ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో 28,46,43,842 మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 11 వరకు ఈ శ్రమ పోర్టల్‌లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులు 31 రంగాలకు చెందిన 28,46,43,842 మంది ఉన్నారని తెలిపారు.
రూ.581 నుంచి రూ.1,053కి పెరిగిన గ్యాస్ ధర
దేశంలో రెండున్నరేళ్లలో వంట గ్యాస్ ధర దాదాపు రూ.500 వరకు పెరిగింది. ఈ మేరకు లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మే 1 నాటికి దేశంలో వంట గ్యాస్ ధర రూ.581 ఉండగా, అది 2022 డిసెంబర్ 1 నాటికి రూ.1,053కి పెరిగింది.
ప్రభుత్వ రంగం బీమా కంపెనీల్లో ఐదేళ్లలో 20 శాతం ఉద్యోగలు తగ్గుదల
గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బీమా కంపెనీ (పిఎస్‌ఐసి)ల్లో ఉద్యోగుల సంఖ్య 20 శాతం తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రి భగవత్ కరాద్ తెలిపారు. సిపిఎం ఎంపి ఎఎ రహీం అడిగిన ప్రశ్నకు ఆయన లికితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018 మార్చి 31 నాటికి ఏడు బీమా కంపెనీల్లో 1,73,797 మంది ఉద్యోగులు ఉంటే, 2022 మార్చి 31 నాటికి 1,48,266 మంది ఉద్యోగులకు పడిపోయిందని తెలిపారు. ఈ కాలంలో 34,531 మంది ఉద్యోగులు తగ్గారు.
ఎపిలో 3,985 పరిహారం కేసులు పెండింగ్
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల కోసం భూ సేకరణ చేసిన వారికి పరిహారానికి సంబంధించిన 3,985 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2,781 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.










