Sep 25,2022 08:25

'కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా
హీనంగా చూడకు దేన్నీ
రొట్టెముక్కా, అరటి తొక్కా,బల్ల చెక్కా
నీవైపే చూస్తూ ఉంటారు తమ లోతు
కనుక్కోమంటారు అన్నారు' శ్రీశ్రీ.  
ప్రకృతిలోని మొక్కలన్నీ మన కాళ్లకు బంధాలు వేసి, పలకరిస్తుంటాయి. శ్రీశ్రీ పదబంధాలను గుర్తుచేస్తుంటాయి. గాలికి పెరిగే గడ్డి మొక్క, పెంచకుండా పెరిగే పిచ్చి మొక్క అన్నీ ఔషధగుణాలతో ఉన్న పోషక మణులే. మరి అవి మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందామా!!
గలిజేరు..

gagileru


గుండ్రని చిన్ని చిన్ని ఆకులు నేలంతా అలిమేసే మొక్క గలిజేరు. దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. ఎన్నో ఔషధ విలువలు ఉన్న దీనిని సంస్కతంలో స్వనాడిక, రక్తపుష్ప, పునర్నవ అంటారు. తెల్లపూలు పూస్తే తెల్ల గలిజేరని, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరని పిలుస్తారు. నేల మీద, సిమెంట్‌ గోడల మీద ఎలాంటి ప్రదేశంలోనైనా పెరగగలిగే మొక్క. కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌తో పాటు తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్‌ ఉంటాయి. కిడ్నీ సంబంధమైన వ్యాధులకు ఇది ఎంతో బాగా ఉపకరిస్తుంది. తరచూ ఆహారంలో తినడం వల్ల శరీరంలోని పోషక విలువలు పెరుగుతాయి. పప్పుతో కలిపి, కూర, వేపుడు, పచ్చళ్ళు, సూప్‌లుగా ఆహారంలో తీసుకోవచ్చు. ఔషధాలలో జెల్లీలు, టానిక్కులు, టాబ్లెట్ల తయారీలో వీటి ఆకులను వాడుతున్నారు. తెల్ల పూల కంటే నీలం పూలు ఉండే గలిజేరు మొక్క ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుందని చెప్తారు.
గంగవావిలి ఆకు..

g


గంగవాయిల, గంగవెల్లి, గంగ పాయిలాకు, నాచుపూల మొక్క అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చిన్న చిన్న ఆకులు దళసరిగా ఉండి, చిదిమితే ద్రవం కారుతుంది. తేమ ఉన్నచోట నేలంతా అల్లుకుని, చిన్న చిన్న పసుపుపచ్చ రంగు పూలతో అందంగా కనిపిస్తుంది. ఈ మొక్క నుంచి చిన్న కాడను నాటినా పెరుగుతుంది. ఈ మొక్కలో కొన్ని వ్యాధులను నివారించే ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆకులో విటమిన్‌ ఎ అధికంగా ఉండడంతో కంటిచూపు మెరుగుపరుస్తుంది. దీనిని కుండీల్లోనూ సంవత్సరం పొడుగునా పెంచుకోవచ్చు. ఈ ఆకుతో పప్పు, వేపుడు, కూర, సలాడ్‌ ఏవిధంగానైనా వండుకోవచ్చు.
పొన్నగంటి..

aku


పొన్నగంటి మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. అమరాంథేసి కుటుంబానికి చెందినది. అంగుళం పొడవున్న ఆకులతో, చిన్న చిన్న తెల్లటి పూలతో పెరుగుతాయి. పొన్నగంటి కూరలో విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, రైబో ఫ్లేవిన్‌, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌తోపాటు ప్రోటీన్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుకూరను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కూరను ఏ రూపంలోనైనా ఆహారంగా తీసుకోవచ్చు.
గురుగాకు..

garugaku


ఈ మొక్క ఆకులు రూపంలో, పరిమాణంలో గోరింటాకును పోలి ఉంటాయి. ఎర్రమట్టి నేలలు, కొండ నేలలు, పర్వతాల మీద పెరుగుతుంటాయి. గురుగాకులో విటమిన్‌ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడడానికి, రక్త శుద్ధికి ఈ ఆకు ఎంతో ఉపయోగపడుతుంది. గురుగాకు చట్నీ, వేపుడు, పప్పు కూరగా చేసుకోవచ్చు.
నిమ్మ గడ్డి..

gaddi


దీనినే ఆంగ్లంలో 'లెమన్‌ గ్రాస్‌' అని పిలుస్తారు. నిమ్మగడ్డి 3 నుండి 4 అడుగుల ఎత్తు వరకు గుబురుగా పెరిగే గడ్డి మొక్క. వర్షపునీటి ప్రవాహం వల్ల నేల కోత పడకుండా అరికట్టటానికి ఈ పంట ఉపయోగపడుతుంది. నిమ్మగడ్డి నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు. నిమ్మనూనె వాడకం ఇప్పటిది కాదు. వంటకాలలోనూ, పరిమళాల పరిశ్రమలలోనూ, సౌందర్య చికిత్సల్లో, ఇంకా విటమిను ఎ తయారీకి నిమ్మనూనెలో సిట్రాల్‌ అనే సువాసననిచ్చే రసాయనం ఉంటుంది. నిమ్మగడ్డి నూనె చెడు వాసనలను అరికట్టటానికి, చర్మ సౌందర్యానికి, యాంటీమైక్రోబియల్‌, యాంటీ పైరెటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలుండటం వలన మెడిసినల్‌గా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు సాయపడే టీ తయారీకి నిమ్మగడ్డిని ఉపయోగిస్తున్నారు.
- చిలుకూరి శ్రీనివాసరావు, 89859 45506