Aug 27,2023 09:10

''హ్యాపీ బర్త్‌డే గ్రాండ్‌ మా!' అని వాట్సాప్‌ మెసేజ్‌ చూసి చాలా సంతోషం కలిగింది. అయినా మనసులో కించిత్తు బాధ. 'నా మనవరాలికి తెలుగు రాయడం, చదవడం రాదు. ఏంటో ఈ చదువులు' అంటూ వాపోయారు ఒక పెద్దావిడ. తెలుగు మన మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. జోలపాట, లాలిపాటలే.. తొలి పాఠాలు. బిడ్డ నోట 'అమ్మ' అనే తొలి పలుకు విన్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. భాషకు అక్షరాలు.. భావానికి మాటలే ఆభరణాలు. అర్థంకాని భాష 'అమ్మ భాష'గా మారడానికి గిడుగు రామ్మూర్తి పంతులు సుదీర్ఘ కాలం ఉద్యమం చేశారు. అందుకే ఆయన పుట్టినరోజు ఆగస్టు 29న ఏటా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకుంటాం. ఆ సందర్భంగా తెలుగు భాషపై కొన్ని పలుకులు.

1


ఆంగ్లేయుల పాలనలో మగ్గుతున్న రోజులవి. పాఠశాలలపై తనిఖీ నిర్వహిస్తున్న జెఎ ఏట్స్‌ దొర పాఠాలు నేర్చుకోవడంలో పిల్లలు గజిబిజికి లోనౌతున్నారని గ్రహించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గిడుగు, గురజాడ, శ్రీనివాస అయ్యంగార్లతో చర్చించి మాతృభాషలోనే విద్య ఉండాలని నిర్ణయించారు. దానికోసం 1907లో మాతృభాషా ఉద్యమం లేవనెత్తారు గిడుగు రామ్మూర్తి పంతులు. వాడుకభాషలోనే పాఠ్యాంశాలు, బోధన ఉండాలనేది ఉద్యమ భావన. దాదాపు 33 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ కృషితో 'తెలుగు భాష' పాఠ్యాంశాల్లో చోటుచేసుకుంది.

చైతన్య వీచికలు..

ఈ భాషద్వారానే కందుకూరి, గురజాడ, చిలకమర్తి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, శ్రీశ్రీ లాంటి ఎందరో సాహితీవేత్తలు, కవులు ఉద్భవించారు. సమాజంలోని దురాచారాలు, మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలను రూపుమాపారు. భాషనుంచీ పుట్టిన జానపదాలు, రచనలు, పాటలు, అనేక కళారూపాలు ప్రజల్లో చైతన్యం తెచ్చాయి.

భాషే విద్యకు పునాది..

'అ' నుంచి అక్షరాలు.. 'అమ్మ' అనే పిలుపుతో మాటలు మొదలవుతాయి. సంస్కృతి పెంపొందుతుంది పిల్లలకు. మనదేశంలో విభిన్న భాషా సంస్కృతి ఉంది. దేనికైనా వాడుకలోనే మనుగడ. ఉగ్గుపాలతోనే మనోభావాలు మాటలు, పాటల రూపంలో బిడ్డకు చేరతాయి. ఎ,బి,సి,డి..లు నేర్చుకున్నప్పుడు మమ్మీ.. డాడీ అనే ఆంగ్ల సంస్కృతి చోటుచేసుకుంటుంది. అది కొంతకాలం తల్లిదండ్రులకు ఆకర్షణగా అనిపించవచ్చు. దానివలన భాష ఉనికి, పిల్లవాడి సామర్థ్యం దెబ్బతింటుంది. బిడ్డకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే భాషతో బంధం ఏర్పడుతుంది. 'చందమామ రావే.. జాబిల్లి రావే..' అనే పాటతో బిడ్డ ఆనందం పొందుతుంది. ఆ ఆనందం తనకు పరిచయమైన పదాలకు స్పందన.
అందుకే ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలో ఉంటే పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతుంది. విజ్ఞానదాయకమైన భవిష్యత్తుకు చక్కని పునాది అవుతుంది.

