Apr 05,2023 07:19

చార్జీల ఉత్తర్వులో కమిషన్‌ చూపిన అంచనాలకు మించి... విదేశీ బొగ్గును ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి వాడితే...ఆ విద్యుత్తును డిస్కామ్‌లు కొనుగోలు చేసిన మేరకు అయ్యే అదనపు అస్థిర చార్జీల మొత్తం వినియోగదారులపై ట్రూ అప్‌ భారంగా పడుతుంది. బొగ్గు వంటి విద్యుత్‌ ఉత్పత్తికి వాడే ఇంధనాల చార్జీలు, వాటి రవాణా చార్జీలు, వాటిపై కేంద్రం విధిస్తున్న పన్నులు, సుంకాలు వంటివి పెరిగినా సంబంధిత ఆర్థిక సంవత్సరానికి ట్రూఅప్‌ భారాలు పడతాయి.

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఎపిఇఆర్‌సి) 2023-24 సంవత్సరానికి ఇచ్చిన చార్జీల ఉత్తర్వులో, విద్యుత్‌ పంపిణీ కంపెనీల (డిస్కామ్‌) ప్రతిపాదనల ప్రకారం చార్జీలను పెంచలేదు. కమిషన్‌ నిర్ధారించిన డిస్కామ్‌ల రెవెన్యూ లోటు రూ.10,135.22 కోట్ల మొత్తాన్ని సబ్సిడీగా సమకూర్చేందుకు ప్రభుత్వం అంగీకరించటంతో చార్జీల పెంపు తప్పింది. విద్యుత్తును ఎక్కువగా వాడే ఫెర్రో ఎల్లార్సు వంటి పరిశ్రమలకు మాత్రం కొత్తగా కెవిఎకు నెలకు రూ.475 చొప్పున డిమాండు చార్జీల విధింపుకు అనుమతిస్తూ, డిస్కాములు ప్రతిపాదించిన మరో రెండు అంశాలను తిరస్కరించి కమిషన్‌ కొంత సమతూకాన్ని పాటించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల, రాష్ట్ర ప్ర భుత్వ నిర్ణయాల మూలంగా, కొన్ని అంశాలకు సంబంధించిన ప్రతిపాదనల అంచనాలను కమిషన్‌ మార్చిన తీరు వల్ల వినియోగదారులపై ట్రూఅప్‌ భారాలు గణనీయంగా పడనున్నాయి.
         మూడు డిస్కాములు మొదట వివిధ అంశాలకు సంబంధించిన అంచనాలను తరువాత సవరించాయి. డిస్కాములు అంచనా చూపిన మొత్తం రెవెన్యూ అవసరాన్ని రూ. 52,590.70 కోట్ల నుండి కమిషన్‌ రూ.49,267.36 కోట్లకు తగ్గించింది. డిస్కాములు సవరించి చూపిన రెవెన్యూ లోటును రూ.14,028.764 కోట్ల నుండి రూ.10,135.22 కోట్లకు కమిషన్‌ తగ్గించింది. గత కాలానికి సంబంధించిన ట్రూ డౌన్‌, వివిధ తరగతుల వినియోగదారులకు ప్రభుత్వమిచ్చిన రాయితీల మొత్తాలను రూ.1425.50 కోట్ల మేరకు సర్దుబాటు చేసి, కమిషన్‌ ఈ రెవెన్యూ లోటును నిర్ధారించింది. దానితో, ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం రూ.2559 కోట్ల మేరకు తగ్గింది. డిస్కాములు ప్రతిపాదించిన అంచనాల కన్నా కమిషన్‌ వేసిన అంచనాల ప్రకారం విద్యుత్‌ విక్రయాలు, ప్రసార, పంపిణీ నష్టాలు, విద్యుత్‌ కొనుగోలు అవసరాలు, కొనుగోలు వ్యయం, మొత్తం విద్యుత్‌ లభ్యత, విద్యుత్‌ మిగులు తక్కువగా ఉన్నాయి. ఆచరణలో ఈ అంచనాలు మారి అదనపు వ్యయం జరిగితే, ఆ మేరకు ట్రూ అప్‌ భారాలు పడతాయి.
 

