- బ్రస్సెల్స్‌లో ముగిసిన ప్రజా సదస్సు
బ్రస్సెల్స్ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ప్రజా సదస్సు (పీపుల్స్ సమ్మిట్) మంగళవారం ముగిసింది. లాటిన్ అమెరికా, యూరప్‌లకు చెందిన సామాజిక ఉద్యమాలు, ప్రగతిశీల శక్తులు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఒకపక్క సెలాక్, ఇయు దేశాల ప్రభుత్వాధినేతల మూడవ సమావేశం జరుగుతున్న సమయంలోనే మరోపక్క ఈ సామాజిక సదస్సు కూడా జరిగింది. సదస్సు చివరి రోజైన మంగళవారం జరిగిన చర్చలకు బ్రస్సెల్స్‌కి చెందిన ఫ్రీ యూనివర్శిటీ ఆతిథ్యమిచ్చింది. కొత్త కొత్త రూపాల్లో తలెత్తుతున్న యుద్ధం, నిరసన తెలిపే హక్కులపై చర్చలు జరిగాయి. ముగింపు సమావేశంలో తుది డిక్లరేషన్‌ను చదివి వినిపించారు.
సోమవారం నాటి సదస్సులో క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ మాట్లాడుతూ, లాటిన్ అమెరికా, కరేబియా దేశాల్లో ప్రగతిశీల, వామపక్ష శక్తులపై సామ్రాజ్యవాద దురాక్రమణలను తీవ్రంగా తిరస్కరించారు. ప్రస్తుతం తాము నేతృత్వం వహిస్తున్న సమాజాల్లోని నయా ఉదారవాద అనుభవాల ప్రభావాలను సరిదిద్దడానికి గానూ ఈ ప్రభుత్వాలు తమదైన కొత్త పంథాలను చూపిస్తున్నాయని అన్నారు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా మానవ హక్కుల ఉల్లంఘనలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. తమ దేశంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు దీన్నొక రాజకీయ సాధనంగా వాడుతూ సమర్ధించుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఆడే ఈ నీచపు క్రీడలో క్యూబా ఒక్కటే బాధితురాలు కాదని అన్నారు.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సదస్సులో ప్రసంగిస్తూ, ఈ పరిస్థితులు మారాలంటే మొత్తంగా వాతావరణంలో మార్పు రావాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రస్తుత ఉత్పాదకతా వ్యవస్థ, అధికార స్థానాలు, లాభాలు, పెట్టుబడిదారుల దురాశలతో ముడిపడిన సమీకరణ క్రమాలు ఇవన్నీ కలిసి మొత్తంగా వ్యవస్థనే మింగేసే శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయని పెట్రో పేర్కొన్నారు. ఒకే సమయంలో అనేక సంక్షోభాలు - వ్యాధులు, యుద్ధం, ఆర్థిక సంక్షోభం, వాతావరణ సంక్షోభం, దారిద్య్రం, ఆకలి వంటి సమస్యలన్నీ - చుట్టుముట్టడంతో అంతర్జాతీయంగా బహుళ సంక్షోభం నెలకొనే ప్రమాదముందని పెట్రో హెచ్చరించారు.










