Sep 17,2023 09:27

ఒంటరి స్త్రీలు! ఒక స్త్రీ ఒంటరి స్త్రీ అవడానికి, అలా అనిపించుకోడానికి అనేక కారణాలుంటాయి. కారణాలు సామాజికమే అయినా ఆ జీవితం మాత్రం వ్యక్తిగతమే. ఆమె 'ఒంటరి' అవడానికి డైవోర్సీ అయండొచ్చు, భర్త చనిపోయిన స్త్రీ, అవివాహితులు అయుండొచ్చు, అలా జరగకుండానే విడిపోయి వుండొచ్చు లేదా (నలుగురికి తెలియకపోవచ్చు కానీ) ఓ ఇంటి కప్పు కిందనే రెండు వేర్వేరు గదుల వ్యవహారం కావొచ్చు. సాధారణంగా విడిపోయి ఒంటరిగా బతుకుతున్న స్త్రీ పట్ల సమాజంలో అధిక భాగానికి ఒక చులకన భావం. అది పిల్లల పెంపకం మీద ప్రభావం చూపిస్తుందన్న అభద్రత లేకుంటే, రేపు పిల్లల భవిష్యత్తుకి ఆటంకం (చెత్తలో పెళ్లి వ్యవహారమే అనుకోండి) కావొచ్చనే భయం లేకపోతే, చుట్టూ వున్న సమాజం (కుటుంబసభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు, కొలీగ్స్‌) నుండి ప్రశ్నలు ఎదురుకాకుంటే కనీసం 75 శాతం మంది స్త్రీలు ఒంటరిగానే వుండటానికే ఇష్టపడతారేమో. తనతో పిల్లలో లేదా పేరెంట్సో వున్నప్పుడు కూడా స్త్రీ ఒంటరి స్త్రీ ఎలా అవుతుంది? ఒక స్త్రీ ఒంటరి స్త్రీ అని పురుషుడు నుండి దూరం అయినప్పుడే గుర్తించబడుతున్నది. పురుషుడి నుండి (అతని మరణం మినహా) దూరం అవడమంటే సమాజం ఆమోదించిన కుటుంబ చట్రం నుండి బైటకి రావడమే. అంటే అదో ఇచ్ఛాపూర్వక నిర్ణయం. అందుకే ఒంటరి స్త్రీగా వుండటమంటే అదో దురవస్థ కాదు. అదో వ్యక్తిత్వ స్థాయి. అదో ధైర్యం, తెగింపు. అదో స్వాతంత్య్ర ప్రకటన. ఒంటరి స్త్రీగా వుండటమంటే అదో శాపంలా, పాప కర్మంలా భావించే రోజులు పోయాయి. ఒంటరిగా వుండటమంటే ఏకాకిగా వుండటం కాదు. ఏకాంతంగా వుండటం. ఆత్మ గౌరవంతో మసులుకోవడం.
సంసార బంధంలో వెతలుంటాయి. ఒంటరి జీవితంలో సమస్యలుంటాయి. వెతలకి పరిష్కారం పూర్తిగా ఆమె చేతిలో వుండదు తెంపుకొని బైటపడటం మినహా. సమస్యలకి పరిష్కారం తన స్వంత ఎఫర్ట్‌తో పాటు భావజాల పోరాటం ద్వారా సమాజాన్ని సెన్సిటైజ్‌ చేయడం, డిమాండ్‌ చేయడం ద్వారా దొరకొచ్చు. ఆ సమస్య ఏదైనా కావొచ్చు. పిల్లల పెంపకం, ఆరోగ్యం, నివాసం, స్వంత ఇల్లు, పునర్వివాహం, వివాహం బైట లైంగిక సంబంధం.. ఏదైనా కావొచ్చు.
ఒంటరి స్త్రీల సమస్యల మీద ''హస్మిత ప్రచురణలు'' పి.జ్యోతి, భండారు విజయగార్ల సంపాదకత్వంలో 40 కథలతో ''స్వయం సిద్ధ'' అనే కథా సంపుటిని ప్రచురించారు. కథలు రాసిన వారందరూ ఒంటరి స్త్రీలు కాదు. ఇందులో చేయి తిరిగిన రచయితలున్నారు. ఇప్పుడిప్పుడే రాస్తున్నవారూ వున్నారు. తమని తాము స్త్రీలుగా మార్చుకున్న ట్రాన్స్‌ జెండర్‌ కథలు కూడా వున్నాయి. ఈ మధ్య ఘనంగా, సంబరంగా అవ్విష్కరించబడిన ఈ పుస్తకంలోని కథల్ని ఆసాంతం చదవలేదు. కానీ వోల్గా, ఎకె ప్రభాకర్‌ గార్ల విలువైన పీఠికల పూర్తిగా చదివాను. కథలు కూడా చదువుతాను..
తాము అనుభవించిన సామాజిక నరకాన్ని, వివక్షని ప్రశ్నించి, ఎదుర్కొని, నిలబడి, కలబడి, కొత్త విలువలని ప్రతిపాదించి, ప్రతిష్టించే వారెవరైనా నూతన సమాజ రూపకర్తలే. కొత్త చరిత్రకి దారులు వేసినవారే. మొత్తం ప్రపంచ చరిత్రని పరిశీలిస్తే అందులో స్త్రీలెప్పుడూ ముందు వరసలోనే వుంటారు. ఈ దిశగా ఈ పుస్తకాన్ని తేవడానికి రెండు సంవత్సరాలకు పైగా ఎంతో సమయం వెచ్చించి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చిన విజయ, జ్యోతిగార్లకు జేజేలు. స్వయం సిద్ధ! ఓ ఏక పద ధిక్కార ప్రకటన!! స్వీయ నిర్మిత వ్యక్తిత్వ భాషణ. చదవండి.

- అరణ్య కృష్ణ
9849901078

స్వయం సిద్ధ : 335 పేజీలు.
వెల : 300/- రూపాయిలు.
సంప్రదించాల్సిన నెం :8801910908,
8686468286