Sep 16,2022 13:02

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రజలకు పోలీసులు రక్షణ కల్పిస్తారు. ఇది సాధారణమైన విషయమే. అయితే ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ పాములు.. పోలీసులకు రక్షణ కల్పిస్తున్నాయి. స్టేషన్‌ చుట్టూ వందలాది పాములు 24 గంటలూ ఆన్‌డ్యూటీలో ఉంటూ పహారా కాస్తుంటే.. పోలీసులు ప్రశాంతంగా వారి విధులు నిర్వహించుకుంటున్నారు. ఇదేంటి వినడానికే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. కేరళ - తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో కుంబుమెట్టు పోలీస్‌స్టేషన్‌ ఉంది. ఈ స్టేషన్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల.. కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఆ కోతుల్ని పోలీసులు ఎంత తరిమికొట్టినా.. మళ్లీ మళ్లీ స్టేషన్‌ చుట్టుముట్టి అధికారుల్ని ఇబ్బందిపెట్టేవి. దీంతో అక్కడి పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. చైనాలో తయారైన రబ్బరు పాములను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి.. స్టేషన్‌ చుట్టూ ఉండే చెట్లపై అమర్చారు. ఆ రబ్బరు పాములు నిజమైన పాముల్లా.. కోతులకు కనిపించాయి. దీంతో వానరమూక స్టేషన్‌ వైపే వెళ్లడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా అక్కడ పనిచేసే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పీకే లాల్‌భారు వెల్లడించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. 'ఓ ఐడియా వల్ల స్టేషన్‌కు కోతుల బెడద తప్పిందని' ఆయన అన్నారు.

snacks