                                                 విద్యుత్‌ లభ్యత, అవసరం, మిగులు అంచనాల తగ్గుదల

2023-24 సంవత్సరానికి 89,243.56 మి. యూ. లభ్యత, 76,774.32 మి.యూ అవసరం, 12,469.24 మి.యూ మిగులు ఉంటాయని డిస్కాములు కమిషన్‌కు సమర్పించిన తొలి అంచనాలలో చూపాయి. సవరించిన అంచనాలలో లభ్యతను 85,866.59 మి.యూ గా డిస్కాములు చూపగా, కమిషన్‌ దానినిన 78,282.26 మి.యూ.కు తగ్గించింది. డిస్కాములు మార్కెట్‌ కొనుగోళ్ళు అవసరం లేదని తొలి పతిపాదనలలో చూపగా, 15 నిమిషాల బ్లాకుల ప్రకారం విద్యుత్‌ అవసరాలను పరిగణన లోకి తీసుకుని ఏప్రిల్‌, అక్టోబరు, 2023, ఫిబ్రవరి, మార్చి 2024లలో 1561.53 మి.యూ. కొరత ఉంటుందని, దానిని ఇతర సమయాలలో లభ్యమయ్యే మిగులు విద్యుత్‌ తీర్చలేదని కమిషన్‌ నిర్ధారించింది. దానిని సర్దుబాటు చేసి, 5103.63 మి.యూ మిగులు విద్యుత్‌ తేలేందుకు అవకాశం ఉందని పేర్కొంది. సవరించిన అంచనాలలో ఎ.పి జెన్కో ధర్మల్‌ స్టేషన్ల నుండి విద్యుత్‌ లభ్యతను పిపిఎ లలో చూపిన దానికన్నా తక్కువగా 77.68 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫాక్టర్‌తో డిస్కామ్‌లు ప్రతిపాదించాయి. గత మూడేళ్ళలో ఆ ప్లాంట్లు చేసిన ఉత్పత్తి ఆధారంగా 68.97 శాతం పిఎల్‌ఎఫ్‌ తో ఇంకా 'తక్కువగా లభ్యతను లెక్కగట్టింది. ఆ విధంగా పిపిఎ లలో చూపిన 85 శాతం పిఎల్‌ఎఫ్‌ ప్రకారం లభించే జెన్కో ధర్మల్‌ విద్యుత్‌ లభ్యత 28,840.5 మి.యూ.ను కమిషన్‌ 20,154.38 మి.యూ. కు తగ్గించింది. నాలుగు కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టుల నుండి గత ఆర్థిక సంవత్సరంలో లాగానే 2023-24లో కూడా కమిషన్‌ పరిగణనలోకి తీసుకోలేదు.
 

                                                                   ట్రూ అప్‌ భారానికి కారణం ?

