
పుస్తకం ఒక మంచి మిత్రుడు అనే దాని నుండి స్మార్ట్ఫోన్ ఒక మంచి స్నేహితుడనే అభిప్రాయానికి పిల్లలు వస్తున్న సమయంలో సరళంగా అర్థమయ్యే పదాలతో ఆసక్తికరంగా సాగింది 'ఉత్తమ కథలు' పిల్లల పుస్తకం. పిల్లల కోసం నారంశెట్టి ఉమామహేశ్వరరావు వెలువరించిన ఈ పుస్తకంలో మొత్తం 26 కథలు ఉన్నాయి. బాలల కోసం కథలు రాసే రచయితలకు పోటీ పెట్టి వాటిలో ఉత్తమమైన వాటిని ఉత్తమ సంకలనంగా తీసుకొచ్చారు నారంశెట్టి. పిల్లల కథలు రాయడంలో అనుభవజ్ఞులైన రచయితలు కావడం వల్ల దాదాపుగా ప్రతి కథా చాలా బాగుంది. ఊహాశక్తిని పెంచి, మంచి నడవడికను నేర్పే సాధనాలుగా కథల పుస్తకాలు ఉంటాయి. అలా నేర్పే కథలను ఒకచోట చేర్చడంలో నారంశెట్టి ఉమామహేశ్వర రావు సఫలీకృతులయ్యారు. బి.వి.పట్నాయక్ - రాజుగారి ఏడు గదులు, గరిమెళ్ల నాగేశ్వరరావు - ఏ రోజు పాఠం ఆ రోజే, పి.వి. శేషారత్నం - గోరుముద్దలు లాంటివన్నీ మంచి కథలే. పిల్లల్ని ఆలోచింపజేసేవే. సంపద లేకుండా నీరు, ఆహారం, విజ్ఞానం వంటి సిరిసంపదలతో మనిషి బతకగలడు అని తెలియజేసింది 'రాజుగారి ఏడుగదులు' కథ. ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఇతరులకు సహాయపడుతుంది అని తెలుపుతూ 'ఒకరికి ఉపయోగం' అంటూ రాసిన కథ బాగుంది. స్నేహితుడి కోసం తన్నులు తింటూ, యజమాని వేసిన నిందలు భరిస్తూ స్నేహం గొప్పతనాన్ని, పిల్లలపై జరిగే దాడిని ప్రశ్నించాలి అని అమ్మమ్మ పాత్ర రూపంలో 'గోరుముద్దులు' కథలో తినిపించారు. తాతయ్య, అమ్మమ్మలను దూరం చేసి ఆన్లైన్ ద్వారా కథలు చెప్పించే తల్లిదండ్రులకు.. అమ్మమ్మను అద్దంలో చూపించాలంటే ఆమె అద్దం ఎదురుగా ఉండాలి కదా అనే ప్రశ్న ఆలోచింపజేస్తుంది. ఉయ్యూరు అనసూయ 'గజరాజుకే పట్టం' కథ మంచి ముగింపుతో అలరించింది. సుజనా దేవి 'కొండచిలువ' కథ బాలల్లో సాహసాన్ని, సమయస్ఫూర్తిని వెల్లడించింది. పుట్టినరోజు నాడు తమ బడి కోసం తల్లిదండ్రులతో ఒక మంచిపని చేయించిన రాము కథ 'నిర్ణయం' స్ఫూర్తిదాయకం. రచయిత నంద త్రినాథరావుకు అభినందనలు. అలాగే నాదెళ్ళ అనూరాధ రాసిన కథ 'కిచ్చు' చాలా బాగుంది. సాధారణంగా పిల్లలు ఇలాంటి ఫాంటసీ కథలకు ఎక్కువ ఆకర్షితులవుతారు. ఈ కొన్ని కథలు మాత్రమే ప్రస్తావించాను అంటే మిగిలినవి బాగాలేవని కాదు.. కేవలం స్థలాభావం తప్ప! అన్ని కథలూ బాగున్నాయి. రచయితలందరికీ అభినందనలు. ముఖ్యంగా నారంశెట్టి ఉమామహేశ్వరరావు కృషి ఎంతగానో ప్రశంసించదగినది. తన బాలల శిక్షణా పద్ధతుల గురించి ప్రముఖ విద్యావేత్త గిజుభారు మాటలను గుర్తు చేసుకుందాం.. 'ఒక తుపాను సృష్టించడం, ఒక అలను తయారుచేయడం నా పని. ఇందుకు అందరి సహకారం కావాలి' అంటారు. అలాగే కథల పుస్తకాల అలను తయారుచేసే వారిని ప్రోత్సహిస్తూ.. వీటిని పిల్లల వద్దకు చేర్చే సహకారం అందరూ తీసుకుంటారని ఆశిద్దాం.
- బోయ రవి
8500161788
సంపాదకులు : నారంశెట్టి ఉమామహేశ్వరరావు
పేజీలు 96,
వెల: రూ 70/-
ప్రతులకు: 94907 99203, 73864 08306