
పేద, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయిలకు పెద్దగా ఆశలేం ఉంటాయి.. చదువు, పెళ్లి, పిల్లలు.. ఇంతకు మించి ఆలోచిస్తే.. విభిన్న రంగంలోనో, కళలోనో రాణిస్తే.. మొదట్లో అన్నీ అడ్డుగోడలే.. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడడం ఆషామాషీ కాదు. అలాంటిది ఓ అమ్మాయి తనకిష్టమైన చిత్రకళకు 'చెట్లను రక్షించడమ'నే ఉన్నత లక్ష్యాన్ని ముడిపెట్టి అందరిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రముఖుల ప్రశంసలందుకుంటున్నారు. కడప, పొద్దుటూరుకు చెందిన 25 ఏళ్ల కొడవలూరు ప్రసన్న ఎంచుకున్న ఈ మార్గం గొప్ప భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే ఎంతోమంది యువతకు దిశానిర్దేశం..

పల్లెటూళ్ల నుండి పాలు తెచ్చి పట్నంలో అమ్మే చిరు వ్యాపారి కుటుంబంలో రెండో సంతానంగా ప్రసన్న జన్మించారు. రామచంద్రరాజు, మంజువాణిల గారాలపట్టి. తమ సంతానంగా పుట్టిన ముగ్గురు ఆడపిల్లలను బాగా చదివించాలన్న లక్ష్యం ఉన్న తల్లిదండ్రులు వారు. చదువుతో పాటు చిత్రకళపై ఇష్టం పెంచుకున్న రెండో కూతురు ప్రసన్న అభిరుచిని కూడా ప్రోత్సహించారు. 'నాకు చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. ఇంటర్ పూర్తయ్యాక అమ్మే స్వయంగా నన్ను ఆర్ట్స్‌్ స్కూల్‌లో చేర్పించింది. ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకు. పెళ్లి చేసి పంపించేయక అని చాలామంది అనేవారు. అయినా అమ్మానాన్న నన్ను నిరుత్సాహపర్చలేదు. అయితే అమ్మకు ఆరోగ్యం బాగోలేక కొన్ని రోజులకు ఆర్ట్స్‌కు దూరమయ్యాను. హిందీ పండిట్‌గా కోచింగ్ కూడా తీసుకున్నాను. కానీ ఏదో వెలితి నన్ను వెంటాడుతూ ఉండేది. కరోనా వల్ల వచ్చిన విరామం నన్ను మళ్లీ ఆర్ట్స్ వైపు నడిపించింది' అంటున్న ప్రసన్న చెట్లను రక్షించడమనే లక్ష్యం ఎందుకు తీసుకున్నారని అడిగినప్పుడు ఇలా చెప్పారు.
గురువుగారి ప్రోత్సాహం వల్లే..
'మా గురువుగారు రామాంజనేయ రెడ్డి. 'మహేష్ ఆర్ట్స్' అంటే అందరికీ తెలుస్తుంది. 'సేవ్ గర్ల్ చైల్డ్' లక్ష్యంతో ఆయన కళారూపాలు చిత్రించేవారు. వాటిని ప్రముఖులకు అందజేసి అందరికీ అవగాహన కల్పించేవారు. ఉన్నత లక్ష్యాన్ని కళారూపాలతో కూడా ముందుకు తీసుకువెళ్లవచ్చని ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఒకసారి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న, చెట్లను రక్షిస్తున్న తిమ్మప్ప అవ్వ గురించి గురువుగారు చాలా గొప్పగా చెప్పారు. అప్పుడే నా లక్ష్యం నిర్దేశించుకున్నాను. నేను కూడా కళారూపాల ద్వారా వృక్షాలను రక్షించమని అవగాహన కల్పిస్తానని చెప్పాను. గురువుగారు చాలా సంతోషించారు. ఆ దిశగా ప్రోత్సహించారు. సింగిల్ కలర్ ఆర్ట్, సాండ్ ఆర్ట్‌లో గురువుగారు ఎన్నో మెళకువలు నేర్పించారు. మొదట్లో నేను వేయగలనా అని సందేహపడేదాన్ని. కానీ నాలో ఆత్మవిశ్వాసం నింపి, ఎంతో ప్రోత్సహించారు. 'ఆడపిల్లలు ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలి. అప్పుడే నా ఆశయం నెరవేరుతుంది' అని గురువుగారు చాలాసార్లు నాతో అన్నారు' అంటూ విద్య నేర్పిన గురువు గురించి ఆమె చెబుతున్నప్పుడు ఆ మాటల్లో ఆనందం, గురువుపట్ల అమిత గౌరవం ధ్వనించింది.

