Feb 17,2023 07:41

గుజరాత్‌ మారణకాండ గురించి డాక్యుమెంటరీ నిర్మించిన బిబిసి మీద ఉక్రోషంతో దాని కార్యాలయాల మీద జరిపించిన దాడుల గురించి చూసిన తరువాత మన దేశంలో భిన్న గళాలను అణచివేసేందుకే కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని మరోసారి స్పష్టమైంది. జర్నలిస్టులను బెదిరించటమే కాదు, వారికి ప్రాణహాని కూడా ప్రపంచమంతటా ఉన్నదని చెబుతున్న నివేదికలు మన దేశంలోని ప్రజాస్వామ్యవాదులకు ఒక హెచ్చరిక కావాలి.

          అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2020 ఆగస్టులో ప్రచురించిన వార్త ఒక రాజకీయ తుపాన్‌ రేపింది. ఫేస్‌బుక్‌లో విద్వేష ప్రచారం చేసే బిజెపి నేతల పోస్టులను తొలగించకుండా సదరు సంస్థ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా ఉన్న అంఖీ దాస్‌ చూశారన్నది దాని సారం కాగా, ఆమె బిజెపికి ఎంత వీర విధేయురాలో సాక్ష్యాలతో సహా వెల్లడించింది. ''మనం అతని (నరేంద్ర మోడీ) సామాజిక మాధ్యమ మంట రగిల్చాం. తరువాత చరిత్ర మీకు తెలిసిందే. ఎట్టకేలకు భారత ప్రభుత్వ సోషలిజాన్ని వదిలించుకొనేందుకు గాను దిగువ స్థాయి నుంచి చేసిన పనికి ముప్పౖౖె ఏళ్లు పట్టింది'' అంటూ ఆమె 2014లో గెలిచిన సందర్భంగా మోడీని పొగడటం, కాంగ్రెస్‌ ఓడిపోవటం గురించి రాసిన రాతలను ఆ పత్రిక వెల్లడించింది. భారత జార్జి బుష్‌గా నరేంద్ర మోడీని ఆమె వర్ణించారు. 2012 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి సామాజిక మాధ్యమ విభాగానికి ఆమె ఇచ్చిన శిక్షణ గురించి కూడా పేర్కొన్నది. ఇదంతా ఎందుకు గుర్తుచేయాల్సి వచ్చిందంటే ఇజ్రాయిల్‌కు చెందిన ''టీమ్‌ జార్జి'' పేరుతో టాల్‌ హనాన్‌ బృందం 33 దేశాలలో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తప్పుడు ప్రచారం గురించి ఒక అంతర్జాతీయ జర్నలిస్టుల బృందం పరిశోధించి వెలుగులోకి తెచ్చిన అంశాలను బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక తాజాగా వెల్లడించింది. అంతే కాదు! న్యూయార్క్‌ నగరం కేంద్రంగా ఐరాస-యునెస్కో నిధులతో పని చేస్తున్న జర్నలిస్టుల అంతర్జాతీయ కేంద్రం (ఐసిఎఫ్‌జె) నివేదిక కూడా వెల్లడైంది. దానిలో భారత్‌కు చెందిన మహిళా జర్నలిస్టులు రాణా ఆయూబ్‌ను వేధించుతున్న, గౌరీ లంకేష్‌ ప్రాణాలను బలిగొన్న బిజెపి అనుబంధ బృందాల గురించి వెల్లడించారు.
        ఈ రెండు నివేదికల్లోని అంశాలు ప్రజాస్వామ్యవాదులకు, నిబద్దత కలిగిన జర్నలిజం వృత్తిగా ఉన్నవారికి ఆందోళన కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తిష్టవేసిన కాషాయ దళాలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తున్నాయో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. పత్రికలు, టీవీలు మినహాయింపు కాదు. విద్వేష ప్రచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్లలో ప్రచారం చేయటం ఒకటైతే పత్రికల్లో రాతలు, టీవీల్లో చర్చల పేరుతో రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవటం మరొకటి. టీమ్‌ జార్జి వంటి సంఘటిత బృందాలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఊరూపేరు లేని వాటి ఉత్పత్తులు నిరంతరం వాట్సాప్‌ల్లో మనం కోరకుండానే వచ్చి పడుతుంటాయి. ఇవి రక్తం చిందకుండానే ప్రాణా లు తీసే ఆయుధాలంటే అతిశయోక్తి కాదు. ఊరూ పేరు లేకుండా, లేదా అపహరించిన ఫొటోలతో వారికి తెలియకుండానే ఖాతాలు తెరిచి తమ ఎజెండా ప్రకారం ప్రచారం చేసే ముఠాలే ఇవి.అలాంటి పని చేస్తున్న టీమ్‌ జార్జి ముఠా అది తప్పేమీ కాదని చెప్పటమే కాదు, అందుకు గాను ఎంత మొత్తాలను వసూలు చేస్తున్నదీ వెల్లడించారు. ఒక ఆఫ్రికా దేశ నేత ప్రతినిధులమని, ప్రచారం చేసేందుకు సేవలు కావాలంటూ వెళ్లిన జర్నలిస్టులకు వారు చెప్పిన సమాచారం, తమ పనిని ప్రదర్శించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఎన్ని దేశాల్లో ఇలాంటి కుహనా ప్రచారకులు ఎందరు ఉన్నదీ ఊహించుకోవాల్సిందే తప్ప లెక్కించలేము. