సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించడానికి, పోరాడటానికి, ఓడించడానికి ఇదే తరుణం : ఆర్. అరుణ్ కుమార్
అమెరికా సామ్రాజ్యవాదం ఒక్క క్యూబా సమస్య మాత్రమే కాదు. ఇది మొత్తం మానవాళి సమస్య. అమెరికా విధానాలు ఒక్క క్యూబాకే కాదు, యావత్ మానవాళి మనుగడకే ముప్పు. 1966లో ఫైడెల్ క్యాస్ట్రో చేసిన ఒక ప్రసంగంలో ఇలా పేర్కొన్నారు. ''ఇది క్యూబన్లకే కాదు, యావత్ మానవాళి ఎదుర్కొంటున్న సమస్య. ఈ విశ్వంలో మేమూ ఒక భాగం. మనకు ఎదురైన పరిస్థితినే ప్రపంచమూ ఎదుర్కొంటోంది. మన విజయం ప్రపంచ విజయం అని మనం ఎప్పటికీ మరచిపోరాదు. సామ్రాజ్యవాదంపై మనం సాధించిన విజయం ప్రపంచ విజయం. అంతేగాక, ఆ ప్రపంచం యొక్క ఓటమి మన ఓటమి...మన బానిసత్వం అవుతుంది'' !
బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిస్ ఇనాసియో లూలా డ సిల్వా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల వ్యవధిలోనే, ఎన్నికల్లో ఓడిపోయిన జైర్ బోల్సనారో మద్దతుదారులు బ్రెజిల్ లోని మూడు ప్రభుత్వ విభాగాలపై దాడి చేశారు. రాజధాని నగరం బ్రసీలియా లోని శాసన, న్యాయ, కార్యనిర్వాహక భవనాలను వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన లూలా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న వారి ప్రయత్నాన్ని ఫెడరల్ ప్రభుత్వం మొగ్గలోనే తుంచివేసింది.
జనవరి6, 2021న అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన ప్రయత్నం లాంటిదే బ్రెజిల్‌లోనూ జరిగింది. బోల్సనారో, ట్రంప్ ఇద్దరూ ఆయా దేశాల అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరించడానికి నిరాకరించారు. అంతేగాక, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేందుకు తమ మితవాద మద్దతుదారులను ప్రోత్సహించారు. విధ్వంసాన్ని లూలా తీవ్రంగా ఖండించారు. బ్రసీలియాకు వెళ్లిన విధ్వంసకారులకు డబ్బులిచ్చి ఎగదోసిన వారు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం. వారు చట్టపరంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది' అన్నారు. అంతేగాక నరహంతకుడు బోల్సనారో తను ఆశ్రయం పొందిన ఫ్లోరిడా లోని మియామి నుండి సోషల్ మీడియా ద్వారా ఈ విధ్వంసాన్ని ఎగదోస్తున్నాడని లూలా పేర్కొన్నారు.
సరైన విచారణ జరిగి, లూలా చెప్పినట్లుగా, విధ్వంసకారులకు ఆర్థిక సాయం చేసినవారిని గుర్తించినట్లయితే, అది ఖచ్చితంగా చాలా విషయాలను స్పష్టం చేస్తుంది. ప్రధానంగా మితవాద శక్తులకు సామ్రాజ్యవాదానికి మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. బ్రెజిల్‌లో జరిగిన కుట్ర వెనుక సిఐఎ, అమెరికా, దాని మానస పుత్రుల హస్తం ఉందని తేలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి, లాటిన్ అమెరికాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వామపక్ష, ప్రగతిశీల ప్రభుత్వాలను అస్థిరపరిచే అన్ని కుతంత్రాల వెనుక అమెరికా ప్రమేయముందన్నది తెలిసిన విషయమే.
లాటిన్ అమెరికాలో తన రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా సహాయ కార్యక్రమాలను చేపడుతుంటుంది. వికీలీక్స్ ప్రచురించిన అనేక ప్రభుత్వ రికార్డులలో చూపినట్లుగా... మితవాద మిత్రపక్షాలు తిరిగి ఎన్నికయ్యేలా అమెరికన్ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను చేపట్టింది. వివిధ దేశాల్లోని ఎన్‌జివో లకు అమెరికా నిధులు సమకూరుస్తుంది. తను ఎంపిక చేసుకున్న అభ్యర్థిని ఎన్నుకోవడంలో విఫలమైనట్లయితే, అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంది. దీని కోసమే అమెరికా 1983లో 'నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ' (ఎన్‌ఇడి) అనే సంస్థను సృష్టించింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్ ఎయిడ్)తో పాటుగా అమెరికా ప్రభుత్వ జోక్యందారీ విధానాలకు ఆర్థిక విభాగంగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ముసుగు తగిలించుకున్న ఈ రెండు ఎన్జీవోలు...వాస్తవానికి అమెరికా ప్రయోజనాలకు లొంగని ప్రభుత్వాలను అస్థిరపరచడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తుంటాయి.