3

ప్రాథమిక విద్య తెలుగులో..

మన మాతృభాష తెలుగు కాబట్టి ప్రాథమిక విద్య తెలుగులో ఉంటే విద్యార్థి విషయాలను నేర్చుకోవడం తేలికవుతుంది. బట్టీ పట్టకుండా విషయాన్ని అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొనే సౌలభ్యం ఉంటుంది. చదవటం చురుకుగా సాగుతోంది. ఇతర భాషలపై ఆసక్తి కలుగుతుంది. సామాజిక స్పహ పెంపొందుతుంది. ఇష్టంగా చదవటం అలవడి మానసికశ్రమ, అలసట లేకుండా ఉత్సాహంగా అనేక విషయాలు నేర్చుకుంటాడు. ఏ విషయంలోనైనా ప్రావీణ్యతను సాధిస్తాడు. తెలిసిన భాషలో బోధన ఉంటే అలవోకగా.. ఆనందంగా నేర్చుకుంటాడు.

ఇతర భాషలో అయితే..

ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఇతర భాషలో బోధన తప్పనిసరి చేస్తే ఆ చిన్న మెదడుపై ఒత్తిడి పడుతుంది. విషయాన్ని గ్రహించే శక్తి తగ్గుతుంది. దాంతో బట్టీ పట్టడమే మార్గంగా ఎంచుకుంటాడు పిల్లవాడు. దాని వలన ఏ సబ్జెక్టులోనూ పూర్తి అవగాహన రాదు. సృజనాత్మకత లోపిస్తుంది. ఎలాంటి వ్యాస రచన, క్విజ్‌, ఉపన్యాస, చర్చా కార్యక్రమాలలో పాల్గొనడానికి ముందుకు రాలేని పరిస్థితి. దాంతో చొరవ, భావాలను వ్యక్తం చేసే నైపుణ్యం మందగిస్తాయి. సామాజిక పరివర్తన కొరవడుతుంది.

మరి ఆంగ్లం అంటే..!

అంటే ఇక్కడ ఆంగ్ల భాష వద్దు అని అర్థం కాదు. అది కూడా అవసరమే. కానీ అది మాత్రమే ప్రధానం కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఎక్కువ దేశాల్లో అధికార భాషగా ఉన్నది ఆంగ్లమే కాబట్టి, ఉన్నతవిద్యలో విజ్ఞాన సేకరణకు, విషయ సంగ్రహణకు ఆంగ్లము అవసరం. అంతేకానీ మాతృభాషను ఒక సబ్జెక్టుగా పెట్టి ఆంగ్లమాధ్యమంలో బోధన ఉంటే అర్థం చేసుకునే శక్తి పిల్లవాడికి ఉండదు. అవగాహన వచ్చేంతవరకూ తెలుగులోనే బోధన ఉండాలి. మాట్లాడే భాష, నేర్చుకునే భాష వేరుగా ఉంటే మనసుమీద ఒత్తిడి పడుతుంది. దీంతో ఎక్కువమంది విద్యార్థులు పూర్తికాలం విద్యను కొనసాగించలేరు. తద్వారా నిరక్షరాస్యత చోటుచేసుకుంటుంది.

ఉమ్మడి జాబితా ఉనికిలో..

విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలోనే బోధించేలా చర్యలు తీసుకోవాలి. పాలకులే విద్యారంగంపై చిత్తశుద్ధితో దృష్టి పెట్టాలి. విద్యావ్యవస్థలో తెచ్చే మార్పులు మాతృభాషలో బోధనకు ఆటంకం కాని విధంగా చర్యలు ఉండాలి. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలి. దీని వలన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు లబ్ది పొందుతారు. ముఖ్యంగా ఎవరికి ఏ రంగంలో ప్రావీణ్యత ఉంటే ఆ రంగంలో ఉపాధి కల్పించాలి. ఇవి దేశ ప్రగతికి మూలాలు.