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు, ప్రత్యర్థులను బదనామ్‌ చేసి దెబ్బ తీసేందుకు గూఢచార సంస్థలు, రాజకీయ పార్టీలు, వాణిజ్య సంస్థలు కూడా ఇలాంటి ప్రచార ఆయుధాలతో దాడులు చేసే కిరాయి మూకలను రంగంలోకి దించుతు న్నాయి. చివరికి ఇవి భార్యాభర్తల ఫోన్లు, సామాజిక మాధ్యమ ఖాతాలలో ప్రవేశించి అనుమానాలు, విబేధాలను రగిలిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ఇంపాక్ట్‌ మీడియా సొల్యూషన్స్‌ (ఎయిమ్స్‌) అనే సాఫ్ట్‌వేర్‌ 30 వేల నకిలీ ఖాతాలను నిర్వహిస్తుందంటే తప్పుడు ప్రచారానికి ఉన్న బలం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. నరేంద్రమోడీ జి 20 పేరుతో ఉన్న 20 దేశాలకు అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనతను సాధించిన నేతగా ఒక దగ్గర పోస్టు తయారు చేయగానే ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ల బటన్‌ నొక్కగానే రంగంలోకి దిగి నిజమే... నిజమే.., ఆహా... ఓహో... అంటూ లక్షల కొద్దీ లైకులో, ఇతరులకు పంపటమో చేస్తుంటాయి. ఇవి నకిలీ వెబ్‌సైట్లు, బ్లాగులను సృష్టించటంతో పాటు వాటిలో నిర్దేశిత సమాచారాన్ని కూడా నింపుతాయి. ఒకేసారి ఐదువేల మందికి మెయిళ్లు, సందేశాలు పంపగలవంటే క్షణాల్లో ఎంత మందికి తప్పుడు సమాచారం అందుతుందో అర్ధం చేసుకోవచ్చు. ''విస్మృత కథలు '' అనే పేరుతో పని చేస్తున్న ఫ్రాన్స్‌ లోని స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో వివిధ దేశాలకు చెందిన 30 పత్రికల విలేకర్లు మన దేశంతో సహా వివిధ దేశాల్లో సాగిస్తున్న తప్పుడు ప్రచారాలు, దాడులు, హత్యలు, బెదిరింపులకు గురవుతున్న విలేకర్లు, వారి పని గురించి దర్యాప్తు చేశారు.
         స్టోరీ కిల్లర్స్‌ ప్రాజెక్టు పేరుతో మహిళా జర్నలిస్టుల మీద రూపొందించిన వివరాలను ఐసిఎఫ్‌జె వెల్లడించింది. ఈ సంస్థ షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయ కంప్యూటర్‌ నిపుణుల సహకారంతో భారత జర్నలిస్టులు రాణా ఆయూబ్‌, గౌరీ లంకేష్‌, అల్‌ జజీరా యాంకర్‌ ఘదా క్వియిస్‌ తదితరుల గురించి నివేదికలను రూపొందించారు. వీరు కూడా ''విస్మృత కథలు'' సంస్థతో సమన్వయం చేరసుకున్నారు. స్త్రీ ద్వేషం, బూతులు, ఆమె మతం, రాసిన రాతల మీద ద్వేషం వెళ్లగక్కుతూ రాణా ఆయూబ్‌ మీద ప్రతి పద్నాలుగు సెకండ్లకు ఒక ట్వీట్‌ చేసినట్లు తేలింది. ఒక ట్వీట్‌ రాగానే ఒకటి రెండు నిమిషాల్లో దాని మీద వందల వేల ప్రతికూల స్పందనలు వెలువడటం అంటే అవి కంప్యూటర్లకు పుట్టినవి తప్ప మనుషులకు కాదు అన్నది స్పష్టం.ఈ ఆన్‌లైన్‌ హింసతో పాటు ఆమె ప్రాణాలు తీస్తామని, అత్యాచారం చేస్తామన్న బెదిరింపులు సరేసరి. ఆమెకు ప్రాణ హాని ఉందని ఐదుగురు ఐరాస ప్రతినిధులు 2018 లోనే హెచ్చరికను జారీ చేశారు. ఇక అల్‌ జజీరా యాంకర్‌ ఘదా క్వియిస్‌ గురించి ఒక మహిళ మీద ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చో అన్నీ చేశారు. గుజరాత్‌ మారణకాండ గురించి డాక్యుమెంటరీ నిర్మించిన బిబిసి మీద ఉక్రోషంతో దాని కార్యాలయాల మీద జరిపించిన దాడుల గురించి చూసిన తరువాత మన దేశంలో భిన్న గళాలను అణచివేసేందుకే కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని మరోసారి స్పష్టమైంది.
      జర్నలిస్టులను బెదిరించటమే కాదు, వారికి ప్రాణహాని కూడా ప్రపంచమంతటా ఉన్నదని చెబుతున్న నివేదికలు మన దేశంలోని ప్రజాస్వామ్యవాదులకు ఒక హెచ్చరిక కావాలి. తన ఎన్నిక కేసులో ఓడిన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించి పత్రికల మీద సెన్సారు పేరుతో వ్యతిరేక వార్తలను నిషేధించిన దానికి, బిబిసి డాక్యుమెంటరీని సామాజిక మాధ్యమాల్లో నిషేధించిన నరేంద్ర మోడీ సర్కార్‌ నిర్వాకానికి పెద్ద తేడా లేదు. ఇది ఒక ట్రైలర్‌ మాత్రమే, సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే !
 

/ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌/