మన గురించో, మన వారి గురించో ఎవరైనా లేని పోనివి కల్పించి తప్పుగా మాట్లాడితే మనకు చాలా కోపం వచ్చేస్తుంది. వారితో వాదిస్తాం. వారి మాటలను ఖండిస్తాం.. మన గురించి, మన వారి గురించి నిజాలేమిటో గొప్పగా చెబుతాం. సరిగ్గా ఇలాగే ఆలోచించాడు కేరళవాసి సాను కుమ్మిల్. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తెరకెక్కించిన 'ది కేరళ స్టోరీ' చిత్రంలో రెండు మతాలకు చెందిన మనుషుల స్వార్థప్రయోజనాలను చూపించడం అతను తట్టుకోలేకపోయాడు. జర్నలిస్టుగా విధులు నిర్వరిస్తున్న సాను అప్పుడప్పుడూ తన అభిరుచి ప్రకారం చిన్న చిన్న డాక్యుమెంటరీలు రూపొందించేవాడు. ఈసారి తను ఎంతగానో అభిమానించే తన రాష్ట్రం గురించి, ప్రజల మానవత్వ హృదయాల గురించి, అక్కడ నెలకొన్న మతసామరస్యం గురించి చూపించాలనుకున్నాడు. కేరళ వ్యాప్తంగా పర్యటించిన అతడి అనుభవం కేరళ ప్రత్యేకతకు నిలువుటద్దం.

'మలప్పురమ్ కారుపట్టాలో నివసిస్తున్న జలాల్‌ను నేను మొట్టమొదట కలిశాను. 'మరణించడం ప్రతి జీవికి సర్వసాధారణం. నా దృష్టిలో మానవులు కూడా జీవులే.. మతం పేరుతో వారిని వేరుగా ఎందుకు చూడాలి?' అంటూ తన సొంత భూమిలో 19 మంది పేద హిందువుల మృతదేహాల ఖననానికి అనుమతి ఇచ్చిన జలాలుద్దీన్‌లో నాకు గొప్ప మానవతామూర్తి కనిపించాడు. అంతేకాదు, ఆ భూమిలో ఓ మూల హిందువుల దేవాలయం నిర్మించుకునేందుకు కూడా జలాల్ అనుమతి ఇచ్చాడు. 'ఈ భూమి ఓ ముస్లింది అయినంత మాత్రాన దేవాలయంలో దీపం వెలగకుండా ఉండదు కదా.. ఒక వేళ దీపం వెలగకుండా ఉంటే ఆ భూమి మీకు ఇచ్చేస్తా..'నని తన పని నచ్చక విమర్శించిన వ్యక్తులతో అన్నట్లు 79 ఏళ్ల జలాల్ నాతో చెప్పాడు. ఈ అనుభవమే నా డాక్యుమెంటరీ లో ఓ సన్నివేశంగా తెరకెక్కించాను.
'జలాల్ భారు దగ్గర ఎదురైన అనుభవంతో రెట్టింపు ఉత్సాహంతో ఈసారి మలప్పురమ్ నుండి త్రిసూర్‌కు ప్రయాణం కొనసాగించాను. అక్కడ ఓ ముస్లిం పాఠశాలలో సంస్కృత పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడిని చూశాను. ఆ స్కూలు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ ఇబ్రహీం ఈ విషయంపై మాట్లాడుతూ 'విద్యార్థులు ఇతర మతాల గురించి తెలుసుకోవడం వల్ల అన్ని సంస్కృతులు వారికి పరిచయమవు తాయి. మతాలన్నీ మానవత్వం గురించే చెప్పాయి' అంటున్న వీడియో కూడా నా డాక్యుమెంటరీలో కనిపిస్తుంది. ఆ తరువాత నుదిటిపై విభూదిరేఖలతో హిందుత్వం ఉట్టిపడుతున్న యతేంద్రన్ మాస్టారు, ఎదురుగా తెల్లటి టోపీలు ధరించిన ముస్లిం యువకులకు పాఠాలు చెప్పడం చూశాను. ఆ క్లాసు రూంలో నల్లబోర్డుపై సంస్కృతంలో రాసిన అండర్‌లైన్ చేసిన 'మనుష్యత్వం'(తెలుగులో మానవత్వం) మాటను కూడా నా డాక్యుమెంటరీలో చూపించానని సాను చెప్పారు.