4

ప్రపంచీకరణ..

కొన్ని దశాబ్దాలుగా ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతికత అభివృద్ధి, దానికనుగుణంగా కార్పొరేట్‌ సంస్థలు పుట్టుకొచ్చాయి. విదేశీ సంస్కృతి చోటు చేసుకుంది. అభివృద్ధి పేరుతో పాలకులు వీటిపైనే దృష్టి పెట్టారు. ఇవన్నీ విదేశీ నాణ్యతను కోరుకుంటాయి. మన దేశంలో పునాది రాళ్ళుగా కొనియాడబడిన స్వదేశీ రంగాలు క్షీణదశకు చేరాయి. ఈ రెండు పరిస్థితులూ సమాంతరంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాలను సమతుల్యంగా రాణించేలా చేసినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు..

పొట్టి శ్రీరాములు 1953లో తెలుగు భాష ప్రాతిపదికగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఈ స్ఫూర్తితోనే ఇతర ప్రాంతాల్లోనూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండు బయలుదేరింది. డిసెంబరు 22, 1953న ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో ఫజల్‌ అలీ కమిషన్‌ భాష ప్రాతిపదికగా దేశాన్ని 14 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దాంతో మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమంతో విద్యారంగం విలసిల్లింది.

ఏఏ దేశాల్లో.. రాష్ట్రాల్లో..

జపాన్‌, చైనా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, జర్మనీ లాంటి ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా అభివద్ధి పథంలో నడుస్తున్నాయంటే మాతృభాషా అధ్యయనమే దానికి కారణం. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో ప్రజాహితమైన వాటిలో ఇతర భాషలకు తావులేదు. కార్యాలయాలు, షాపులు, ఇతర బోర్డులు, బస్సులపై తమిళం తప్పనిసరి. అసెంబ్లీలో, ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ మాతృభాషలోనే. అలాగే పంజాబ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌.. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉంటుంది.

ఆంగ్లంలో చదివితేనే ఉన్నతమా?!..

'తెలుగు మీడియంలో చదవటం వల్ల మౌఖిక పరీక్షలో (ఇంటర్వ్యూ) ఉత్తీర్ణత సాధించలేకపోయాం' అని విద్యార్థుల్లోను.. ప్రాథమిక స్థాయి నుంచీ ఆంగ్ల మాధ్యమంలో చదివితే వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని తల్లిదండ్రుల్లోనూ ఆలోచనలు ఉన్నాయి. మన దేశ ప్రధానిగా చేసిన పివి నరసింహారావు తెలుగు మాథ్యమంలో చదివి.. పదిహేడు భాషల్లో ప్రావీణ్యత సంపాదించిన దిట్ట. అలా ఎందరో మేధావులు, ప్రముఖులు తెలుగు మాథ్యమంలో చదివిన వారేననే నిజాన్ని మనం గ్రహించాలి. వీరంతా ఆంగ్లంలోనూ ప్రావీణ్యులే.

1

విదేశీయానం..

చదువులో ఉన్నత ప్రమాణాలు అందుకున్న మేధావులకు స్వదేశంలో తగిన కొలువు లేదు. మాతృభాష.. మాతృభూమి అనే వాటిని భవిష్యత్తరంగాలు కమ్మేస్తున్నాయి. తద్వారా మన మేధాశక్తి విదేశీ సేవకు అంకితమౌతోంది. మన మేథావుల యుక్తి మన దేశానికి ప్రబల శక్తిగా మార్చే అవకాశం పాలకులకే ఉంది. విద్యపై దృష్టి పెట్టి.. తగిన ఉద్యోగ పరిస్థితులను కల్పిస్తే మన మేథ మనదే కదా..!

టాన్యా
7095858888