డిస్కాములు తొలుత చూపిన మిగులు విద్యుత్‌ 12,469 మీ.యూ. ను ఉత్పత్తి చేయవద్దని సంబంధిత ధర్మల్‌ ప్రాజెక్టులను ఆదేశిస్తే, రూ.1553.10 కోట్ల మేరకు స్థిర ఛార్జీలను చెల్లించాల్సి వస్తుందని అంచనా చూపాయి. కమిషన్‌ ఆమోదించిన లభ్యతలో 5103 మి.యూ. మిగులు విద్యుత్‌ ఉత్పత్తిని ఆ విధంగా తగ్గించాలని ఆదేశిస్తే చెల్లించాల్సిన స్థిర ఛార్జీలను విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో చేర్చింది. మిగులు విద్యుత్‌ లభ్యతను కమిషన్‌ తగ్గించి అంచనా వేసిన మేరకు స్థిర ఛార్జీలను విద్యుత్‌ కొనుగోలు వ్యయం నుంచి తగ్గించి చూపింది. పిపిఎ లలో చూపిన పిఎల్‌ఎఫ్‌ శాతాల ప్రకారం ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధతను ప్రకటిస్తే, అవసరం లేని అదనపు విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించిన మేరకు స్థిర చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. ఆ మొత్తాలను ఇంధన, విద్యుత్‌ కొనుగోలు వ్యయం సర్దుబాటు (ఎఫ్‌.పి.పి.సి.ఎ) రెగ్యులేషన్‌ ప్రకారం డిస్కాములు వినియోగదారుల నుండి వసూలు చేసేందుకు ట్రూఅప్‌ క్లెయిములు చేస్తాయి. పిఎల్‌ఎఫ్‌ ను పిపిఎ లలో చూపిన విధంగా పూర్తి ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థిర చార్జీలను విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో కమిషన్‌ చేర్చివుంటే అదనపు మొత్తాన్ని కూడా ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వాల్సి వచ్చేది. కమిషన్‌ చేసిన మార్పు వల్ల, అది తగ్గించిన మేరకు కూడా అదనంగా ఉత్పత్తి చేస్తామని సంబంధిత ప్రాజెక్టులు ప్రకటిస్తే, ప్రభుత్వం ఇచ్చి వుండాల్సిన సబ్సిడీని వినియోగదారులు ట్రూఅప్‌ కింద చెల్లించాల్సి వస్తుంది.
            పిఎల్‌ఎఫ్‌ శాతాన్ని తక్కువగా చూపి, ఎపిపిడిసిఎల్‌ ప్రాజెక్టు మొదటి దశ (1600 మె.వా.) ఉత్పత్తిని 16705.9 మి.యూ. నుండి 7884.52 మి.యూ కు కమిషన్‌ తగ్గించింది. అదే విధంగా, హిందూజా ప్రాజెక్టు (1040 మె.వా.) ఉత్పత్తిని 7240.4 మి.యూ. నుండి 65 68.85 మి.యూ కు కమిషన్‌ తగ్గించింది. వీటికి కూడా పైన వివరించిన విధంగా అదనంగా స్థిర చార్జీలను ట్రూఅప్‌ కింద వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. అయితే, అదనంగా లభించే విద్యుత్తును కమిషన్‌ పరిగణించిన కొరత సమయాలలో విద్యుత్‌ డిమాండును తీర్చడానికి సరఫరా చేయడానికి వీలైతే, ఆ మేరకు మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు అవసరం తగ్గుతుంది. ట్రూఅప్‌ భారం కూడా ఆ మేరకు తగ్గుతుంది.
       గ్యాస్‌ ఖరీదు చాలా అధికంగా ఉంటుందని డిస్కాములకు చెందిన గోదావరి గ్యాస్‌ పవర్‌ ప్రాజెక్టు (216 మె.వా.) నుండి విద్యుత్‌ ఉత్పత్తి ఉండదని డిస్కాంలు అంచనా చూపాయి. అయితే, గ్యాస్‌ ధరలు తగ్గే అవకాశాన్ని పరిగణించి, ఈ ప్రాజెక్టు నుండి 543.96 మీ.యూ. లభిస్తుందని కమిషన్‌ లెక్కగట్టింది. గ్యాస్‌ లభ్యత, దాని ధరను బట్టి వినియోగదారులపై ట్రూ అప్‌ భారాలు పడతాయా అనేది చూడాలి. కమిషన్‌ అంచనా వేసి, నిర్ణయించిన అస్థిర ఛార్జీలు గ్యాస్‌ ధరను బట్టి పెరిగితే, ఆ మేరకు వినియోగదారులపై ట్రూ అప్‌ భారాలు పడతాయి.
 

