కోపం, ఈర్ష్య, ద్వేషం.. ప్రేమ, సంతోషం, దు:ఖం.. అహం, మూఢత్వం, మానవత్వం.. వంటి అనేక మానవ సహజ గుణాలను తన కథల్లో ప్రస్ఫుటింపజేసిన యువకథా రచయిత దొండపాటి కృష్ణ తాజా సంకలనం 'రాతి గుండెల్లో నీళ్లు' ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలను మరోసారి జ్ఞప్తికి తెస్తుంది. ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి మనల్ని తట్టిలేపిన అనేక సంఘర్షణల సమాహారమే ఈ కథా సంకలనం.
ఎన్నో కలలతో కట్టుకున్న ఇంటిని అమ్మేయాలనుకున్నప్పుడు సగటు మనిషి పడే ఆవేదన అంతాఇంతా కాదు.. ముఖ్యంగా ఇంటావిడ పడే బాధ వర్ణనాతీతం. ఆ ఆవేదనను పట్టించుకోండని చాలా సున్నితంగా చెబుతారు 'స్వర్గసీమ' అనే కథలో.. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని భిక్షాటన చేసే వాళ్లకు కూడా ఉపాధి మార్గాలు చూపించ వచ్చని అంటారు 'మళ్లీ చిగురించారు' కథలో.. గ్రామాలకు మూల స్థంభాలైన సహజ వనరులను కాపాడుకోవాలని సూచిస్తారు 'మైత్రీవనం'లో.. ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల డబ్బులో కమిషన్ పొందే ఓ మహిళా అధికారి, ట్రాన్స్‌జెండర్ రమణి మరణం తరువాత ఆమె జీవితకథను తెలుసుకుని పశ్చాత్తాపం పడే భావోద్వేగ అంశాలతో సాగుతుంది 'రాతి గుండెల్లో నీళ్లు' కథ. భార్యాభర్తల అనుబంధాన్ని చాటిచెప్పే 'ఇది కదా సంతోషం' కథ యువతీయువకులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపే 'యాచకురాలు' కథలో కథానాయకుడు పడే అంతర్మథనం ఎప్పుడో ఒకసారి మనలో చాలామందికి కలిగిన మానసిక సంఘర్షణే.. ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని, డబ్బు చుట్టూ చేరిన మానవ సంబంధాలను ఎత్తిచూపుతూ సాగిన 'రాముడు-భీముడు' కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేదిగా ఉంటుంది.
ఈ రోజుల్లో సంపాదన వేటలో పడి, సరైన భాగస్వామి కోసం ఏళ్లకు ఏళ్లు పడిగాపులు కాసే యువతీ యువకులకు ఉండే అపోహలను పారద్రోలుతూ సాగే 'ఊహల రెక్కలతో ఎగరనీరు' కథలో ఇందిర, ఉదరు జంటతో చెప్పించే సంభాషణలు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. 'గుంటనక్కలు' కథలో ఆడపిల్లలకు పిరికితనం నూరిపోయకుండా ఆత్మస్థైర్యం నింపాలని, ప్రమాద సమయంలో తెలివిగా తప్పించుకునే తెగువను ప్రతి తల్లీ, తండ్రి నేర్పించాలన్నట్లుగా సాగుతుంది. కథ చివర్లలో తనపై తెగపడిన కామాంధులను పోలీసులకు పట్టించాలన్న కూతురును వారించి, మనకెందుకులే ఈ తలనొప్పి.. అనే తల్లి ధోరణి సగటు ఆడపిల్లలందరికీ ఎదురయ్యే అనుభవమే.. అయితే ఆ కథలో ఎలాగైనా పోలీసులకు పట్టించాల్సిందేనన్న కూతురుకు మద్దతు తెలిపే తండ్రి పాత్ర ఎంతోమంది ఆడపిల్లల తండ్రులకు ఆదర్శంగా నిలుస్తుంది.
బాగా చదువుకోవాలని ఆశపడిన ఓ ఆడపిల్లను కట్టుబాట్ల సంకెళ్లలో బంధించి పెళ్లి చేయడం, సంసార సాగరంలో పడిన ఆమె.. భార్యగా, కోడలిగా, తల్లిగా పడే మానసిక సంఘర్షణను చాలా హృద్యంగా నడిపిస్తారు 'ఉరేసుకున్న మౌనం' కథలో. తనకు జరిగిన అన్యాయమే కూతురుకూ పునరావృతమవుతుంటే తట్టుకోలేని ఆమె తీసుకున్న కఠిననిర్ణయం.. అదే సందర్భంలో తండ్రీకూతుళ్ల మధ్య జరిగే సంభాషణ ప్రతి ఇంటి ఆడపిల్ల ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్న అనుభవమే..
ఇలా ప్రతి ఒక్క కథను చాలా హృద్యంగా, అభ్యుదయంగా, మానవత్వంగా రచయిత తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. సమాజం పట్ల బాధ్యతగా మెలగమని చెబుతూనే సమాజాన్ని చైతన్యం చేయడంలో కూడా ముందుండాలని సూచించడం హర్షణీయం. మొత్తం 16 కథలలో వేటికవే ప్రత్యేకమైనవి.. ఆలోచింపజేసేవి.. యువ రచయితగా సమాజం పట్ల, కుటుంబ అనుబంధాల పట్ల ప్రేక్షకులను తనదైన శైలిలో కదిలించే సంకలనాలు చేసిన దొండపాటి కృష్ణ నుండి మున్ముందు మరిన్ని రచనలు రావాలని ఆశిస్తూ..
- జ్యోతిర్మయి
రాతి గుండెల్లో నీళ్లు..
రచయిత : దొండపాటి కృష్ణ
పేజీలు: 154
వెల : రూ.150
ప్రతులకు: 9052326864