
'చదవాల్సినంత గొప్పగా ఏదైనా రాయాలి లేదా రాయాల్సినంత గొప్పగా ఏదైనా చేయాలి' అన్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ కొటేషన్‌తో ఈ పుస్తకానికి రాసిన హితవాక్యంలో సంగెవేని రవీంద్ర పేర్కొంటారు. అవును... నిజం. రాయాల్సినంత గొప్పగానే ఈ పుస్తకంలోని కథలున్నాయి. ఈ కథలు చదివితే కచ్చితంగా అలాంటి భావనే కలుగుతుంది. కథలన్నీ సామాజిక బాధ్యతతో... ఈ సమాజంలోని ఒక పౌరునిగా తనవంతు కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించినట్లు కనిపిస్తుంది. డాక్టర్ తాటి నరహరి '34 గోఖలే రోడ్ నార్త్' పేరుతో ఈ పుస్తకంలో 10కథలతో పాటు తొమ్మిది కవితలను కూడా అందించారు. ఈ కథా సంపుటిలోని కథలన్నీ వైవిధ్యభరితంగా... లోతైన జీవన చిత్రణతో కూడి వుంటాయి. ముఖ్యంగా ఈ కథల్లోని పాత్రలన్నీ... రోజూ మనకు తారసపడుతున్న భావననే కలిగిస్తాయి. మొదటి కథల పుస్తకమే అయినా... చెయ్యితిరిగిన రచయితలా... కథా వస్తువును ఎంపిక చేసుకున్న తీరు, మలిచిన విధానం అభినందించదగ్గ స్థాయిలో వుంది. రచయిత ఒక డాక్టరుగా ఎందరో పేషెంట్లతో జరిపిన సంభాషణల భావోద్వేగాలకు అక్షరరూపం ఈ కథల సంపుటి.
ఈ పుస్తకంలోని మొదటి కథ- 'మా శీనుగాడి ప్రేమకథ'. మధ్య తరగతి కుటుంబాల్లోని మమతానురాగాలు, గొడవలు, ప్రేమలు ఈ కథలో ద్యోతకమౌతాయి. ముప్పై ఏళ్ల వయసు వచ్చినా పనీపాట లేని కొడుకు... ఆవారాగా కళ్లముందు తిరుగుతుంటే... తండ్రి పడే మనోవేధన, కొడుకు పడే సంఘర్షణ, మధ్యలో శీనుగాడి ప్రేమ... వెరసి ఈ కథ ఆకట్టుకుంటుంది. పుస్తకం పేరుతో వచ్చిన '34 గోఖలే రోడ్ నార్త్' కథలో భవిష్యత్ భద్రంగా వుండాలంటే.. డబ్బే ప్రధానం అని ఆలోచించే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అంతేకాదు... తాను వెళ్లాల్సిన దారి ఏదో ఎంచుకునే ఓ యువకుడి అంతర్మథనం ఈ కథ.
ఈ కథలన్నిటిలో వైవిధ్య కథావస్తువుతో రాసిన కథ 'ఆట కదరా శివ'. రచయిత తనికెళ్ల భరణి 'ఆట కదరా శివా' పేరుతో రాసిన శివ తత్వాలను కథకు అనుగుణంగా మలుచుకొని కథను అల్లారు. సినిమాల్లో కీలకమైన సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ వస్తుంటుంది. పాత్రలు కదులుతూ వుంటాయి. అలాగే... ఈ కథలో 'ఆట కదరా శివ' కవిత... ఒక పాటలా కదులుతుంటుంది. కథ ఆసాంతం ఈ పాటపైనే నడుస్తుంది.
అలాగే మనసును హత్తుకునే మరో కథ 'రామిత'. ఆధునిక యుగంలో తల్లిదండ్రులతోనే కలిసి వుండటం అనేది అసాధ్యంగా మారింది. ఉద్యోగాలకో, వ్యాపారాలకో వేరే ప్రాంతాలకు వెళ్లడం తప్పనిసరి. అలాంటి పరిస్థితిలో ఆ తల్లిదండ్రుల ఒంటరితనం తీర్చలేనిది. తల్లిదండ్రులను చూసుకునే అవకాశం లేకపోయినా... కనీసం వారి మంచిచెడ్డల గురించి ఆలోచించే కొడుకులు కొందరైనా వుంటారు. అలా ఆలోచించిన కొడుకు ప్రదీప్. ఆ లోటును తీర్చగలిగేవారు బయటివారైనా... ఒక అనుబంధం ఏర్పరచుకుంటారు. అలాంటిదే రాంహిత్ కుటుంబంతో ఏర్పడిన బంధం. తల్లి మనసులోని కోరిక ఏమిటి? ఆ కోర్కె తీర్చడానికి కొడుకు ఏం చేశాడనేది ఈ కథ. కథ చివరికొచ్చేసరికి చాలా హృద్యంగా అనిపిస్తుంది.
కథలే కాదు... డాక్టర్ నరహరి కవితల్లోనూ అంతే భావుకత కనిపిస్తుంది. అంతే భావోద్వేగాలు కనబడతాయి. 'వైద్యం లేని వ్యాధి' కవితలో- 'ఏ ప్రభూ...!/ దేహ వ్యాధులను సరిచేసే వైద్యానిచ్చావు/ సరే కానీ... ఒక్కసారి.../ మనోవికారాలను మంటగలిపే/ మంచి మందుని కూడా ఇవ్వు..!' అంటారు. లోతైన భావం ఈ కవితలో కనిపిస్తుంది. 'దయ్యాన్ని ఖద్దరులో కట్టేసినట్టు వాడు/ వాడో రాజకీయ నాయకుడు/ ఓట్లను కొంటాడు కోట్లను దోచుకుంటాడు' అంటూ 'డిఎన్‌ఎ' అనే కవితలో రాజకీయ డిఎన్‌ఎపై సెటైర్ వేస్తారు రచయిత.
ఈ పుస్తకంలోని కథలు, కవితల్లో ఎక్కువభాగం వైద్యపరిభాషతో పాటు ముంబాయి వీధులను కూడా పరిచయం చేస్తాడు రచయిత. కథలు, కవితలు కొన్నిటి గురించి మాత్రమే ఇక్కడ చెప్పినా... మిగతా కథలు, కవితలు కూడా చదివించేవిగా, వాస్తవికతను ప్రతిబింబించేవిగా వుంటాయి. ఒక డాక్టరుగా తన పరిశీలనలోని వాస్తవాలను... తనను విచలితున్ని చేసిన సంఘటనలను ఈ కథలలో చొప్పించి మెప్పించారు రచయిత.
- రాజాబాబు కంచర్ల
94900 99231
34 గోఖలే రోడ్ నార్త్
రచయిత : డాక్టర్ తాటి నరహరి
పేజీలు :100
వెల : 150
ప్రతులకు: 1604, బెల్లెజ్జా, 16ఫ్లోర్
భవానీ శంకర్ రోడ్
ధారా వెస్ట్, ముంబై -400128