వందమంది ప్రముఖులకు పైగా
8 మంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు, దర్శకులు, నటీనటులు, గాయకులు, సామాజిక కార్యకర్తలు ఇలా ఒకరేమిటి ఇప్పటివరకు వందమందికి పైగా ప్రముఖులకు తన కళారూపాలను బహుకరించారు ప్రసన్న. 'వృక్షో రక్షతి రక్షిత:' నినాదం రాసిన ఆ అందమైన కళారూపాలను చూసిన వారంతా చిన్న వయసులోనే గొప్ప లక్ష్యంతో ముందుకెళుతున్న ఆమెను గొప్పగా ప్రశంసిస్తున్నారు.
స్వామినాథన్‌ను కలవడం గొప్ప అనుభూతి
'ప్రముఖ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు నా కళారూపం బహుకరించాను. అప్పుడు ఆయన వీల్‌ఛైర్‌లోనే ఉన్నారు. సరిగ్గా మాట్లాడలేక పోతున్నారు. నాతో ఏదో చెప్పాలని ఎంతో తాపత్రయపడ్డారు. కానీ నాకు అర్థం కాలేదు. ఆ క్షణం నాకు ఎంతో బాధ కలిగింది. ఇటీవలె ఆయన మరణించారన్న వార్త తెలిసినప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చి బాగా ఏడుపొచ్చింది' అని చెబుతున్నప్పుడు ప్రసన్న ఎంత సున్నిత మనస్కురాలో అర్థమౌతుంది.

నా కళ ద్వారానే వారిని స్వయంగా కలిశాను
'నేను కూడా అందరిలాగా తెరపైనే సినీతారలను, గాయకులను, దర్శకులను చూసేదాన్ని. కానీ నా కళ వారిని స్వయంగా కలిసేలా చేసింది. బోయపాటి, కాజల్, శంకర్, శ్రీకాంత్, జయప్రద, సుశీలమ్మ, ఇళయరాజా, చరణ్ లాంటి చిత్రసీమలో ఉన్న ప్రముఖులు నా కళారూపాలను చూసి ఎంతో మెచ్చుకున్నారు. సింహం రూపంలో ఉన్న కళారూపాన్ని బోయపాటికి ఇచ్చినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఇస్రో శాస్త్రవేత్త, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, రోశయ్య, తమిళసై పోలీసు అధికారి సజ్జనార్, ఇలా ఎంతోమంది రాజకీయ, విభిన్న రంగాల ప్రముఖులు నా కళారూపాలను ప్రశంసించారు. ఇదంతా నా కళ ద్వారానే సాధ్యపడింది' అంటూ చెబుతున్న ఆమెలో గొప్ప కళాభిమానం కనిపిస్తుంది.

ఉన్నత లక్ష్యం..
'మాలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలు ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. అప్పుడే సమాజం నుండి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. నేను సాధిస్తున్న ఈ విజయాలు అమ్మానాన్నను ఎంతో సంతోషపెడుతున్నాయి. ప్రముఖులు నా చిత్రాలను ప్రశంసిస్తుంటే నాన్న తెగ మురిసిపోతాడు. ఒకప్పుడు 'మీకు అసలు బుద్ధుందా.. ఆ పిల్లకు ఇష్టమని బొమ్మలు గీయడం నేర్పుతున్నారు.. అదేమైనా తిండి పెడుతుందా? గౌరవం తెచ్చిపెడుతుందా?' అని అమ్మానాన్నను దెప్పిపొడిచిన వాళ్లే ఇప్పుడు నన్ను పొగుడుతుంటే అమ్మ ఎన్నో సార్లు ఆనందభాష్పాలు రాల్చడం నేను చూశాను. పెళ్లయ్యాక కూడా నా లక్ష్యం కొనసాగిస్తాను' అంటున్న ప్రసన్న ఎంచుకున్న ఉన్నత ఆశయం, భవిష్యత్తులో ఆమెను ఉన్నత శిఖరాల వైపు నడిపించాలని ఆశిద్దాం.
- జ్యోతిర్మయి