్భయంగా చెప్తాడు కవి.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కవితా సందేశాత్మకమే.. ఆలోచన రేకెత్తించేవే. ఇతనిలోని ఆకురాలిన చప్పుడు అందరూ వినాల్సిన అవసరం ఉంది. మీ అందరిలో చల్లగా దూరి, వెచ్చగా ఆలోచింపజేస్తాడు. అంతేనా రగిలిపోయేలానూ చేయగలడు. ఆకురాలిన చప్పుడు మాత్రమే కాదు.. అప్పుడు మీకు సమాజంలో జరగబోయే విస్ఫోటనాన్ని వినిపిస్తాడు. కొత్తతరంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని కూసింత గర్వంగానూ ఉంది. ఇలాంటి కవులే ఇప్పుడు కావాల్సింది.. రావాల్సింది.. కావాలంటే మీరూ వినండి ఆకురాలిన చప్పుడు.
- శాంతిశ్రీ
8333818985 ఆకురాలిన చప్పుడు
రచయిత : శ్రీవశిష్ఠ సోమేపల్లి
పేజీలు : 130
వెల : 120/-
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం