
'హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్ / తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే' అంటే...'బంగారు మూతతో సత్యం యొక్క ముఖం కప్పబడి వుంటుంది. నువ్వు దాన్ని తొలగించి, సత్యంవైపు నడిపించు' అని అర్థం. సత్యం తాత్కాలికంగా కప్పబడిపోవచ్చు. నిప్పుకణికలా అది రగులుతూనే వుంటుంది. ఏదోక సమయంలో భగ్గుమని మండుతుంది. ఈ దేశంలో అసహనం ఎంత హద్దు మీరుతున్నదో... ఆ అసహనాన్ని ఎదురించే శక్తులు, నిరసన గళాలు అంతే ఉవ్వెత్తున లేస్తుంటాయి. ప్రశ్నించేతత్వం, పోరాడేతత్వం లేనిచోట బానిసత్వం, నిరంకుశత్వం రాజ్యమేలుతుంది. 'ఇరుగు పొరుగుల్ని ఎద్దేవా చెయ్యడమెందుకు... అధికార మదాంధుల్ని, నియంతల్ని, మన మీద సవారీ చేస్తున్న దుర్మార్గుల్నీ ఎద్దేవా చెయ్యి' అంటాడు విఖ్యాత రష్యన్ రచయిత నికొలారు గొగోల్. ప్రశ్నించేతత్వం, స్వేచ్ఛ మనిషికి రెండు రెక్కల్లాంటివి. ప్రశ్నించే గుణం నుంచే అభివృద్ధికి బాటలు పరుచుకున్నాయి. ఆ ప్రశ్నకు స్వేచ్ఛ వుంటేనే అది ఆకాశంలో పక్షిలా స్వతంత్రంగా మనగలుగుతుంది. స్వేచ్ఛకు సంకెళ్లు పడితే... సృజనకు విఘాతం కలుగుతుంది. ప్రశ్నించేతత్వం చచ్చుబడిపోతుంది. స్వేచ్ఛకు ఎక్కడైతే సంకెళ్లు పడతాయో, ప్రశ్నించేగళాలకు ఎక్కడైతే అడ్డుతగులుతారో... అక్కడే నిరసన జ్వాలలు నిప్పుకణికల్లా భగ్గుమంటాయి.
'మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి... కానీ, ప్రతి చోటా సంకెళ్లలో చిక్కుకుంటున్నాడు' అంటాడో కవి. రోజురోజుకూ మతతత్వం కోరల్లో చిక్కుకుంటున్న సమాజంలో చైతన్యాన్ని రగిలించడం కోసం, నిరంకుశత్వాన్ని ఎదిరించడం కోసం నడుంకట్టిన అభ్యుదయవాదులపై దేశ ద్రోహం ముద్ర పడుతోంది. వారి రాజకీయ కుతంత్రాలను బయటపెట్టే ప్రగతిశీల శక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. అబద్ధాల పునాదుల మీద నిర్మించుకున్న అద్దాల మేడ ఎక్కడ కుప్పకూలి పోతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. 'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం/ నరజాతి చరిత్ర సమస్తం/ పరపీడన పరాయణత్వం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రలు వేసి, బెయిల్ కూడా రాని 'ఉపా' వంటి కఠిన చట్టాల ద్వారా నిర్బంధిస్తున్నారు. నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే, గౌరీ లంకేష్, ఎం.ఎం.కల్బుర్గిని నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. స్టాన్ స్వామిని బలితీసుకున్నారు. ప్రొఫెసర్ సాయిబాబు, వరవరరావు తదితరులను జైలు పాలు చేశారు. తాజాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను తుపాకీతో కాల్చి గాయపరిచారు. స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు మోడీపైనా, బిజెపిపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న కారణంగా...ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. అమెరికా శ్వేతసౌధంలో భారత్‌లోని మానవహక్కుల ఉల్లంఘనలపై ప్రధాని మోడీని ప్రశ్నించిన వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన సబ్రినా సిద్ధిఖీపై వేధింపులు మొదలయ్యాయి. పాకిస్తాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ముద్ర వేశారు.
'అధికారానికి వ్యతిరేకంగా మనిషి చేసే పోరాటమంటే/ మరచిపోవటానికి వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం' అంటారు ప్రముఖ రచయిత మిలన్ కుందేరా. రచనల్లోనో, కవితల్లోనో ప్రశ్నిస్తామంటేనో, స్వేచ్ఛ అనుభవిస్తామంటేనో కుదిరే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒక తూటా ఒక్కరినే చంపుతుంది. కాని అది బలి తీసుకున్న నెత్తురు కోట్లాది గొంతుల్లో నిప్పుల జలపాతమై ఉరుకుతుంది. ప్రశ్నించే గొంతులన్నీ ఏకం కావాలి. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం అడుగులొక్కటై కదలాలి. దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ మాదిరిగా ఇంకోసారి మరో అభ్యుదయవాది చీకటి తూటాలకు బలి కాకూడదు. ప్రశ్నించే గొంతులు, స్వేచ్ఛా హృదయాలు... భయంతో ముడుచుకుపోయే మతోన్మాదాన్ని ఎదిరించాలి. 'నా దేశంలోనే నా గొంతు పరాయిదయిపోయింది. ఇక్కడ నేను అరచిన అరుపు ఆకాశంలోకి వెళ్లి, ఎక్కడో ఇరుక్కుపోతుంది. తిరిగి రానేరాదు' అంటాడు గుంటూరు శేషేంద్ర. ప్రశ్నించే గొంతులు లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం అవుతుంది. భీమ్ ఆజాద్, తులసీ చందు, సబ్రినా వంటి ప్రశ్నించే గొంతులు ఒంటరిపాటు కాకూడదు. వారి గొంతులు పరాయివవకూడదు. అసహన దాడుల్ని, నిరంకుశ పాలకుల్ని నిరసిస్తూ దేశమంతా కదలాలి.