పాతిక సంవత్సరాల క్రితం సిఐఎ చేసినవే తాము చేస్తున్నామని...ఎన్‌ఇడి స్థాపకుడు అలాన్ వీన్‌స్టెయిన్ 'ది వాషింగ్టన్ పోస్ట్' (1991)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా చెప్పాడు. కాబట్టి ఎన్‌ఇడిని ప్రపంచవ్యాప్తంగా 'రెండవ సిఐఎ' అని పిలుస్తారు. 2020లో ఎన్‌ఇడి తన సొంత వెబ్‌సైట్‌లో వివరించినట్లుగా...అత్యంత నిరంకుశ పాలక దేశాలుగా అది భావించే క్యూబా, నికరాగువా, వెనిజులాలో 'ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి'...సంస్థ 'సాయం' చేస్తుంటుంది.
అస్థిరపరిచే చర్యలు
గత సంవత్సరం లాటిన్ అమెరికాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అనేక ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు అమెరికా జోక్యం చేసుకోవడాన్ని మనం చూశాం. అర్జెంటీనాలో మితవాద మాక్రి స్థానంలో అల్బెర్టో ఫెర్నాండెజ్ నేతృత్వంలో ప్రజానుకూల ప్రభుత్వం ఏర్పడినప్పుడు...వారు మొదట ఉపాధ్యక్షురాలు క్రిస్టినా కిర్చెనర్‌పై హత్యాయత్నం చేశారు. అది విఫలం కావడంతో...గుత్తాధిపత్య మీడియా, ధనస్వాముల వైపు మొగ్గు చూపే న్యాయ వ్యవస్థ లోని ఒక విభాగం స్పాన్సర్ చేసిన మితవాదులు...ఆమెను జైలులో పెట్టడానికి, ప్రభుత్వ పదవిలో కొనసాగేందుకు ఆమెకు గల హక్కును హరించడానికి అబద్ధాలను వండి వార్చారు. ప్రజానుకూల పాలనను అస్థిరపరిచేందుకు యుఎస్‌ఎయిడ్, ఇతర అనేక అమెరికన్ సంస్థలు ఆ దేశంలో చురుకుగా పాల్గొంటున్నాయి.
అదే సమయంలో పెరూ అధ్యక్షుడిగా ప్రజలెన్నుకున్న వామపక్ష ఉపాధ్యాయుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు పెడ్రో కేస్టిల్లోను పదవి నుంచి తప్పించారు. కాస్టిల్లోపై అవినీతి ఆరోపణలు చేసిన ముగ్గురు న్యాయమూర్తులు ఎటువంటి సాక్ష్యాలు లేకుండానే తమ తీర్పు ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించారు. కేస్టిల్లోని జైలు పాల్జేసి మితవాదులు అధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు కాస్టిల్లోకి తిరిగి పాలనా పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న ప్రజా నిరసనలను క్రూరంగా అణిచివేశారు.
ఈ సంఘటనలకు ముందు బొలీవియాలో ఎన్‌ఇడి తిరుగుబాటును ప్రేరేపించింది. దాంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్ రాజీనామా చేసి ప్రవాసంలోకి వెళ్ళవలసి వచ్చింది. 2013-2018 మధ్య ప్రతిపక్ష పార్టీలకు, మితవాద రాజకీయ ప్రముఖులకు, మొరేల్స్ వ్యతిరేకులకు ఎన్‌ఇడి, యుఎస్‌ఎయిడ్ ఏడు కోట్ల అమెరికన్ డాలర్లను అందించాయి.
ఈక్వెడార్‌లో గొప్ప ప్రజాదరణ పొందిన మాజీ అధ్యక్షుడు రఫెల్ కొరియా ప్రగతిశీల కూటమిని తుడిచిపెట్టడానికి వేట కొనసాగుతోంది. ఆయన దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ గ్లాస్ అరెస్టయ్యాడు.