                                                  ట్రూ అప్‌ భారాలకు దారితీసే ఇతర అంశాలు

2023-24లో మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేసి, అనుమతించిన 1551.53 మి. యూ. కొనుగోలుకు చార్జీల గరిష్ట పరిమితిని యూనిట్‌కు రూ.5.31గా కమిషన్‌ నిర్ణయించింది. అంతకు మించిన చార్జీలకు డిస్కామ్‌లు మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తే, దానిని కమిషన్‌ తిరస్కరించబోదని ఇప్పటికే కమిషన్‌ ట్రూఅప్‌కు ఇచ్చిన ఉత్తర్వులో తీసుకున్న వైఖరి స్పష్టం చేస్తున్నది. కమిషన్‌ అంచనాకు మించి మార్కెట్లో డిస్కామ్‌లు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వచ్చినా, దానికి కమిషన్‌ అనుమతిస్తుందని ఆ వైఖరి స్పష్టం చేస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో ట్రూఅప్‌ భారాలు పెరుగుతాయి.
         కేంద్ర ప్రసార సంస్థ పిజిసిఐఎల్‌ కు డిస్కామ్‌లు చెల్లించాల్సిన అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీలను అవి ప్రతిపాదించిన రూ.1698.54 కోట్ల నుండి కమిషన్‌ రూ.1500 కోట్లకు తగ్గించింది. సిఇఆర్‌సి సవరించిన నిబంధనల ప్రకారం పిజిసిఐఎల్‌ ఏమేరకు అధిక మొత్తాలను బిల్లులో చూపితే ఆ మేరకు ట్రూఅఫ్‌ చార్జీల భారం వినియోగదారులపై పడుతుంది.
       చార్జీల ఉత్తర్వులో కమిషన్‌ చూపిన అంచనాలకు మించి...విదేశీ బొగ్గును ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి వాడితే...ఆ విద్యుత్తును డిస్కామ్‌లు కొనుగోలు చేసిన మేరకు అయ్యే అదనపు అస్థిర చార్జీల మొత్తం వినియోగదారులపై ట్రూ అప్‌ భారంగా పడుతుంది. బొగ్గు వంటి విద్యుత్‌ ఉత్పత్తికి వాడే ఇంధనాల చార్జీలు, వాటి రవాణా చార్జీలు, వాటిపై కేంద్రం విధిస్తున్న పన్నులు, సుంకాలు వంటివి పెరిగినా సంబంధిత ఆర్థిక సంవత్సరానికి ట్రూఅప్‌ భారాలు పడతాయి. హిందూజా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు డిస్కాములు చెల్లించే భారీ అదనపు మొత్తాలు కమిషన్‌ తీసుకునే నిర్ణయాన్ని బట్టి వినియోగదారులపై ట్రూఅప్‌ భారాలుగా పడతాయా లేదా అనేది తేలుతుంది. ఇవన్నీ విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించిన ట్రూఅప్‌ చార్జీలు. కేంద్రం ప్రతిపాదించిన టైమ్‌ ఆఫ్‌ ద డే (టిఒడి) చార్జీలు అమలులోకి వస్తే, సంబంధిత ఆర్థిక సంవత్సరానికి చార్జీలు పెరుగుతాయి లేదా ట్రూ అప్‌ భారాలు పడతాయి. వెర్రితలలు వేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాల కింద ఏ రోజు ఏ అడ్డగోలు ఉత్తర్వులు జారీ అవుతాయో, ఎలా వినియోగదారులపై భారాలు పెరుగుతాయనేది నిలుపు లేని ప్రక్రియగా నడుస్తున్నది. ఇవిగాక, కమిషన్‌ అయిదేళ్ళకు ఒకసారి ఇస్తున్న ఉత్తర్వులలో అనుమతించిన వాటికన్నా మించి ప్రసార పంపిణీ వ్యవస్థలకయ్యే ఖర్చులు పెరిగితే, ఆ నియంత్రణ కాలమంతటికీ కలిపి ట్రూఅప్‌ భారాలు వినియోగదారులపై పడతాయి.

/వ్యాసకర్త విద్యుత్‌ రంగ నిపుణులు,
సెల్‌ : 9441193749/
ఎం. వేణుగోపాలరావు

ఎం. వేణుగోపాలరావు