ఈసారి సాను కెమెరా మట్టన్‌చెర్రి వైపు తిరిగింది. అక్కడ యూదు సంతతికి చెందిన కోహెన్ దంపతులు ఓ ముస్లిం అబ్బాయిని చేరదీసిన వైనం చూపించాడు. భిన్న మతానికి చెందిన పిల్లవాడిని కోహెన్ దంపతులు సాకిన వైనం ఆ చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటనలు కూడా అందులో వివరిస్తాడు. రెండు మతాలకు చెందిన వ్యక్తులు ఇంతటి ప్రేమానురాగాలతో మెలగడం అసాధ్యమని వాదిస్తున్న చాలామందికి ఈ ఉదంతం గొప్ప కనువిప్పుగా చూపించాడు సాను. ఆ యూదు కుటుంబం సాకిన ముస్లిం పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఆ కుటుంబ వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని నిర్వహించడం కూడా డాక్యుమెంటరీలో చూడవచ్చు. కోహెన్ భార్య చావుబతుకుల్లో ఉన్నప్పుడు ఆ ముస్లిం యువకుడు ఎంతటి ప్రేమను కనబరిచాడో.. ఆమె చివరి యాత్ర వరకు తన చేయిని విడవకుండా పక్కనే ఎలా నిలబడ్డాడో నాలుగేళ్ల క్రితం మరణించిన తన భార్యను గుర్తు చేసుకుంటూ కోహెన్ చెబుతున్నప్పుడు రెండు మానవత్వ హృదయాలను మనకు చాలా దగ్గరగా పరిచయం చేస్తాడు సాను.
'ఆ తరువాత నా ప్రయాణం ఎర్నాకులం నుండి పెరియర్ నది వైపు సాగింది. అక్కడ 76 ఏళ్ల భారతీయమ్మ ఓ మసీదు సంరక్షణ బాధ్యతల్లో తలమునకలై ఉంది. 20 ఏళ్లుగా మసీదు నిర్వహిస్తున్న ఆమె 'దీనికి కులం, మతంతో సంబంధం లేదు. నేను వేరే మతానికి చెందిన దాన్ని. అయినా ఈ మతాన్ని కూడా గౌరవిస్తాను. ఎటువంటి అభ్యంతరం లేకుండా నాకు మసీదు నిర్వాహకులు ఈ బాధ్యత అప్పగించారు. నడవగలిగే ఓపిక ఉన్నంత వరకు నేను మసీదుకు వస్తాను' అంటూ ఆమె చెప్పిన విషయాన్ని మతసామరస్యానికి ప్రతీకగా చూపించాడు.

''ఇన్ని దృశ్యాల మధ్య పాలోడ్‌లో 'ఎలవపాలెం దగ్గర ఒక వంపులో మూడు మతాలకు చెందిన గుర్తులను చూశాను. ఎడమ వైపు దారుల్ ఇస్లాం జుమా మసీదు, కుడి వైపు కల్లుమల తంబురాన్ దేవి దేవాలయం, మధ్యలో క్రైస్తవ చిహ్నం కనిపించింది. భిన్న మతాలకు చెందిన వారంతా ఆ ప్రాంతంలో ఎప్పటినుండో మతసామరస్యంతో జీవిస్తున్నారు. వారి జీవనానికి గుర్తుగా ఆ ప్రాంతంలో ఆ వంపుతో ఉన్న బోర్డు కనిపిస్తోంది' అంటూ చెబుతూనే మరో మానవత్వ హృదయాన్ని మనకు పరిచయం చేస్తాడు. భిన్న మతానికి చెందిన ప్రియాంక నంద, స్థానిక సిపిఐ(ఎం) నాయకుడు రాజాలాల్‌కు కాలేయం దానం చేయడానికి ముందుకు వచ్చిన వైనాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించాడు. అలాగే కోవిడ్ 19 కాలంలో ఎక్కడి వారక్కడ ఇళ్లకే పరిమితమైన వేళ కేరళలో ఎంతోమంది మతాలకు సంబంధం లేకుండా తమ సొంతభూముల్లో కోవిడ్ మృతదేహాల ఖననానికి అనుమతులిచ్చిన వైనం వివరించాడు.
'ఇదీ నా కేరళ స్టోరీ.. ఎవరూ చెప్పనిదీ... 'అన్‌టోల్డ్ కేరళ స్టోరీ' అంటూ కేరళలో వెల్లివిరిసిన మానవత్వాన్ని, మతసామరస్యాన్ని మన కళ్లముందుంచిన సాను లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.