మాజీ ఫ్రెంచ్ రాయబారి ప్రకారం అమెరికా, ఫ్రాన్స్ రెండూ హైతీలో తిరుగుబాటును ''సమర్థవంతంగా నిర్వహించాయి''. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు జీన్-బెర్ట్రాండ్ అరిస్టైడ్‌ను తొలగించడానికి...2001 ఫిబ్రవరిలో హైతీకి చెందిన ఐఆర్‌ఐ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ స్టాన్లీ లూకాస్...స్థానిక రేడియో కార్యక్రమంలో మూడు మార్గాలను బహిరంగంగా ముందుకు తెచ్చారు. 'ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికే అని చెప్పినా, విధ్వంసక కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ఐఆర్‌ఐ చురుగ్గా పాల్గొంటున్నది.
ఎన్‌ఇడి 1983లో ఉనికి లోకి వచ్చిన వెంటనే చేసిన ఘనకార్యాలలో ఒకటి నికరాగువాలో అమెరికా అనుకూల రాజకీయ శక్తులకు మద్దతు ఇవ్వడం. ఎన్‌ఇడి ఇప్పటికీ నికరాగువా లోని ప్రతిపక్షాలు, మితవాద మీడియా సంస్థలకు నిధులు అందజేస్తూనే వుంది. పబ్లిక్ రికార్డుల ప్రకారం, 2016-2019 మధ్య మీడియా సంస్థలతో సహా నికరాగువా వ్యతిరేక సమూహాలకు ఎన్‌ఇడి కనీసం 4.4 మిలియన్ అమెరికా డాలర్లను అందించింది. 2018లో నికరాగువాలో తిరుగుబాటుకు జరిగిన యత్నంలో ఈ శక్తులు కీలక పాత్ర పోషించాయి.
అదేవిధంగా, వెనిజులాలో మదురో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎన్‌ఇడి కోట్ల డాలర్లను తగలేస్తోంది. మదురో స్థానంలో ప్రతిపక్ష నాయకుడు జువాన్ గైడోను 'వెనిజులా అధ్యక్షుడి' గా అమెరికా ప్రకటించడాన్ని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద పని చేసిన జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్టన్ చెప్పారు. సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2018లో వెనిజులాలో తిరుగుబాటుకు జరిగిన కుట్రలో అమెరికా పాత్ర గురించి సూటిగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, మదురోను గైడో స్థానంలో అధ్యక్షునిగా పెట్టేందుకు తాము ప్రయత్నించామని చెప్పారు.
ఈ ప్రాంతంలో అమెరికా ప్రధాన లక్ష్యం క్యూబా. చాలా కాలంగా అమెరికా చొరబాట్లు, విధ్వంసక చర్యల కారణంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. క్యూబాను లక్ష్యంగా చేసుకున్న కార్యక్రమాలకు ఎన్‌ఇడి, యుఎస్‌ఎయిడ్ గత 20 సంవత్సరాలుగా దాదాపు 25 కోట్ల అమెరికన్ డాలర్లను వెచ్చించాయి. ఎన్‌ఇడి వెబ్‌సైట్ ప్రకారం ఇది 2020 ఒక్క ఏడాదిలోనే 42 క్యూబా వ్యతిరేక కార్యక్రమాలకు నిధులు సమకూర్చింది. 2021లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను ప్రేరేపించడానికి, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని రూపొందించడానికి, వ్యాపింపజేయడానికి క్యూబా వ్యతిరేక శక్తులకు ఎన్‌ఇడి నిధులు అందించింది.
ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నియంత్రణ, వాణిజ్య విధానం, సహాయ కార్యక్రమాల ద్వారా వివిధ దేశాల ఆర్థిక రాజకీయ పథాలను ప్రభావితం చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇవన్నీ తన విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించడానికే అమలు చేయబడ్డాయి.
క్యూబాపై దురాక్రమణపూరిత దాడి
క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం దురాక్రమణకు పాల్పడుతోంది. క్యూబాపై చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా అమెరికా అమలు చేసే నేరపూరిత ఆర్థిక దిగ్బంధనాన్ని అందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అమెరికా 1962 నుండి క్యూబాపై దాదాపు పూర్తి నిషేధాన్ని కొనసాగిస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ ద్వారా అంతర్జాతీయ సమాజం ఈ దిగ్బంధనాన్ని 29 సార్లు ఖండించింది. అమెరికా విధించిన ఈ ఆర్థిక దిగ్బంధనం వల్ల క్యూబాకు 15,421 కోట్ల డాలర్లు (ప్రస్తుత రేట్ల ప్రకారం) నష్టం వాటిల్లింది. లక్షా 39,111 కోట్ల విలువైన బంగారం విదేశీ బ్యాంకుల్లో చిక్కుకుపోయింది. క్యూబా ప్రజలను తీవ్ర ఇక్కట్లపాల్జేసి, గందరగోళ పరిచి, ప్రభుత్వ మార్పునుకు వారిని ప్రేరేపించాలన్న దుష్ట పన్నాగంలో భాగంగానే అమెరికా ఈ ఆంక్షలను విధించింది.
సరి కొత్త ఆంక్షలతో దిగ్బంధనాన్ని మరింత కఠినతరం చేయడానికి అమెరికా ప్రభుత్వం (ట్రంప్, బైడెన్ హయాంలో) కోవిడ్ కాలంలో (2020, 2021) ప్రయత్నించింది. మందులు, శ్వాస సంబంధ పరికరాలు, ఇంధనం, ఇతర ఆర్థిక వనరుల దిగుమతిని అడ్డుకుంది. ప్రాణ రక్షక ఔషధాలు, వైద్య పరికరాల దిగుమతులను నిరోధించడంతో క్యూబా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. క్యూబా తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్లు 90 శాతం పైగా ప్రభావవంతంగా పని చేస్తున్నాయని నిరూపితమైనప్పటికీ డబ్ల్యుహెచ్‌ఒ వాటిని గుర్తించకుండా మరోసారి తిరస్కరించింది. దిగ్బంధనం వల్ల ఉత్పత్తులు, ఆహారం, సేవల ద్రవ్యోల్బణంతో క్యూబా ఇబ్బందులు పడుతోంది. విద్యుత్ సరఫరా సమస్యలు ఏర్పడుతున్నాయి. వలసలు పెరుగుతున్నాయి.
జాతీయ విముక్తి ఉద్యమాలకు తన మద్దతు, సహాయాన్ని అందించడం, వారి ప్రసిద్ధ విద్యాసంస్థల్లో నిపుణులకు శిక్షణ ఇవ్వడం, వైద్య సిబ్బందిని పంపడం, అత్యంత ప్రభావవంతమైన కోవిడ్-19 వ్యాక్సిన్లతో పాటు మందులను ఎగుమతి చేయడం ద్వారా క్యూబా వీరోచిత పాత్రను పోషిస్తోంది. బలమైన సామ్రాజ్యవాద దేశానికి కూత వేటు దూరంలో ఉన్న చిన్న దేశం నుండి ఊహించిన దానికంటే ప్రపంచంలో క్యూబా పాత్ర వెయ్యి రెట్లు ఎక్కువగా వుంది. అందువల్ల క్యూబా అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటనా చిహ్నంగా ఉంది.
అమెరికా సామ్రాజ్యవాదం ఒక్క క్యూబా సమస్య మాత్రమే కాదు. ఇది మొత్తం మానవాళి సమస్య. అమెరికా విధానాలు ఒక్క క్యూబాకే కాదు, యావత్ మానవాళి మనుగడకే ముప్పు. 1966లో ఫైడెల్ క్యాస్ట్రో చేసిన ఒక ప్రసంగంలో ఇలా పేర్కొన్నారు. ''ఇది క్యూబన్లకే కాదు, యావత్ మానవాళి ఎదుర్కొంటున్న సమస్య. ఈ విశ్వంలో మేమూ ఒక భాగం. మనకు ఎదురైన పరిస్థితినే ప్రపంచమూ ఎదుర్కొంటోంది. మన విజయం ప్రపంచ విజయం అని మనం ఎప్పటికీ మరచిపోరాదు. సామ్రాజ్యవాదంపై మనం సాధించిన విజయం ప్రపంచ విజయం. అంతేగాక, ఆ ప్రపంచం యొక్క ఓటమి మన ఓటమి...మన బానిసత్వం అవుతుంది'' !
క్యూబన్లు ఈ ఆలోచనలను పూర్తిగా ఇంకించుకున్నారు. మనం కూడా అదేవిధంగా ఇంకించుకోవాలి. మన భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తుతో బాగా పెనవేసుకుని ఉన్నందున ఇది అత్యంతావశ్యకం. మితవాద శక్తులకు వ్యతిరేకంగా మన పోరాటం...మితవాద దాడితో పోరాడుతున్న అన్ని శక్తులను బలోపేతం చేసేందుకు తోడ్పడుతుంది. మితవాద శక్తులను ఓడిస్తే అది ప్రగతిశీల శక్తులను బలోపేతం చేయడమే కాదు, సామ్రాజ్యవాదాన్ని బలహీనపరచడానికి కూడా తోడ్పడుతుంది. సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘీభావం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన పోరాటంలో ఒక భాగం. పైగా ఇది మనకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవగాహనతోనే మితవాద దాడికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంతో జోడించాలి.
/ వ్యాసకర్త : సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు / : ఆర్. అరుణ్ కుమార్










